ముంబై : క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్ల కొంపముంచాయి. అంతర్జాతీయంగా ఈ ధరలు భారీ ఎత్తున్న పెరగడంతో పాటు దేశీయంగా కర్ణాటక రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 238 పాయింట్ల మేర కిందకి పడిపోయి 35,149 వద్ద క్లోజైంది. అటు నిఫ్టీ సైతం 58 పాయింట్ల నష్టంలో 10,682 వద్ద స్థిరపడింది. బ్యాంకులు, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్లకు మైనస్ అయింది. చివరి గంట ట్రేడింగ్‌లో మార్కెట్లు మరింత కిందకి పడిపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు, హిందాల్కో ఇండస్ట్రీస్, యూపీఎల్, ఐటీసీలు 2 శాతం నుంచి 3 శాతం వరకు క్షీణించాయి.
మరోవైపు కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుపై బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బలనిరూపణ చేసుకునేంత మెజార్జీ బీజేపీ వద్ద లేకపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. అటు క్రూడ్ ఆయిల్ ధరలు 2014 నవంబర్ నాటి గరిష్ట స్థాయిల్లో బ్యారల్ 80 డాలర్లను దాటేసింది. అమెరికాలో ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు మరింత పెరిగినట్టు విశ్లేషకులు చెప్పారు. చమురు సరఫరాలకు కీలకమైన ఇరాన్‌తో మూడేళ్ల క్రితం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయని తెలిపారు. ఒపెక్ దేశాల ఉత్పత్తి కోత కారణంగా కూడా చమురు ధరలు భగ్గుమంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment