
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి తగిన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో ఒకటి అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు గణనీయంగా తగ్గుతుండడం. దీంతో దేశీయ కరెన్సీ కూడా కనిష్ట స్థాయిల నుంచి రికవరీ అవుతుండడం మరో సానుకూల అంశం. మంగళవారం ముగింపుతో పోల్చితే రూపాయి 50 పైసలు బలపడి 72.50 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు చూస్తే...
∙దేశీయ ప్రధాన దిగుమతి కమోడిటీ అయితే బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో శుక్రవారం కీలక మద్దతు స్థాయి 70 డాలర్ల దిగువకు దిగింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 69.15 డాలర్లను చూసిన బ్రెంట్ ధర ఈ వార్తరాసే సమయం రాత్రి 8 గంటలకు 69.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్ ఈ ఏడాది 86.74 డాలర్ల గరిష్ట స్థాయిని చూసింది. 52 వారాల కనిష్టస్థాయి 61.08 డాలర్లు కావడం గమనార్హం.
∙ఇక లైట్‌స్వీట్ క్రూడ్ బ్యారల్ ధర ఇంట్రాడేలో 59.28 డాలర్లను చూసింది. ఈ వార్తరాసే సమయానికి 59.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన 52 వారాల్లో లైట్ స్వీట్ కనిష్ట–గరిష్ట ధరల శ్రేణి 54.81–76.90 డాలర్లుగా ఉంది.
∙ఒకవైపు సరఫరాలు పెరుగుతుండగా, మరోవైపు ఆర్థికవృద్ధి ధోరణి బలహీనపడుతోందన్న విశ్లేషణలు క్రూడ్‌కు సంబంధించి ఇన్వెస్టర్ డిమాండ్‌ను నీరుగారుస్తోంది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఆంక్షలను 8 దేశాలపై సడలించడం కూడా క్రూడ్ ధర దిగిరావడానికి కారణం.
∙క్రూడ్ బిల్లు తగ్గడం భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి విదేశీ మారకద్రవ్యాల రాకపోకల మధ్య నికర వ్యత్యాసం) తగ్గుదలకు దోహదపడే అంశం. దేశంపై క్యాడ్ భారం తగ్గుతుందన్న అంచనాలు రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి.
∙క్రూడ్ ధరలు దిగి వచ్చిన నేపథ్యంలో బ్యాంకులు, దిగుమతిదారులు డాలర్ అమ్మకాలు జరిపాయి.
∙ఆయా అంశాల నేపథ్యంలో మంగళవారం 73 వద్ద ముగిసిన రూపాయి (బుధ, గురువారాలు సెలవు) శుక్రవారం ప్రారంభంతోటే పటిష్టంగా 72.68 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 72.45కు కూడా చేరింది. గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 62 పైసలు బలపడింది.
∙అక్టోబర్ 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద రూపాయి విలువ ముగిసింది. అయితే అటు తర్వాత తీవ్ర ఒడిదుడుకులతో ప్రస్తుత స్థాయి (72.50)కి రికవరీ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment