
ముంబై: ఐదు ట్రేడింగ్ సెషన్ల నుంచి లాభాల బాటన పయనించిన దేశీయ కరెన్సీ రూపాయి శుక్రవారం నష్టపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ 25పైసలు బలహీనపడి 74.15 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో మార్చి నుంచి వడ్డీరేట్ల పెంపు ఖాయమని ఫెడరల్ రిజర్వ్ అధికారులు చేసిన కామెంట్స్ పలు వర్థమాన దేశాల కరెన్సీల బలహీనతకు, డాలర్ బలోపేతానికి దారితీశాయ. దేశ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్‌లోనూ ఇదే ధోరణి కనిపించింది. గురువారం రూపాయి ముగింపు 73.90. శుక్రవారం ట్రేడింగ్‌లో రోజంతా 74.05 గరిష్ట– 74.21 కనిష్ట స్థాయిల మధ్య
కదలాడింది.
నాలుగు వారాలుగా లాభాల్లోనే...
వారం వారీగా చూస్తే రూపాయి విలువ డాలర్ మారకంలో 19 పైసలు బలపడింది. నాలుగు వారాలుగా రూపాయి నికరంగా లాభాల బాటన నడుస్తోంది. గడచిన నెల రోజుల్లో 2.6 శాతం లాభపడింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల ధోరణి లేకపోతే, రూపాయి ఈ కాలంలో మరింత బలోపేతం అయ్యేదని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.11 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్థిరంగా 95 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కొత్త వేరియంట్ ఒమిక్రాన్, వడ్డీరేట్లపై ఫెడ్ నిర్ణయాలు, దేశీయ మార్కెట్ల పనితీరు వంటి అంశాలపై ఆధారపడి రూపాయి తదుపరి కదలికలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.