దిగుమతుల బిల్లు భారం..సవాళ్లు
ప్రపంచ మార్కెట్ల అనిశ్చితి ప్రభావం
నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ: ఒక దేశం కరెన్సీ బలహీనపడితే, ఆ దేశం ఎగుమతిదారులకు లాభాలు భారీగా వచ్చిపడతాయన్నది ఆర్థిక సిద్దాంతం. అయితే భారత్ ఎగుమతిదారుల విషయంలో ఇది పూర్తి స్థాయిలో వాస్తవ రూపం దాల్చడం లేదు. రూపాయి బలహీనపడినా.. వారికి వస్తున్న లాభాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయన్నది నిపుణుల విశ్లేషణ.
వారు చేస్తున్న విశ్లేషణల ప్రకారం ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల తయారీ.. ముడి వస్తువుల దిగుమతులపై ఆధారపడుతుండడం.. ఈ నేపథ్యంలో దిగుమతుల బిల్లు తడిసి మోపెడవుతుండడం దీనికి ఒక కారణం. దీనికితోడు ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి దేశీయ ఎగుమతిదారులకు పరిమిత ప్రయోజనాలను అందిస్తోంది. గత ఏడాది జనవరి నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ 4 శాతానికిపైగా పతనమైంది. గత ఏడాది జనవరి 1వ తేదీన రూపాయి విలువ 83.19 పైసలు అయితే 2025 జనవరి 13వ తేదీన ఒకేరోజు భారీగా 66 పైసలు పడిపోయి 86.70కి చేరింది.
అన్ని రకాలుగా ఇబ్బందే...
రూపాయి దిగువముఖ ధోరణులు ఎగుమతిదారులకు లాభాలు పంచలేకపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతయ్యే ముడి పదార్థాలు, విడిభాగాలు, ఇతర ఉత్పత్తుల ధరలు డాలర్లలో పెరుగుతాయి. ఈ వ్యయాల పెరుగుదల బలహీనమైన రూపాయి నుండి పొందిన పోటీ ప్రయోజనాన్ని దెబ్బతీస్తోంది. ఫార్మా, రత్నాలు–ఆభరణాల వంటి రంగాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇంకా షిప్పింగ్, బీమా, మార్కెటింగ్ వంటి ఖర్చులు కూడా డాలర్–డినామినేట్ అవుతాయి.
ఇది కూడా క్షీణించిన రూపాయి ప్రయోజనాలు ఎగుమతిదారుకు దక్కకుండా చేస్తోంది. ఇక డాలర్ మారకంలో చైనీస్ యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసో వంటి ఇతర పోటీ దేశాల కరెన్సీలు కూడా భారత రూపాయితో పోలిస్తే మరింత క్షీణించాయి. ఎగుమతిదారులకు ఇదీ ఒక ప్రతికూల అంశమే. చాలా మంది ఎగుమతిదారులు కరెన్సీ హెచ్చుతగ్గుల సమస్యను ఎదుర్కొనడానికి హెడ్జింగ్ కవర్ తీసుకుంటారు. ఎందుకంటే వారి ఇన్‌పుట్ ఖర్చు పెరుగుతుంది. రూపాయి బలహీనత వల్ల వారికి తగిన ప్రయోజనం లభించడం లేదు.
– సంజయ్ బుధియా, సీఐఐ (ఎగ్జిమ్) నేషనల్ కమిటీ చైర్మన్
అనిశ్చితిని భరించలేం..
రూపాయి విలువ పడిపోతోందా? పెరుగుతోందా? అన్నది ఇక్కడ సమస్య కాదు. బాధ కలిగిస్తున్న అంశం రూపాయి విలువలో అస్థిరత. కరెన్సీలో స్థిరత్వం ఉండాలి. అస్థిరత ఉంటే అనిశ్చితిని ఎలా నిర్వహించాలో ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్య. – ఎస్ సి రాల్హాన్, ఇంజనీరింగ్
ఉత్పత్తుల ఎగుమతిదారు (లూథియానా)
Comments
Please login to add a commentAdd a comment