రూ.1.79 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి | Dalal Street Investors Poorer By Rs 1.79 Lakh Crore | Sakshi
Sakshi News home page

రూ.1.79 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి

Oct 3 2018 5:17 PM | Updated on Nov 9 2018 5:34 PM

Dalal Street Investors Poorer By Rs 1.79 Lakh Crore - Sakshi

స్టాక్‌ మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : ఆయిల్‌ ధరలు భారీగా పెరగడం, రూపాయి విలువ అంతకంతకు క్షీణించడం నేడు స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్‌ 550 పాయింట్ల క్రాష్‌ అయి, మూడు నెలల కనిష్ట స్థాయిలకు పడిపోయింది. చివరి గంట ట్రేడింగ్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కుప్పకూల్చింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా హరించుకుపోయింది. బీఎస్‌ఈలో లిస్ట్‌ అయిన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్ నేడు ఒక్కరోజే ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయింది. దీంతో బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.145.43 లక్షల కోట్ల నుంచి రూ.143.64 లక్షల కోట్లకు పడిపోయింది. ఆగస్టు 31 నుంచి ఇప్పటి వరకు బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ మొత్తంగా రూ.15.74 లక్షల కోట్లు క్షీణించింది. 
 
క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో, నేటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ భారీగా క్రాష్‌ అయి, మొట్టమొదటిసారి 73 మార్కు దిగువకు పడిపోయింది.  73.42 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయిలను నమోదు చేసింది.  అమెరికన్‌ కరెన్సీకి దిగుమతిదారుల నుంచి మంచి డిమాండ్‌ నెలకొనడం కూడా రూపాయిని దెబ్బకొట్టింది. మరోవైపు బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర ఒక్కో బ్యారల్‌కు 85 డాలర్లను మించిపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు ఈ విధంగా పడిపోవడం 2014 తర్వాత ఇదే మొదటిసారి. ఏప్రిల్‌ నుంచి బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు 20 శాతానికి పైగా ఎగిశాయి. రూపాయి విలువ మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్పారు. 

రూపాయి విలువలో స్థిరత్వం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, అవి ఏవీ మార్కెట్లను సానుకూలంగా నడిపించలేకపోయాయి. అటు నిఫ్టీలో కూడా మెజార్టీ స్టాక్స్‌ నష్టాలే పాలయ్యాయి. మహింద్రా అండ్‌ మహింద్రా 7.03 శాతం, ఐషర్‌ మోటార్స్‌ 6.79 శాతం, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 6.45 శాతం, టీసీఎస్‌ 4.38 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 3.62 శాతం డౌనయ్యాయి. కోర్‌ సెక్టార్‌ డేటా కూడా నేడు మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఎనిమిది మౌలిక సదుపాయాల రంగాల వృద్ధి ఆగస్టు నెలలో 4.2 శాతానికి పడిపోయింది. ఇదే జూలై నెలలో  7.3 శాతంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement