రూపాయి పతనం.. ఎన్నికల గిమ్మిక్కా? | Is Rupee downfall a election gimmick? | Sakshi
Sakshi News home page

రూపాయి పతనం.. ఎన్నికల గిమ్మిక్కా?

Published Tue, Sep 17 2013 2:05 AM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM

రూపాయి పతనం.. ఎన్నికల గిమ్మిక్కా? - Sakshi

రూపాయి పతనం.. ఎన్నికల గిమ్మిక్కా?

ఎలక్షన్లు వస్తున్నాయంటే పార్టీలకు ఎంత టెన్షనో. ఎన్నికల ఖర్చు భారీగా పెట్టాలి. దానికి నిండా సొమ్ములుండాలి. అందుబాటులో ఉండే పారిశ్రామిక వర్గాలతో పాటు విదేశాల నుంచి విరాళాలు సమకూర్చుకోవాల్సిందే. దీనంతటికీ ఏడాది ముందునుంచే పార్టీల కసరత్తు మొదలవుతుంది. విదేశాల నుంచి వచ్చే డాలర్లను నేరుగా ఖర్చు చేయలేం కనక మన రూపాయిల్లోకి మార్చుకోవాల్సిందే. అందుకే... ఒక పక్క రూపాయి విలువ పాతాళానికి పడిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ దిగాలు పడుతుంటే... పార్టీలు మాత్రం లోలోపల పండుగ చేసుకుంటాయట. ఔనా! నిజమా!! అనే సందేహం సహజమే అయినా... గడిచిన కొన్నేళ్లుగా ప్రతిసారీ ఎన్నికల ముందు రూపాయి పడిపోవటం... విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనుకావటం చూస్తే మాత్రం దీన్లో లాజిక్ ఉందనిపించకమానదు. 
 
 ఈ ఏడాది ఏప్రిల్‌లో డాలరుతో రూపాయి మారకం విలువ 52. ఈ నెల్లో ఒకదశలో రూ.69కి కూడా చేరిపోయింది. ఇపుడు కొంచెం తగ్గి మళ్లీ రూ.63 స్థాయికి వచ్చింది. 20 శాతం పైగానే పడింది. అంటే 52 నుంచి 69 మధ్య చూసినపుడు ఐదునెలల వ్యవధిలో ఒక దశలో డాలరుకు 17 రూపాయలు అదనంగా వచ్చే పరిస్థితి నెలకొందన్న మాట. మరో రకంగా చూస్తే... లోక్‌సభ ఎన్నికలకు (వచ్చే మే నెలలో) సరిగ్గా ఏడాది ముందునుంచి రూపాయి పతనబాట పట్టడం మొదలైనట్లు లెక్క. ఏడాది క్రితం విదేశాల నుంచి ఏదైనా రాజకీయ పార్టీకి ఒక డాలరు విరాళం వస్తే.. ఇక్కడ దాదాపు 45-50 రూపాయలు చేతికొచ్చేవి. మరి ఇప్పుడో 65 రూపాయలు ఖాతాలో పడతాయి. అంటే అప్పుడూ ఇప్పుడూ అదే డాలరు వస్తుంది.
 
 కానీ అప్పనంగా 15-20 రూపాయలు అదనపు ఆదాయమన్నమాట. గడిచిన కొన్నేళ్లుగా అంటే 1989 నుంచి ఇప్పటిదాకా జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏడాది ముందునుంచే రూపాయి భారీగా పతనం అవడం అనేక అనుమానాలను తావిస్తోందనేది విశ్లేషకుల వాదన. పాలక పక్షాలు కావాలనే రూపాయి విలువ పడిపోయేలా చేస్తూ ఎన్నికల ఖర్చుకోసం అదనంగా డబ్బు దండుకునే పన్నాగానికి పాల్పడుతున్నాయని కొంతమంది పరిశీలకులు కొత్త సిద్ధాంతాలను లేవనెత్తుతున్నారు కూడా.
 గతాన్ని చూస్తే లాజిక్కుంది: ‘ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే డబ్బును నీళ్లలా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి తరుణంలో మన కరెన్సీ రూపాయి భారీగా పడిపోయిందనుకోండి.
 
 విదేశాల నుంచి వచ్చే డాలర్లపై అదనంగా రూపాయలు వస్తాయి. ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇప్పుడు రూపాయి పతనంపై కచ్చితంగా అనుమానాలొస్తాయి’ అని కేఆర్ చోక్సీ సెక్యూరిటీస్ ఎండీ దేవెన్ చోక్సీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితులతో పాటు ఇంకా అనేక కారకాలు కూడా రూపాయి క్షీణతకు కారణమవుతున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. 1989 నుంచి ఇప్పటిదాకా మొత్తం ఏడుసార్లు సాధారణ ఎన్నికలు జరగగా.. ఆరు సార్లు ఆ ఎన్నికలకు ముందు రూపాయి భారీగా కుప్పకూలడం... ఈ సిద్ధాంతానికి బలం చేకూరుస్తోంది. అయితే, 2004లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు మాత్రం రూపాయి పడిపోకుండా కాస్త బలపడటం విశేషం.
 
 అబ్బే ఇదంతా ఒట్టిదే: మార్కెట్ వర్గాలు
 రూపాయి విలువను రాజకీయ పక్షాలు తమ అవసరాల కోసమే పడేస్తున్నాయన్న వాదనను చాలామంది ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఈ వాదన వినడానికి ఆసక్తికరంగానే ఉన్నా... ఒట్టి కాకతాళీయమేనని అంటున్నారు. 1991కి ముందు రూపాయి మారకం విలువను ప్రభుత్వమే నిర్ధారించింది. ఆ తర్వాత ప్రభుత్వ నియంత్రణ నుంచి రూపాయిని తప్పించారు. ఫారెక్స్ మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ వర్గాలే (అంటే ట్రేడర్లు, బ్యాంకులు, విదేశీ ఇన్వెస్టర్లు ఇతరత్రా) రూపాయి విలువను నిర్ధేశిస్తున్నారు. దీనిప్రకారం చూస్తే 1991కి ముందు అయితే ఇలాంటివి జరిగేందుకు ఆస్కారం ఉండొచ్చని..
 
 అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి గిమ్మిక్కులు కష్టమేననేది ఆర్థికవేత్తల విశ్లేషణ. 2000 సంవత్సరంలో డాట్‌కామ్ బబుల్ బద్దలైనప్పుడు... ఆ తర్వాత 2001లో అమెరికాలో వరల్డ్‌ట్రేడ్ టవర్లను ఉగ్రవాదులు కూల్చేసిన సమయంలో డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఎలక్షన్లు, రూపాయి పతనానికి లింకు అనేది అర్ధరహితమని మోతీలాల్ ఓశ్వాల్ సెక్యూరిటీస్ చైర్మన్ మోతీలాల్ ఓశ్వాల్ పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఆగిపోవడం, పెట్టుబడులను వెనక్కితీసుకోవడం, 
 
దేశీయంగా నెలకొన్ని ఆర్థిక మందగమనం ఇతరత్రా కారకాలే రూపాయి పతనానికి కారణమని మెక్వారీ క్యాపిటల్‌కు చెందిన రాకేశ్ అరోరా చెప్పారు. గత ఎన్నికలకు (2009) ముందు కూడా అంటే... 2008-2009 మధ్య రూపాయి విలువ 28 శాతంపైగా పడిపోయింది. దీనికి అప్పట్లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం కారణమైందనేది ఆర్థిక నిపుణుల వాదన. ఇప్పుడు కూడా ఆర్థిక మందగమనం, అమెరికాలో సహాయ ప్యాకేజీల ఉపసంహరణ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల అప్రమత్త ధోరణే దేశీ కరెన్సీ క్షీణతకు దారితీశాయనేది మార్కెట్ వర్గాల అభిప్రాయం. 
 
 రూపాయికి ఎన్నికల ‘గ్రహణం’.. 
 ఎన్నికల తేదీ రూపాయి విలువ 6 నెలల ముందుతో 9 నెలల ముందుతో ఏడాది ముందుతో
  (డాలర్‌తో) పోలిస్తే పతనం(%) పోలిస్తే పతనం(%) పోలిస్తే పతనం(%)
 22 నవంబర్, 1989 16.9 -4.1 -10.7 -12.4
 12 జూన్, 1991 21.0 -16.3 -18.3 -20.4
 27 ఏప్రిల్, 1996 34.3 +1.6(వృద్ధి) -9.2 -9.2
 16 ఫిబ్రవరి, 1998 38.9 -8.5 -8.3 -8.2
 5 సెప్టెంబర్, 1999 43.5 -2.4 -2.2 -2.2
 20 ఏప్రిల్, 2004 44.0 +2.9(వృద్ధి) +5.1(వృద్ధి) +7.2(వృద్ధి)
 16 ఏప్రిల్,2009 49.8 -1.8 -15.5 -24.5
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement