Domestic currency
-
ఐదు రోజుల పరుగుకు రూపాయి బ్రేక్
ముంబై: ఐదు ట్రేడింగ్ సెషన్ల నుంచి లాభాల బాటన పయనించిన దేశీయ కరెన్సీ రూపాయి శుక్రవారం నష్టపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 25పైసలు బలహీనపడి 74.15 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో మార్చి నుంచి వడ్డీరేట్ల పెంపు ఖాయమని ఫెడరల్ రిజర్వ్ అధికారులు చేసిన కామెంట్స్ పలు వర్థమాన దేశాల కరెన్సీల బలహీనతకు, డాలర్ బలోపేతానికి దారితీశాయ. దేశ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్లోనూ ఇదే ధోరణి కనిపించింది. గురువారం రూపాయి ముగింపు 73.90. శుక్రవారం ట్రేడింగ్‌లో రోజంతా 74.05 గరిష్ట– 74.21 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. నాలుగు వారాలుగా లాభాల్లోనే... వారం వారీగా చూస్తే రూపాయి విలువ డాలర్ మారకంలో 19 పైసలు బలపడింది. నాలుగు వారాలుగా రూపాయి నికరంగా లాభాల బాటన నడుస్తోంది. గడచిన నెల రోజుల్లో 2.6 శాతం లాభపడింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల ధోరణి లేకపోతే, రూపాయి ఈ కాలంలో మరింత బలోపేతం అయ్యేదని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.11 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్థిరంగా 95 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కొత్త వేరియంట్ ఒమిక్రాన్, వడ్డీరేట్లపై ఫెడ్ నిర్ణయాలు, దేశీయ మార్కెట్ల పనితీరు వంటి అంశాలపై ఆధారపడి రూపాయి తదుపరి కదలికలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
మూడో రోజూ రూపాయి వీక్
ముంబై: వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ బలహీనపడింది. డాలరుతో మారకంలో 23 పైసలు క్షీణించి 73.25 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొలుత 11 పైసలు తక్కువగా 73.13 వద్ద నీరసంగా ప్రారంభమైంది. అయితే తదుపరి కోలుకుని ఇంట్రాడేలో 72.93 వద్ద గరిష్టానికి చేరింది. ఆపై బలహీనపడుతూ ఒక దశలో 73.29కు చేరింది. చివరికి 73.25 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో 53 పైసలు కోల్పోయింది. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో అమ్మకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు డాలరు ఇండెక్స్ బలపడుతూ వస్తోంది. తాజాగా 0.3 శాతం ఎగసి 92.22కు చేరింది. దీంతో రూపాయి నీరసిస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ సెనేట్ 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, ఉపాధి గణాంకాలు పుంజుకోవడం, బాండ్ల ఈల్డ్స్ బలపడటం, అధిక క్రూడ్ ధరలు వంటి అంశాలతో డాలరు దాదాపు 4 నెలల గరిష్టానికి చేరింది. -
చల్లారిన చమురు.. రూపాయికి జోష్!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి తగిన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో ఒకటి అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు గణనీయంగా తగ్గుతుండడం. దీంతో దేశీయ కరెన్సీ కూడా కనిష్ట స్థాయిల నుంచి రికవరీ అవుతుండడం మరో సానుకూల అంశం. మంగళవారం ముగింపుతో పోల్చితే రూపాయి 50 పైసలు బలపడి 72.50 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు చూస్తే... ∙దేశీయ ప్రధాన దిగుమతి కమోడిటీ అయితే బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో శుక్రవారం కీలక మద్దతు స్థాయి 70 డాలర్ల దిగువకు దిగింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 69.15 డాలర్లను చూసిన బ్రెంట్ ధర ఈ వార్తరాసే సమయం రాత్రి 8 గంటలకు 69.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్ ఈ ఏడాది 86.74 డాలర్ల గరిష్ట స్థాయిని చూసింది. 52 వారాల కనిష్టస్థాయి 61.08 డాలర్లు కావడం గమనార్హం. ∙ఇక లైట్‌స్వీట్ క్రూడ్ బ్యారల్ ధర ఇంట్రాడేలో 59.28 డాలర్లను చూసింది. ఈ వార్తరాసే సమయానికి 59.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన 52 వారాల్లో లైట్ స్వీట్ కనిష్ట–గరిష్ట ధరల శ్రేణి 54.81–76.90 డాలర్లుగా ఉంది. ∙ఒకవైపు సరఫరాలు పెరుగుతుండగా, మరోవైపు ఆర్థికవృద్ధి ధోరణి బలహీనపడుతోందన్న విశ్లేషణలు క్రూడ్‌కు సంబంధించి ఇన్వెస్టర్ డిమాండ్‌ను నీరుగారుస్తోంది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఆంక్షలను 8 దేశాలపై సడలించడం కూడా క్రూడ్ ధర దిగిరావడానికి కారణం. ∙క్రూడ్ బిల్లు తగ్గడం భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి విదేశీ మారకద్రవ్యాల రాకపోకల మధ్య నికర వ్యత్యాసం) తగ్గుదలకు దోహదపడే అంశం. దేశంపై క్యాడ్ భారం తగ్గుతుందన్న అంచనాలు రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. ∙క్రూడ్ ధరలు దిగి వచ్చిన నేపథ్యంలో బ్యాంకులు, దిగుమతిదారులు డాలర్ అమ్మకాలు జరిపాయి. ∙ఆయా అంశాల నేపథ్యంలో మంగళవారం 73 వద్ద ముగిసిన రూపాయి (బుధ, గురువారాలు సెలవు) శుక్రవారం ప్రారంభంతోటే పటిష్టంగా 72.68 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 72.45కు కూడా చేరింది. గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 62 పైసలు బలపడింది. ∙అక్టోబర్ 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద రూపాయి విలువ ముగిసింది. అయితే అటు తర్వాత తీవ్ర ఒడిదుడుకులతో ప్రస్తుత స్థాయి (72.50)కి రికవరీ అయ్యింది. -
రెండేళ్ల కనిష్టానికి రూపాయి
44 పైసలు క్షీణత, 67.29 స్థాయికి ముంబై: దేశీ కరెన్సీ క్షీణత కొనసాగుతోంది. గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ 44 పైసలు దిగజారి 67.29 వద్ద ముగిసింది. ఇది రెండేళ్లకుపైగా కనిష్టస్థాయి కావడం గమనార్హం. 2013, సెప్టెంబర్ 3 తర్వాత(67.63) మళ్లీ ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. రూపాయి చరిత్రాత్మక కనిష్టస్థాయి 68.85 (2013, ఆగస్టు 28న). ప్రధానంగా బ్యాం కులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్ల పతనం రూపాయి సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 66.85తో పోలిస్తే భారీ నష్టంతో 66.98 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆతర్వాత పతనం మరింత తీవ్రత 67.30 స్థాయికి క్షీణించింది. -
రుపీ పతనంతో రెమిటెన్స్‌లు జూమ్
ముంబై: దేశీ కరెన్సీ రోజురోజుకీ బలహీనపడుతున్న నేపథ్యంలో ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు) దేశంలోకి పంపుతున్న విదేశీ నిధులు(రెమిటెన్స్) పుంజుకుంటున్నాయి. ఈ ఏడాది నవంబర్ నుంచీ డాలరుతో మారకంలో రూపాయి పతనమవుతూ వస్తున్న కారణంగా సంపన్న వర్గాల(హెచ్ఎన్ఐలు) నుంచి ఇండియాకు రెమిటెన్స్‌లు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ చెల్లింపుల సర్వీసుల సంస్థ యూఏఈ ఎక్స్ఛేంజ్ సమాచారం ప్రకారం గత వారం గరిష్ట స్థాయి రెమిటెన్స్‌ల పరిమాణం 70% పుంజుకుంది. ఇక వ్యాపార పరిమాణం 20% ఎగసినట్లు యూఏఈ ఎక్స్ఛేంజ్ ట్రెజరీ వైస్‌ప్రెసిడెంట్ అశ్విన్ శెట్టి చెప్పారు. ఎన్ఆర్ఐలు కనిష్టంగా రూ. 25 లక్షల నుంచి గరిష్టంగా రూ. 5 కోట్ల వరకూ రెమిటెన్స్‌లను జమ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ మనీ వైస్‌ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ సుధేష్ గిరియన్ సైతం ఇదే విధమైన వివరాలు వెల్లడించారు. అధిక విలువగల రెమిటెన్స్‌లు ఇటీవల 15-20% మధ్య పుంజుకున్నట్లు తెలిపారు. గరిష్ట స్థాయిలో ఆదాయం పొందే వ్యక్తులు రూపాయి బలహీనతను సొమ్ము చేసుకునేందుకు వీలుగా అధిక మొత్తాల్లో డాలర్లను జమ చేస్తున్నట్లు వివరించారు. కాగా, డాలరుతో మారకంలో రూపాయి నవంబర్ 3న 61.40గా నమోదుకాగా, తాజాగా 13 నెలల కనిష్టమైన 63.61కు చేరింది. ఇది 4% పతనం. గతేడాది 70 బిలియన్ డాలర్లు నిజానికి గతేడాది కూడా రెమిటెన్స్‌లు భారీ స్థాయిలో ఎగశాయి. మొత్తం 70 బిలియన్ డాలర్లమేర నిధులు దేశానికి తరలివచ్చాయి. ఈ బాటలో చైనాకు 60 బిలియన్ డాలర్లు, ఫిలిప్పీన్స్‌కు 25 బిలియన్ డాలర్లు చొప్పున రెమిటెన్స్‌లు వెల్లువెత్తాయి. కాగా, ప్రపంచబ్యాంక్ వివరాల ప్రకారం 2012లో కూడా 69 బిలియన్ డాలర్లమేర రెమిటెన్స్‌లు భారత్‌కు లభించాయి. -
పతన బాటలోనే రూపాయి
మరో 59 పైసలు ఆవిరి... 63.53 వద్ద క్లోజ్ 13 నెలల కనిష్ట స్థాయి ఇది.. ముంబై: రూపాయి పతనం మరింత తీవ్రతరమవుతోంది. వరుసగా రెండోరోజూ దేశీ కరెన్సీ భారీగా పడింది. మంగళవారం డాలరుతో రూపాయి మారకం విలువ మరో 59 పైసలు నష్టపోయింది. క్రితం ముగింపు 62.94తో పోలిస్తే 0.94 శాతం దిగజారి 63.53 వద్ద ముగిసింది. ఇది 13 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటం.. మరోపక్క ముడిచమురు(క్రూడ్) ధర శరవేగంగా పడిపోతుండటంతో దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం రూపాయి విలువను ఆవిరయ్యేలా చేస్తోంది. కాగా, ఈ పతనానికి అడ్డుకట్టవేయడం కోసం ఆర్బీఐ డాలర్ల విక్రయం ద్వారా కొంత జోక్యం చేసుకున్నప్పటికీ... ఫలితాలివ్వడం లేదని ఫారెక్స్ మార్కెట్ డీలర్లు పేర్కొన్నారు. అంతేకాకుండా నేడు(బుధవారం) 64 స్థాయి దిగువకు పడిపోయే అవకాశం కూడా ఉందనేది వారి అంచనా. సోమవారం కూడా రూపాయి 65 పైసలు క్షీణించింది. వెరసి 2 రోజుల్లో 124 పైసలు(2%) ఆవిరైంది. కాగా, డాలరుతో రూపాయి విలువ దీర్ఘకాలంపాటు 62 దిగువన గనుక కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులేనని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ‘లోటు’ గుబులు... విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) అమ్మకాలు జోరందుకోవడంతో... మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 538 పాయింట్లు, నిఫ్టీ 152 పాయింట్ల చొప్పున పడిపోయాయి. ఇది కూడా దేశీ కరెన్సీ సెంటిమెంట్‌ను దిగజార్చింది. ఇదిలాఉంటే.. నవంబర్ నెలలో భారత్ వాణిజ్య లోటు ఏడాదిన్నర గరిష్టస్థాయిలో 16.8 బిలియన్ డాలర్లకు పెరిగిపోవడం కూడా రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర మంగళవారం మరింత దిగజారి 54 డాలర్లకు(నెమైక్స్ బ్యారల్ రేటు) పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ 60 డాలర్ల దిగువకు చేరింది. రూబుల్ ఆల్‌టైమ్ కనిష్టానికి... క్రూడ్ ధరల పతనం.. ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావంతో రష్యా కరెన్సీ కుదేలవుతోంది. కొద్దిరోజులుగా పతనబాటలోనే ఉన్న డాలరుతో రూబుల్ విలువ.. మంగళవారం ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఏకంగా 18 శాతంపైగా కుప్పకూలి.. 80ని తాకింది. 1998లో ఆర్థిక సంక్షోభం తర్వాత రష్యా కరెన్సీ ఇంతలా కుప్పకూలడం ఇదే తొలిసారి. కాగా, కరెన్సీ క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం సోమవారం పొద్దుపోయాక అకశ్మాత్తుగా రష్యా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీరేటును 10.5 శాతం నుంచి 17 శాతానికి అమాంతం పెంచేసింది. గత గురువారం వడ్డీరే టును 5.5% నుంచి తొలుత 10.5 శాతానికి పెంచి ంది. అయితే, ఈ చర్యలకు ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది రష్యా కరెన్సీ 50% పైగా ఆవిరికావడం గమనార్హం. క్రూడ్, ఇతరత్రా ఇంధన వనరులపైనే అత్యధికంగా ఆధారపడిన రష్యా ఆర్థిక వ్యవస్థ.. తాజా పరిణామాలతో వచ్చే ఏడాదిలో మళ్లీ ఆర్థిక మాంద్యంలో చిక్కుకోనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, అంతర్జాతీయంగా డాలరు విలువ బలపడుతుండటంతో... వర్ధమాన దేశాల్లోని ఇతర కరెన్సీలు కూడా తీవ్రంగా క్షీణిస్తున్నాయి. -
రూపాయికీ సెగ
ముంబై: ఇరాక్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు రూపాయిపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. సరఫరాపరమైన సమస్యలు తలెత్తవచ్చన్న ఆందోళలనల కారణంగా అంతర్జాతీయంగా చమురు రేట్లు ఎగయడంతో శుక్రవారం దేశీ కరెన్సీ భారీగా పతనం అయ్యింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 52 పైసలు క్షీణించి 59.77 వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి 24 తర్వాత ఒక్కరోజులో ఇంతగా క్షీణించడం ఇదే ప్రథమం. ఆ రోజున రూపాయి మారకం విలువ 73 పైసలు పతనమైంది. ఇరాక్‌లో మిలిటెంట్లు చెలరేగిపోతుండటం వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తొమ్మిది నెలల గరిష్టానికి ఎగిశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రిస్కులను తగ్గించుకునేందుకు డాలర్ల వైపు చూస్తుండటం వల్ల అమెరికా కరెన్సీ బలపడుతోందని, రూపాయి మారకం క్షీణిస్తోందని ట్రేడర్లు తెలిపారు. దేశీ స్టాక్‌మార్కెట్ల పతనం కూడా రూపాయి క్షీణతకు కారణమైందని వివరించారు. -
రూపాయి పతనం.. ఎన్నికల గిమ్మిక్కా?
ఎలక్షన్లు వస్తున్నాయంటే పార్టీలకు ఎంత టెన్షనో. ఎన్నికల ఖర్చు భారీగా పెట్టాలి. దానికి నిండా సొమ్ములుండాలి. అందుబాటులో ఉండే పారిశ్రామిక వర్గాలతో పాటు విదేశాల నుంచి విరాళాలు సమకూర్చుకోవాల్సిందే. దీనంతటికీ ఏడాది ముందునుంచే పార్టీల కసరత్తు మొదలవుతుంది. విదేశాల నుంచి వచ్చే డాలర్లను నేరుగా ఖర్చు చేయలేం కనక మన రూపాయిల్లోకి మార్చుకోవాల్సిందే. అందుకే... ఒక పక్క రూపాయి విలువ పాతాళానికి పడిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ దిగాలు పడుతుంటే... పార్టీలు మాత్రం లోలోపల పండుగ చేసుకుంటాయట. ఔనా! నిజమా!! అనే సందేహం సహజమే అయినా... గడిచిన కొన్నేళ్లుగా ప్రతిసారీ ఎన్నికల ముందు రూపాయి పడిపోవటం... విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనుకావటం చూస్తే మాత్రం దీన్లో లాజిక్ ఉందనిపించకమానదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో డాలరుతో రూపాయి మారకం విలువ 52. ఈ నెల్లో ఒకదశలో రూ.69కి కూడా చేరిపోయింది. ఇపుడు కొంచెం తగ్గి మళ్లీ రూ.63 స్థాయికి వచ్చింది. 20 శాతం పైగానే పడింది. అంటే 52 నుంచి 69 మధ్య చూసినపుడు ఐదునెలల వ్యవధిలో ఒక దశలో డాలరుకు 17 రూపాయలు అదనంగా వచ్చే పరిస్థితి నెలకొందన్న మాట. మరో రకంగా చూస్తే... లోక్‌సభ ఎన్నికలకు (వచ్చే మే నెలలో) సరిగ్గా ఏడాది ముందునుంచి రూపాయి పతనబాట పట్టడం మొదలైనట్లు లెక్క. ఏడాది క్రితం విదేశాల నుంచి ఏదైనా రాజకీయ పార్టీకి ఒక డాలరు విరాళం వస్తే.. ఇక్కడ దాదాపు 45-50 రూపాయలు చేతికొచ్చేవి. మరి ఇప్పుడో 65 రూపాయలు ఖాతాలో పడతాయి. అంటే అప్పుడూ ఇప్పుడూ అదే డాలరు వస్తుంది. కానీ అప్పనంగా 15-20 రూపాయలు అదనపు ఆదాయమన్నమాట. గడిచిన కొన్నేళ్లుగా అంటే 1989 నుంచి ఇప్పటిదాకా జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏడాది ముందునుంచే రూపాయి భారీగా పతనం అవడం అనేక అనుమానాలను తావిస్తోందనేది విశ్లేషకుల వాదన. పాలక పక్షాలు కావాలనే రూపాయి విలువ పడిపోయేలా చేస్తూ ఎన్నికల ఖర్చుకోసం అదనంగా డబ్బు దండుకునే పన్నాగానికి పాల్పడుతున్నాయని కొంతమంది పరిశీలకులు కొత్త సిద్ధాంతాలను లేవనెత్తుతున్నారు కూడా. గతాన్ని చూస్తే లాజిక్కుంది: ‘ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే డబ్బును నీళ్లలా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి తరుణంలో మన కరెన్సీ రూపాయి భారీగా పడిపోయిందనుకోండి. విదేశాల నుంచి వచ్చే డాలర్లపై అదనంగా రూపాయలు వస్తాయి. ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇప్పుడు రూపాయి పతనంపై కచ్చితంగా అనుమానాలొస్తాయి’ అని కేఆర్ చోక్సీ సెక్యూరిటీస్ ఎండీ దేవెన్ చోక్సీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితులతో పాటు ఇంకా అనేక కారకాలు కూడా రూపాయి క్షీణతకు కారణమవుతున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. 1989 నుంచి ఇప్పటిదాకా మొత్తం ఏడుసార్లు సాధారణ ఎన్నికలు జరగగా.. ఆరు సార్లు ఆ ఎన్నికలకు ముందు రూపాయి భారీగా కుప్పకూలడం... ఈ సిద్ధాంతానికి బలం చేకూరుస్తోంది. అయితే, 2004లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు మాత్రం రూపాయి పడిపోకుండా కాస్త బలపడటం విశేషం. అబ్బే ఇదంతా ఒట్టిదే: మార్కెట్ వర్గాలు రూపాయి విలువను రాజకీయ పక్షాలు తమ అవసరాల కోసమే పడేస్తున్నాయన్న వాదనను చాలామంది ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఈ వాదన వినడానికి ఆసక్తికరంగానే ఉన్నా... ఒట్టి కాకతాళీయమేనని అంటున్నారు. 1991కి ముందు రూపాయి మారకం విలువను ప్రభుత్వమే నిర్ధారించింది. ఆ తర్వాత ప్రభుత్వ నియంత్రణ నుంచి రూపాయిని తప్పించారు. ఫారెక్స్ మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ వర్గాలే (అంటే ట్రేడర్లు, బ్యాంకులు, విదేశీ ఇన్వెస్టర్లు ఇతరత్రా) రూపాయి విలువను నిర్ధేశిస్తున్నారు. దీనిప్రకారం చూస్తే 1991కి ముందు అయితే ఇలాంటివి జరిగేందుకు ఆస్కారం ఉండొచ్చని.. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి గిమ్మిక్కులు కష్టమేననేది ఆర్థికవేత్తల విశ్లేషణ. 2000 సంవత్సరంలో డాట్‌కామ్ బబుల్ బద్దలైనప్పుడు... ఆ తర్వాత 2001లో అమెరికాలో వరల్డ్‌ట్రేడ్ టవర్లను ఉగ్రవాదులు కూల్చేసిన సమయంలో డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఎలక్షన్లు, రూపాయి పతనానికి లింకు అనేది అర్ధరహితమని మోతీలాల్ ఓశ్వాల్ సెక్యూరిటీస్ చైర్మన్ మోతీలాల్ ఓశ్వాల్ పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఆగిపోవడం, పెట్టుబడులను వెనక్కితీసుకోవడం, దేశీయంగా నెలకొన్ని ఆర్థిక మందగమనం ఇతరత్రా కారకాలే రూపాయి పతనానికి కారణమని మెక్వారీ క్యాపిటల్‌కు చెందిన రాకేశ్ అరోరా చెప్పారు. గత ఎన్నికలకు (2009) ముందు కూడా అంటే... 2008-2009 మధ్య రూపాయి విలువ 28 శాతంపైగా పడిపోయింది. దీనికి అప్పట్లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం కారణమైందనేది ఆర్థిక నిపుణుల వాదన. ఇప్పుడు కూడా ఆర్థిక మందగమనం, అమెరికాలో సహాయ ప్యాకేజీల ఉపసంహరణ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల అప్రమత్త ధోరణే దేశీ కరెన్సీ క్షీణతకు దారితీశాయనేది మార్కెట్ వర్గాల అభిప్రాయం. రూపాయికి ఎన్నికల ‘గ్రహణం’.. ఎన్నికల తేదీ రూపాయి విలువ 6 నెలల ముందుతో 9 నెలల ముందుతో ఏడాది ముందుతో (డాలర్‌తో) పోలిస్తే పతనం(%) పోలిస్తే పతనం(%) పోలిస్తే పతనం(%) 22 నవంబర్, 1989 16.9 -4.1 -10.7 -12.4 12 జూన్, 1991 21.0 -16.3 -18.3 -20.4 27 ఏప్రిల్, 1996 34.3 +1.6(వృద్ధి) -9.2 -9.2 16 ఫిబ్రవరి, 1998 38.9 -8.5 -8.3 -8.2 5 సెప్టెంబర్, 1999 43.5 -2.4 -2.2 -2.2 20 ఏప్రిల్, 2004 44.0 +2.9(వృద్ధి) +5.1(వృద్ధి) +7.2(వృద్ధి) 16 ఏప్రిల్,2009 49.8 -1.8 -15.5 -24.5