ముంబై: ఈ ఏడాది చివరి వారం స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేకపోవడంతో పాటు ఆయా దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయకపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల, డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు అంశాలతో అప్రమత్తత చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి.
‘‘రక్షణాత్మక రంగాలైన ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారంలో సాంకేతికంగా నిఫ్టీ 17,000 స్థాయిని నిలుపుకుంది. మార్కెట్ కరెక్షన్ కొనసాగితే దిగువ స్థాయిలో 16,700 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,650 వద్ద మద్దతు లభించవచ్చు. ఒకవేళ దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభిస్తే 17,150–17,200 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్
మీనా తెలిపారు.
గతవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా.., రక్షణాత్మక రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 113 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు స్వల్ప లాభంతో గట్టెక్కాయి.
ఒమిక్రాన్ వ్యాప్తి ప్రభావం
ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. దేశంలో శనివారం నాటికి 150 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో సహా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. వైరస్ కట్టడికి అనేక పలు దేశాల ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలను, కర్ఫ్యూలను విధిస్తుండటం వల్ల ఆర్థిక రివకరీకి ప్రతికూలం కావచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలతో ట్రేడర్లు తమ పొజిషన్లను పరిమితం చేసుకుంటున్నారు.
గురువారం ఎఫ్‌అండ్‌ఓ ముగింపు
ఈ గురువారం(ఈ నెల 30న) నిఫ్టీ సూచీకి చెందిన డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
దేశీయ మార్కెట్లో మూడు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ డిసెంబర్‌లో ఇప్పటి వరకు రూ.17,825 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఏడాది ముగింపు వారంలో అమ్మకాల తీవ్రత తక్కువగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో అస్థితరత తగ్గితే ఎఫ్‌ఐఐల విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు.
సూక్ష్మ ఆర్థిక గణాంకాలు
నవంబర్ నెల ద్రవ్యలోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలతో పాటు సెప్టెంబర్ క్వార్టర్‌కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లెక్కలు శుక్రవారం విడుదల కానున్నాయి. అదేరోజున డిసెంబర్ 17తో ముగిసిన వారం డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి, డిసెంబర్ 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను గణాంకాలను ఆర్‌బీఐ విడుదల చేయనుంది.
మూడు లిస్టింగ్‌లు
ఇటీవల ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించిన మూడు కంపెనీల షేర్లు ఈ వారంలో లిస్ట్ కానున్నాయి. హెచ్‌పీ అడెసివ్స్ షేర్లు సోమవారం(27న).., సుప్రియ లైఫ్‌సైన్సెన్స్ షేర్లు మంగళవారం(28న), సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ షేర్లు ఏడాది చివరిరోజున(డిసెంబర్ 31న) లిస్ట్‌కానున్నాయి. ఈ అంశమూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు.
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్!
Published Mon, Dec 27 2021 6:12 AM | Last Updated on Mon, Dec 27 2021 6:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment