
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో సోమవారం ఒకేరోజు 76 పైసలు బలహీనపడింది. 76.93 స్థాయికి రూపాయి పతనమైంది. రూపాయి ఈ కనిష్ట స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఒక దశలో రూపాయి 84పైసలు నష్టంతో 77.01 స్థాయిని సైతం చూసింది.
కదలికలు ఇలా...
దేశీయ కరెన్సీ ముగింపు శుక్రవారం 76.17. సోమవారం ట్రేడింగ్‌లో తీవ్ర బలహీన స్థాయిలో 76.85 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రతి దశలోనూ బలహీనంగానే కదలాడింది.
కారణాలు ఇవీ...
► రష్యాపై ఉక్రెయిన్ దాడులు. నాటో దళాలు కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా యుద్ధంలోకి వస్తాయన్న వదంతులు.
► దీనితో దేశీయ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం. బంగారం, వెండి వంటి సురక్షిత సాధనల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల మొగ్గు.
► క్రూడాయిల్ ధరల పెరుగుదల. ఇది దేశంలో ఆయిల్ సంక్షోభానికి తద్వారా పెట్రో ధరల మంటకు వెరసి ద్రవ్యోల్బణం, వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య ఉన్న నికర వ్యత్యాసం) తీవ్రతకు, కరెంట్ అకౌంట్ (ఒక దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యాన్ని ప్రతిబింబించే గణాంకాలు)భారీ లోటుకు దారితీస్తాయన్న ఆందోళనలు.
అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితి..
ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ రూపాయికిపైగా బలహీనతతో 76.91 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిప దికన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 99 వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది.
79 దిశగా పయనం..!
అంతర్జాతీయ క్రూడ్ ధరల తీవ్రత రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టి ంగ్ సంస్థ–మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సీఈఓ వ్యవస్థాపకుడు నిష్ భట్ పేర్కొన్నారు. క్రూడ్ ధరలు మరింత పైకి ఎగసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది రూపాయిని సమీప కాలంలో 79 దిశగా బలహీనపరుస్తాయన్నది తమ అంచనా అని తెలిపారు.
2020 ఏప్రిల్ తర్వాత...
రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కరోనా సవాళ్లు, ఆందోళనలు, లాక్‌డౌన్ పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం వంటి అంశాలు దీనికి నేపథ్యం.
130 డాలర్లు దాటిన క్రూడాయిల్ ధర
2008 తరువాత గరిష్ట స్థాయి
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులుసహా పలు కీలక పరిణామాల నేపథ్యంలో సరఫరాలపై తలెత్తిన ఆందోళనలు సోమవారం క్రూడాయిల్ ధరలను 2008 గరిష్ట స్థాయిలకు చేర్చాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 2 శాతం పైగా లాభంతో 121.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో ఎగసి 117.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ రెండు విభాగాల్లో ధరలు 130 డాలర్లు చూడ్డం గమనార్హం. 2008 తరువాత ఇంత తీవ్రస్థాయిలో క్రూడ్ ధరలు చూడ్డం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఈ స్థాయిని చూసింది.
ఐదు ప్రధాన కారణాలు..!
► రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించే అవకాశాలను అమెరికా, యూరోపియన్ భాగస్వామ్య దేశాలు పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటన చేశారు. రోజుకు దాదాపు 7 మిలియన్ బ్యారళ్ల ఉత్పత్తి లేదా ప్రపంచ సరఫరాలో 7 శాతం (ఉత్పత్తిలో 10%) ఎగుమతులతో ఇందుకు సంబంధించి రష్యా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. అమెరికా మంత్రి తాజా ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాలకు సవాళ్లు తప్పవన్న ఆందోళనలు నెలకొన్నాయి.
► ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యా నౌకాశ్రయాల నుంచి కజికిస్తాన్‌కు చెందిన చమురు ఎగుమతులకు కూడా తీవ్ర విఘాతం కలుగుతోంది.
► దీనికి తోడు లిబియా చేసిన ఒక కీలక ప్రకటన చమురు ధర తీవ్రత కారణమైంది. ఒక సాయు« ద సమూహం రెండు కీలకమైన చమురు క్షేత్రాలను మూసివేసిందని లిబియా జాతీయ చమురు కంపెనీ ప్రకటించింది. ఈ చర్య వల్ల దేశం రోజువారీ చమురు ఉత్పత్తి 3,30,000 బ్యారళ్లకు
పడిపోయిందని ప్రకటించింది.
► ఇరాన్‌పై 2015 ఆంక్షల ఎత్తివేత చర్చల్లోకి ‘ఆ దేశంతో రష్యా వాణిజ్య సంబంధాలను లాగొద్దని’ అమెరికాకు రష్యా డిమాండ్ చమురు ధర భారీ పెరుగుదలకు కారణమైంది. దీనితో ఈ చర్చలపై అనిశ్చితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment