ఒకవైపు మండిపోతున్న ముడి చమురు ధరలు, మరోవైపు తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల.. వెరసి మన రూపాయికి పెద్ద కష్టమే తెచ్చిపెట్టాయి. ప్రధానమైన ఈ రెండింటితో పాటు ఇతరత్రా కారణాలతో దేశీ కరెన్సీ నిత్యం క్షీణిస్తోంది. కొత్త రికార్డు స్థాయిలకు పతనమవుతోంది. తాజాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం ఆల్–టైమ్ కనిష్ట స్థాయి 77.81కి పతనమైంది.
చివరికి కొంత కోలుకుని అంతక్రితం రోజుతో పోలిస్తే 6 పైసల నష్టంతో 77.74 వద్ద క్లోజయ్యింది. ఇది ఇక్కడితో ఆగేలా లేదు. క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 125 డాలర్ల పైన స్థిరపడితే మార్కెట్లు మరింత అతలాకుతలం కానున్నాయి. దీంతో దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం తీవ్రమైతే.. రూపాయిపై ఒత్తిడి ఇంకా పెరిగిపోతుందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తదితర విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మనకేంటి..
2017 మేలో 64 రూపాయలు ఇస్తే ఒక అమెరికన్ డాలర్ లభించేది. కానీ ప్రస్తుతం అదే డాలర్‌కు 77 రూపాయలు పైగా ఇవ్వాల్సి వస్తోంది. అంటే గడిచిన అయిదేళ్లలో మన కరెన్సీ విలువ ఏకంగా రూ. 13 పైగా పడిపోయింది. డాలర్ రూపాయి పతనమైతే మనకేమిటి, పెరిగితే మనకేమిటి అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన రోజువారీ కొనుగోళ్లన్నీ దీని విలువతోనే ముడిపడి ఉన్నాయి. రూపాయి కాస్త తగ్గితే ఎగుమతులపరంగా ప్రయోజనకరమే అయినా దిగుమతులు మొదలుకుని పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో, ద్రవ్యోల్బణం, ఈఎంఐలు, విదేశీ విద్యలాంటి అనేకానేక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మన ఇంధన అవసరాల్లో 85 శాతం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది.
దీనికి డాలర్ల మారకంలో చెల్లించాలి. రూపాయి విలువ పడిపోయిందంటే మరిన్ని ఎక్కువ డాలర్లు ఇచ్చి క్రూడాయిల్ తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఆయా ఉత్పత్తుల రేట్లు దేశీయంగా మరింత పెరుగుతాయి. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం స్థాయికి ఎగిసింది. దీంతో ధరలను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను అయిదు వారాల వ్యవధిలో దాదాపు 1 శాతం (0.90 శాతం) మేర పెంచింది. దీనికి తగ్గట్లుగా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచేయడం ప్రారంభించాయి. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీలు, నెలవారీ వాయిదాల భారం మరింత పెరుగుతోంది.
పెట్టుబడులపై ప్రభావం..
ఇక దేశీ కరెన్సీ క్షీణతతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటాయి. వారు తమ పెట్టుబడులను డాలర్ల రూపంలోనే వెనక్కి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రూపాయికి డిమాండ్ మరింత పడిపోయి, కరెన్సీ ఇంకా క్షీణించే అవకాశం ఉంది. ఇక విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో దేశీ ఈక్విటీ మార్కెట్లు కూడా క్షీణిస్తాయి. ఫలితంగా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన దేశీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. భారీ స్థాయి క్రూడాయిల్ రేట్లు, ద్రవ్యోల్బణం, విదేశాల్లో సెంట్రల్ బ్యాంకులు కఠినతర విధానాలు అమలు చేస్తుండటం, మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తదితర అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాల అంచనా.
విదేశీ చదువు .. ప్రయాణాలు భారం..
విదేశాల్లో విద్య కోసం, విదేశీ ప్రయాణాల కోసం ప్లానింగ్ చేసుకునే వారిపైనా రూపాయి పతన ప్రభావం పడుతుంది. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 21 శాతం పైగా ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు కొన్నాళ్ల క్రితం విదేశీ విద్య కోసం రూ. 20 లక్షలు ఖర్చయితే ఇప్పుడు రూ. 24 లక్షలపైగా ఖర్చవుతుంది. ఇదే కాదు, విదేశీ ప్రయాణాలు కూడా భారం అవుతాయి. దేశీ కరెన్సీ మారకం విలువ పడిపోవడం వల్ల ఇతర దేశాల కరెన్సీలను కొనుగోలు చేసేందుకు మరిన్ని ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో విదేశీ యాత్రల కోసం మరింత ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది.
రూపాయి పతనం, పెరగడం ఎందుకు..
అంతర్జాతీయంగా కరెన్సీ లావాదేవీలకు సంబంధించి ప్రస్తుతం అమెరికా డాలర్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన యూరో ప్రామాణికంగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా బ్యాంకుల దగ్గర ఉన్న విదేశీ కరెన్సీల్లో డాలర్ వాటా 64 శాతంగాను, యూరోల వాటా 20 శాతంగాను ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బడా ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం భారీ స్థాయిలో భారత్ వంటి మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం అమెరికాలోను ద్రవ్యోల్బణం పెరిగిపోయి, వడ్డీ రేట్లు పెంచుతుండటంతో ఇన్వెస్టర్లు మన మార్కెట్లలోని పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు.
దీంతో పరిమిత స్థాయిలో లభించే డాలర్లకు డిమాండ్ పెరిగి, మన కరెన్సీ విలువ తగ్గుతోంది. ఇక ప్రత్యేకంగా భారత్ విషయానికొస్తే ఎగుమతులతో పోలిస్తే దిగుమతులే ఎక్కువగా ఉంటున్నాయి. క్రూడాయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్ వంటివి ఈ లిస్టులో ఉంటున్నాయి. వీటికి డాలర్లలో చెల్లించాల్సి ఉంటోంది. ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ ఉండటం వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి, మన కరెన్సీ విలువ క్రమంగా కరుగుతూ వస్తోంది. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ పరిణామాలతో క్రూడాయిల్ సహా పలు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్లుగానే వాటిని భారత్ సహా దిగుమతి చేసుకునే దేశాల్లో రేట్లు మండిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment