సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రతి నెలా విద్యుత్ చార్జీల మోత మోగనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల హెచ్చుతగ్గులకు తగ్గట్టు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోయినట్టు.. ముందు ముందు కరెంటు చార్జీలు కూడా పెరిగిపోనున్నాయి. విద్యుత్ కొనుగోలు ధరలు, బొగ్గు, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా విద్యుత్ టారిఫ్‌లో సర్దుబాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువస్తోంది.
ఏ నెలకు ఆ నెల భారాన్ని వినియోగదారులపై మోపేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ‘విద్యుత్ నిబంధనలు–2005’కు సవరణలు చేస్తూ.. శుక్రవారం ‘విద్యుత్ నిబంధనలు (సవరణ)–2022’ముసాయిదాను కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ముసాయిదా ప్రతులను అన్ని రాష్ట్రాల ఇంధన శాఖలు, ఈఆర్సీలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు పంపింది. ముసాయిదా నిబంధనలపై సెప్టెంబర్ 11లోగా అభ్యంతరాలు, సలహాలను పంపించాలని కోరింది.
ఏ రకంగా భారం పడినా.. వినియోగదారుడిపైనే..
విద్యుదుత్పత్తికి ఇంధనంగా వినియోగించే బొగ్గు, గ్యాస్ వంటి వాటి ధరలు పెరిగితే.. అందుకు అనుగుణంగా విద్యుత్ చార్జీలూ పెరుగుతాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) మార్పులు, డిమాండ్‌కు అనుగుణంగా గ్రిడ్ నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు వంటి వాటితో పెరిగే భారాన్నీ.. ఏ నెలకు ఆ నెల వినియోగదారుల నుంచి వసూలు చేయాలని కేంద్ర ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.
‘విద్యుత్ నిబంధనలు (సవరణ)–2022’అమల్లోకి వచ్చాక 90 రోజుల్లోగా రాష్ట్రాల ఈఆర్సీలు ఇంధన ధరలు, విద్యుత్ కొనుగోలు ధరల్లో హెచ్చుతగ్గులను టారిఫ్‌లో సర్దుబాటు చేసేందుకు ఫార్ములాను ప్రకటించాల్సి ఉంటుంది. ఆలోగా ప్రతి నెలా టారిఫ్ సవరణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓ ఫార్ములాను ప్రతిపాదించింది.
మళ్లీ ఏడాదికోసారి ‘ట్రూఅప్’!
ఇక ప్రతి నెలా సవరించిన విద్యుత్ చార్జీలన్నింటినీ ఏడాదికోసారి రాష్ట్రాల ఈఆర్సీలు సమీక్షించాల్సి ఉంటుంది. విద్యుత్ కొనుగోళ్లకు చేసిన వాస్తవ వ్యయం, వినియోగదారుల నుంచి వసూలు చేసిన టారిఫ్‌ను సరిపోల్చి.. ఒకవేళ ఎక్కువ వసూలు చేస్తే తిరిగి వినియోగదారులకు చెల్లించాలి. అదే తక్కువ వసూలు చేసి ఉంటే మాత్రం.. ఆ సొమ్మునూ వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేసుకోవచ్చు. విద్యుత్ రంగ పరిభాషలో వీటిని ‘ట్రూఅప్’చార్జీలు అంటారు.
విద్యుత్ చట్టసవరణ బిల్లులోని అంశాలు ముసాయిదాలో..
విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022’ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపింది. ఆ బిల్లు ప్రతిపాదించిన ముఖ్యమైన సవరణలు కొన్ని తాజాగా ప్రకటించిన ‘విద్యుత్ నిబంధనలు (సవరణ)–2022’ముసాయిదాలో ఉండటం గమనార్హం. విద్యుత్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించడానికి ముందే.. ఈ మార్గంలో దాని అమలుకు కేంద్రం ప్రయత్నిస్తోందని నిపుణులు చెప్తున్నారు.
పక్కాగా విద్యుత్ సబ్సిడీ లెక్కలు
వ్యవసాయం, గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులకు ఉచితంగా/రాయితీపై విద్యుత్ సరఫరా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అంచనాల మేరకు సబ్సిడీ నిధులను ఇస్తోంది. ఇకపై సబ్సిడీ లెక్కలు కచ్చితంగా ఉండనున్నాయి. కేంద్రం ప్రకటించనున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆధారంగా సబ్సిడీ బకాయిలను డిస్కంలు లెక్కించాల్సి ఉంటుంది.
గడువులోగా జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు
ఇకపై జల విద్యుత్ ప్రాజెక్టులను 150 రోజుల్లో, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు 90 రోజుల్లోగా అనుమతులు జారీ చేయాలన్న నిబంధనను కేంద్రం ప్రతిపాదించింది. ఇప్పటివరకు ఇలాంటి నిబంధన లేక అనుమతుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
పునరుత్పాదక విద్యుత్‌కు ఒకే ధర
సెంట్రల్ పూల్ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే ధరతో డిస్కంలు పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లు జరిపే వీలు కల్పిస్తూ కేంద్రం మరో కీలక ప్రతిపాదన చేసింది. సౌర, పవన, హైడ్రో, హైబ్రిడ్, స్మాల్ హైడ్రో వంటి ప్రతి పునరుత్పాదక విద్యుత్‌కు ఒక ప్రత్యేక సెంట్రల్ పూల్ ఉండనుంది. అయితే ఏవైనా కంపెనీలు(ఇంటర్మీడియేటరీలు) పునరుత్పాదక విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కరెంటు కొని.. ఎక్కువ రాష్ట్రాల్లోని డిస్కంలకు తిరిగి విక్రయిస్తే ఈ నిబంధన వర్తిస్తుంది.
సెంట్రల్ పూల్ నిర్వహణ కోసం కేంద్రం ఏర్పాటు చేసే ప్రత్యేక ఏజెన్సీ (ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ) ప్రతి నెలా పునరుత్పాదక విద్యుత్ ధరను ఖరారు చేస్తుంది. సెంట్రల్ పూల్ ఐదేళ్లపాటు మనుగడలో ఉంటుంది. తర్వాత కొత్త శ్రీ సెంట్రల్ పూల్ ఏర్పాటు చేస్తారు. సెంట్రల్ పూల్ నుంచి రాష్ట్రాలు కచ్చితంగా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కొంటే మాత్రం కేంద్రం కనుసన్నల్లో లావాదేవీలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment