
ముంబై: గత వారం రోజుల వ్యవధిలో అత్యంత అధ్వాన్నంగా పడిపోయిన వర్ధమాన దేశాల కరెన్సీల్లో రూపాయి కూడా ఒకటని ఎక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ వారం రోజుల్లో 2.4 శాతం క్షీణించింది. అయితే, 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మిగతా వర్ధమాన కరెన్సీలతో పోలిస్తే మాత్రం రూపాయి గట్టిగానే నిలబడింది. 7.6 శాతం మాత్రమే పతనమైంది. ప్రస్తుతం 81.73 వద్ద ట్రేడవుతోంది. కొరియా కరెన్సీ వోన్ (–16.9 శాతం), ఫిలిప్పీన్స్ పెసో (–14.3 శాతం), థాయ్ బాహత్ (–13.3 శాతం), చైనా యువాన్ (–12.8 శాతం) మరింత భారీగా పతనమయ్యాయి.
అంతర్జాతీయంగా అనిశ్చితి, అధిక ద్రవ్యోల్బణం తదితర అంశాలు డాలర్ బలోపేతానికి దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. దీనివల్ల వర్ధమాన మార్కెట్లే కాకుండా సంప న్న మార్కెట్ల కరెన్సీలు కూడా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. యూరో 13.2 శాతం, పౌండ్ స్టెర్లింగ్ .. యెన్ చెరి 18.2 శాతం మేర క్షీణించడం ఇందుకు నిదర్శనమని వివరించింది. రూపాయిని స్థిరపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ మరింత అధిక స్థా యిలో వడ్డీ రేట్లను పెంచాల్సి ఉండవచ్చని నివేదిక తెలిపింది. మరోవైపు, విదేశీ మారక నిల్వలు (ఫారె క్స్) క్షీణించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment