కెవ్వు.. క్రూడ్‌! | Stock Market Logs Modest Gain Amid Turbulent Oil Prices | Sakshi
Sakshi News home page

కెవ్వు.. క్రూడ్‌!

Published Wed, Sep 18 2019 4:52 AM | Last Updated on Wed, Sep 18 2019 4:53 AM

Stock Market Logs Modest Gain Amid Turbulent Oil Prices - Sakshi

ముడి చమురు ధరలు పెరగడం దేశ ద్రవ్య స్థితిగతులను మరింత అస్తవ్యస్తం చేయగలదన్న భయాలతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ కీలకమైన 36,500 పాయింట్లు, నిఫ్టీ 10,850 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సౌదీ అరేబియా ఆయిల్‌ ప్లాంట్లపై గత శనివారం డ్రోన్‌ దాడుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 71.78కు చేరడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలు ఆరంభించడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో 704 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్‌ చివరకు 642 పాయింట్ల నష్టంతో 36,481 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 186 పాయింట్లు పతనమై 10,818 పాయింట్ల వద్దకు చేరింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 904 పాయింట్లు, నిఫ్టీ 258 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

ఒడిదుడుకులు కొనసాగుతాయ్‌...
ముడి చమురు ధరలు ఎగబాకడం, రూపాయి బలహీనపడటంతో సమీప భవిష్యత్తులో ఆరి్థక పరిస్థితి కోలుకునే సూచనలు లేవన్న భయాందోళనతో అమ్మకాలు వెల్లువెత్తాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిందని పేర్కొన్నారు. వడ్డీరేట్ల విషయమై అమెరికా  కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ నేడు (బుధవారం) ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదో అన్న అప్రమత్తత నెలకొన్నదని చెప్పారు.. ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుత స్థితిగతులను బట్టి చూస్తే, సమీప భవిష్యత్తులో మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోగలవని రెలిగేర్‌ బ్రోకింగ్‌ విశ్లేషకులు అజిత్‌ మిశ్రా అంచనా వేస్తున్నారు.  

►31 సెన్సెక్స్‌ షేర్లలో కేవలం మూడు షేర్లు... హిందుస్తాన్‌ యూనిలివర్, ఏషియన్‌ పెయింట్స్, ఇన్ఫోసిస్‌లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి.  

►చమురు ధరలు పెరిగితే వాహన విక్రయాలు మరింతగా తగ్గగలవన్న ఆందోళనతో వాహన షేర్లు పడిపోయాయి. హీరో మోటొకార్ప్‌ 6 శాతం నష్టంతో రూ. 2,570 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అధికంగా నష్టపోయిన షేర్‌ ఇదే. నిఫ్టీ వాహన సూచీలోని 15 షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి.
 
►క్రూడ్‌ పెరిగితే ద్రవ్యోల్బణం ఎగుస్తుందనే అంచనాలతో బ్యాంక్‌ షేర్లు పతనమయ్యాయి.  

►ఎమ్‌ఎమ్‌టీసీ, ఎస్‌టీసీ కంపెనీలను మూసివేయడం కానీ, వేరే కంపెనీల్లో విలీన చేయడం కానీ ఏదో ఒకటి చేస్తామని ప్రభుత్వం వెల్లడించడంతో ఈ షేర్లు 20 శాతం వరకూ నష్టపోయాయి. ఎమ్‌ఎమ్‌టీసీ 17 శాతం నష్టపోయి రూ. 21 వద్ద ఎస్‌టీసీ 20 శాతం పతనమై రూ. 107 వద్ద ముగిశాయి.

ఆల్‌టైమ్‌ హైకి ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌
స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయినప్పటికీ, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,725ను తాకింది. చివరకు 2.4 శాతం లాభంతో రూ.1,693 వద్ద ముగిసింది.  ఈ షేర్‌తో పాటు వినతి ఆర్గానిక్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కూడా ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి.  

పతనానికి ప్రధాన కారణాలు...

చమురు భయాలు...
సౌదీ అరేబియా ఆయిల్‌ ప్లాంట్లపై డ్రోన్‌ దాడులు, దీనికి ప్రతిగా అమెరికా, సౌదీ అరేబియాలు ప్రతిదాడులకు సిద్ధమని ప్రకటించడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత ప్రజ్వరిల్లేలా చేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగితే, ఇప్పటికే మందగమనంతో కుదేలైన మన ఆరి్థక వ్యవస్థపై మరింతగా ప్రభావం పడుతుందనే ఆందోళనతో స్టాక్‌ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.  

రూపాయి పతనం  
ఇటీవల వరకూ బలపడుతూ వస్తున్న రూపాయి చమురు ధరలు ఎగియడంతో పతనమవుతూ వస్తోంది. మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 71.78కు చేరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. రూపాయి విలువ సోమవారం కూడా 68 పైసలు పడిపోయిన సంగతి తెలిసిందే

మళ్లీ మొదలైన విదేశీ అమ్మకాలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మళ్లీ మన స్టాక్‌ మార్కెట్లో అమ్మకాలు మొదలు పెట్టారు. సోమవారం రూ.751 కోట్లు, మంగళవారం రూ.808 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారు.  

ఫెడ్‌ సమావేశం.. మార్కెట్లో అప్రమత్తత  
వడ్డీరేట్లకు సంబంధించి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం నేడు(బుధవారం) వెలువడనున్నది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఫెడ్‌...  25 బేసిస్‌ పాయింట్ల మేర(పావు శాతం) రేట్లను తగ్గించగలదన్న అంచనాలు ఉన్నాయి. ఇలా తగ్గిస్తే, ఫెడ్‌ ఈ ఏడాది రెండు సార్లు రేట్లు తగ్గించినట్లవుతుంది. అయినా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు.

 ప్రతికూలంగా అంతర్జాతీయ సంకేతాలు
చైనాలో పారిశ్రామిక వృద్ధి పదిహేడేళ్ల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు ముడి చమురు ధరలు ఒకింత చల్లారినా, పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయనే భయాలు నెలకొన్నాయి. ఇలాంటి ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా,  యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై. మిశ్రమంగా ముగిశాయి.  

ఆర్‌బీఐ గవర్నర్‌ వ్యాఖ్యలు...
చమురు ధరలు పెరిగితే కరెంట్‌ అకౌంట్‌ లోటు, ద్రవ్యలోటులు మరింత అధ్వానమవుతాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యానించడం నష్టాలకు మరింత చమురు పోసింది. మన దేశం 80 శాతానికి పైగా చమురును దిగుమతు చేసుకుంటోందని, చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం మన ఆర్థిక స్థితిగతులపై తీవ్రంగానే ఉండగలదని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు.

డెత్‌ క్రాస్‌లో నిఫ్టీ
సోమవారం రోజు నిప్టీ డైలీ చార్టుల్లో డెత్‌ క్రాస్‌ ఏర్పడిందని టెక్నికల్‌ ఎనలిస్ట్‌లు పేర్కొన్నారు. స్వల్పకాలిక మూవింగ్‌ యావరేజ్‌ (సాధారణంగా 50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌), దీర్ఘకాలిక మూవింగ్‌ యావరేజ్‌ (సాధారణంగా 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌) కన్నా దిగువకు పడిపోవడాన్ని డెత్‌ క్రాస్‌గా వ్యవహరిస్తారు.  నిఫ్టీ సూచీ బలహీనతకు ఈ డెత్‌క్రాస్‌ ఒక సంకేతమని, స్వల్పకాలికంగా మరింత పతనం ఉండొచ్చని ఇది సూచిస్తోందని టెక్నికల్‌ ఎనలిస్ట్‌లు అంటున్నారు. నిఫ్టీ తదుపరి మద్దతు 10,600–10,740 పాయింట్లని, నిరోధం 10,970–11,000 పాయింట్లని వారంటున్నారు.

రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా గత రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.  బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (విలువ) రూ.2,72,594 కోట్లు దిగజారి రూ.1,39,70,356 కోట్లకు పడిపోయింది. ఒక్క మంగళవారమే రూ.2.38 లక్షల కోట్ల సంపద క్షీణించింది.

చమురు మంటతో భారత్‌కు అనర్థమే..!

‘మాంద్యం’ తరహా పరిస్థితికి దారితీస్తుందని నోమురా హెచ్చరిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరల తీవ్రత భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆరి్థక వ్యసస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని జపాన్‌ ఫైనాన్షియల్‌ సేవల దిగ్గజ సంస్థ నోమురా విశ్లేషించింది. బలహీన వినియోగ డిమాండ్, అధిక చమురు ధరలు భారత్‌ వంటి ఆరి్థక వ్యవస్థలో మాంద్యం తరహా పరిస్థితి (స్టాగ్‌ఫ్లేషన్‌)కి దారితీస్తాయని పేర్కొంది. తన మొత్తంచమురు అవసరాల్లో 70 శాతానికిపైగా దిగుమతులపై భారత్‌ ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ‘క్రూడ్‌ ధర ఒక్కో బ్యారల్‌కు  10 డాలర్లు పెరిగితే.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటును 0.2 శాతం మేర తగ్గిస్తుంది. కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి వచీ్చ–పోయే విదేశీ మారక నిధుల మధ్య నికర వ్యత్యాసం) 0.4 శాతం మేర (జీడీపీ)లో పెరుగుతుంది. ద్రవ్యలోటు 0.1 శాతం పెరుగుతుంది. వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 30 బేసిస్‌ పాయింట్ల మేర (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెరుగుతుంది. ఇక అధిక క్రూడ్‌ ధర  వల్ల డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనపడుతుంది. ప్రతి 5 పైసలు బలహీనత విషయంలో ద్రవ్యోల్బణం 20 బేసిస్‌ పాయింట్లు పెరుగుతుంది’ అని నోమురా విశ్లేషించింది.

స్టాగ్‌ఫ్లేషన్‌ అంటే...
ఒకవైపు ఆరి్థక వ్యవస్థ వృద్ధి మందగమనం.. మరోపక్క తీవ్ర ధరల పెరుగుదలను ఎదుర్కొనాల్సి వస్తుంది. వ్యవస్థలో డిమాండ్‌ పూర్తిగా నిలిచిపోతుంది. నిరుద్యోగిత భారీగా పెరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement