ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ భారీగా చరిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ సోమవారం 54 పైసలు పతనమై 77.44కు పడిపోయింది. క్రితం ట్రేడింగ్ సెషన్‌లో (శుక్రవారం) రూపాయి 55 పైసలు పతనమై 76.90కి చేరింది. అదే వరవడిని కొనసాగిస్తూ, సోమవారం ట్రేడింగ్‌లో బలహీనంగా 77.17 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ఒక దశలో 77.55 కనిష్టాన్ని చూసింది. చివరికి స్వల్పంగా 11పైసలు కోలుకుని 77.44 వద్ద ముగిసింది. క్రితం కన్నా ఇది 54 పైసలు పతనం. క్రితం రెండు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 109 పైసలు నష్టపోవడం గమనార్హం. రూపాయి కదలికలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ మార్చి 8వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్టం 77.05 స్థాయిని చూస్తే, ముగింపులో 77గా ఉంది. రూపాయికి సోమవారం వరకూ ఇవి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. అటు తర్వాత రూపాయి స్వల్ప ఒడిదుడుకులతో 76 వరకూ బలపడినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. కేవలం రెండు నెలలు తిరిగేసరికే రూపాయి మరింత కిందకు జారిపోవడం కరెన్సీ బలహీనతలను తెలియజేస్తోంది.
► అంతక్రితం కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్ 22వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92ని చూసింది. ముగింపులో 2020 ఏప్రిల్ 16వ తేదీన రికార్డు పతనం 76.87. ఆ తర్వాత కొంత బలపడినా, తిరిగి ఆ స్థాయిని కోల్పోడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది.
► అమెరికా వడ్డీరేట్ల పెంపు, దీనితో ఆ దేశానికి తిరిగి డాలర్ల రాక డాలర్ ఇండెక్స్ బలోపేతానికి కారణమవుతోంది. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ అరశాతంపైగా నష్టంతో 77.55 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్
యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదికన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 103.64 వద్ద ట్రేడవుతోంది.
మరింత క్షీణత..!
రూపాయి సమీప కాలంలోనే 77.80 స్థాయికి పతనం కావచ్చన్నది మా అంచనా. బలమైన డాలర్ ఇండెక్స్, అమెరికాలో ట్రెజరీ ఈల్డ్‌లు పెరుగుదల, ఆసియా సహచర కరెన్సీల బలహీనతల నేపథ్యంలో భారత్ రూపాయి విలువ తాజాగా రికార్డు స్థాయికి పడిపోయింది. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఈక్విటీ మార్కెట్లను కూడా తీవ్ర అనిశ్చితికి, బలహీనతకు గురిచేస్తోంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు అధిక రేట్ల పెంపు అవసరాన్ని అంచనా వేస్తున్న పెట్టుబడిదారులు, ప్రస్తుతం మార్కెట్‌లో రిస్క్ చేయడానికి విముఖతను వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిని మించి (2–6%) ద్రవ్యోల్బణం పెరుగుదల, క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంశాలు కూడా దేశీయ ఈక్విటీల నుంచి ఎఫ్‌ఐఐలు వెనక్కు మళ్లడానికి కారణం అవుతున్నాయి. ఆర్‌బీఐ ఎంపీసీ మే 4 మధ్యంతర పరపతి సమీక్ష రూపాయికి తక్షణం మద్దతును అందించలేకపోయింది.
– రాయిస్ వర్గీస్ జోసెఫ్
కరెన్సీ అండ్ ఎనర్జీ రీసెర్చ్ అనలిస్ట్, ఆనంద్ రాఠి
Comments
Please login to add a commentAdd a comment