ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ‘కనిష్ట పతన రికార్డులు’ కొనసాగుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో శుక్రవారం రూపాయి విలువ 19 పైసలు నష్టపోయి 77.93కు పతనమైంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, దేశం నుంచి విదేశీ నిధులు భారీగా వెనక్కు మళ్లడం, ఈక్విటీ మార్కెట్ల పతనం, అంతర్జాతీయంగా డాలర్ బలోపేత ధోరణి రూపాయి బలహీనతలకు ప్రధాన కారణాలు. రూపాయి గురువారం ముగింపు 77.74. ఇంట్రాడేలో జీవితకాల కనిష్ట స్థాయి 77.81ని చూసింది. అయితే శుక్రవారం ట్రేడింగ్‌లో 77.81 వద్దే ప్రారంభమైంది. 77.79 స్థాయిని దాటి ఏ దశలోనూ బలపడలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి 80 వరకూ బలహీనపడే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇక ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనంగా 77.90 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 104.20 వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్, నైమెక్స్ క్రూడ్ బేరల్‌కు 120 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇదిలావుండగా, జూన్ 3తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వల పరిస్థితి 601.057 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం వారంతో పోల్చితే 306 మిలియన్ డాలర్లు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment