సాక్షి, హైదరాబాద్: ఓ టెలికాం కంపెనీ రీచార్జీల రేట్లు ఎక్కువ. కావాలనుకుంటే వేరే కంపెనీకి మారిపోవచ్చు. ఒక డీటీహెచ్‌లో చానళ్ల ప్యాకేజీ రేట్లు ఎక్కువ.. తక్కువ ధరకు ఇచ్చే మరో డీటీహెచ్‌ను పెట్టుకోవచ్చు.మరి మనకు సరఫరా చేసే కరెంటు చార్జీలు ఎక్కువ.. చచ్చినట్టు ఉన్న ఒక్క డిస్కం నుంచే విద్యుత్ వాడుకోవాలి. వచ్చినంత బిల్లులు కట్టాల్సిందే... కానీ ఇక ముందు విద్యుత్ సరఫరా చేసే కంపెనీల సంఖ్య పెరగనుంది. తక్కువ ధరకు కరెంటు ఇచ్చే కంపెనీనిగానీ.. కోతల్లేకుండానో, వోల్టేజీ హెచ్చు తగ్గులు లేకుండానో కరెంటు ఇచ్చే కంపెనీని గానీ ఎంచుకునే అవకాశం రానుంది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022లో ఈ మేరకు విప్లవాత్మక సంస్కరణలను ప్రతిపాదించింది. ఒకే ప్రాంతంలో ఒకటికి మించి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలు కల్పించనుంది. ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముందుకొచ్చినా.. రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)లు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేసేలా నిబంధనలను తీసుకువస్తోంది. ప్రైవేటు డిస్కంలకు తలుపులు బార్లా తెరిచేందుకు వీలుకల్పించే ఈ చట్టాన్ని కేంద్రం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోంది. ముసాయిదా బిల్లులోని కీలక ప్రతిపాదనలను కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా ఓ నివేదికలో బహిర్గతం చేసింది.
ఇప్పటిదాకా సొంత వ్యవస్థలున్న వాటికే..
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. డిస్కంలు తమ సొంత వ్యవస్థ ద్వారా వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు మాత్రమే వీలుంది. అంటే డిస్కంలు విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లతో సొంత సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటేనే లైసెన్స్ ఇస్తారు. ఇకపై ఆ అవసరం ఉండబోదు. ‘సొంత వ్యవస్థ ఉండాల’నే నిబంధనను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోసం ఎక్కువ సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు తప్పనిసరిగా ఓపెన్ యాక్సెస్ సదుపాయం కల్పించే దిశగా కొత్త నిబంధనను తీసుకువస్తోంది.
ఈ లెక్కన కొత్తగా వచ్చే ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వాడుకునేలా ప్రభుత్వ రంగ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అనుమతి ఇవ్వాల్సి రానుంది. దీనికి బదులుగా ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ డిస్కంలకు వీలింగ్ చార్జీలను చెల్లిస్తాయి. కొత్త డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి లైసెన్స్‌ల జారీలో రాష్ట్రాల ఈఆర్సీలు విఫలమైనా, దరఖాస్తును తిరస్కరించినా.. ఆయా సందర్భాల్లో లైసెన్స్ జారీ చేసినట్టే పరిగణించేలా కేంద్రం నిబంధన తెస్తుండటం గమనార్హం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం లేకపోయినా ప్రైవేటు కంపెనీలకు లైసెన్స్ జారీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడనుంది.
వినియోగదారుడే రాజు!
ప్రస్తుతం ఒక ప్రాంతంలో ఒకే ప్రభుత్వ రంగ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో వాటి గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఇకపై ప్రైవేటు కంపెనీలతో పోటీపడి వినియోగదారులకు కాపాడుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వ రంగ కంపెనీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు, అంతకు మించిన సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేస్తే.. ధరల విషయంలో వాటి మధ్య పోటీని ప్రోత్సహించేలా కేంద్రం అవకాశమివ్వడమే దీనికి కారణం. ఆయా ప్రాంతాల్లో రిటైల్ విద్యుత్ సరఫరాకు సంబంధించి గరిష్ట, కనిష్ట ధరలను మాత్రమే రాష్ట్రాల ఈర్సీలు నిర్ణయిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు డిస్కంలు గరిష్ట, కనిష్ట ధరల మధ్యలో ఏ రేటుకైనా విద్యుత్ సరఫరా చేసుకోవచ్చు. దీనితో తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీని ఎంచుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుందని కేంద్రం పేర్కొంది.
ప్రస్తుత పీపీఏల విద్యుత్, వ్యయం పంపిణీ చేసి..
ప్రస్తుతం డిస్కంలకు ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)లపై కేంద్రం కీలక స్పష్టతనిచ్చింది. వీటి ద్వారా వచ్చే విద్యుత్‌ను, అందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రాల ఈఆర్సీలు అన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య పంచాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అదనపు విదుŠయ్‌త్ అవసరమైతే.. ఇతర కంపెనీలతో సంబంధం లేకుండా కొత్తగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు.
క్రాస్ సబ్సిడీలకు ప్రత్యేక ఫండ్!
పరిశ్రమలు, వాణిజ్యం వంటి కేటగిరీల వినియోగదారుల నుంచి అధికంగా వసూలు చేసిన టారిఫ్‌ను.. గృహాలు, వ్యవసాయం వంటి ఇతర వినియోగదారులకు సబ్సిడీగా ఇవ్వడాన్ని క్రాస్ సబ్సిడీ అంటారు. ఇలా క్రాస్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం.. క్రాస్ సబ్సిడీ బ్యాలెన్సింగ్ ఫండ్‌ను రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మిగులు క్రాస్ సబ్సిడీ కలిగి ఉంటే.. ఆ మొత్తాన్ని ఈ ఫండ్‌లో జమ చేస్తారు. లోటు క్రాస్ సబ్సిడీ ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఈ నిధిని పంచుతారు.
ఈఆర్సీలకు అరెస్టు చేయించే అధికారం
ఈఆర్సీల ఉత్తర్వులను సివిల్ కోర్టు ఆదేశాలతో సమానంగా పరిగణించనున్నారు. ఆస్తుల విక్రయం, అరెస్టుకు ఆదేశించడం, జైలులో పెట్టడం వంటి అధికారాలు ఈఆర్సీలకు లభించనున్నాయి. ఈఆర్సీ ఉత్తర్వులను స్థానిక సివిల్ కోర్టుకు బదిలీ చేసి అమలుకు చర్యలు తీసుకోవచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరించే కమిషన్ సభ్యులను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలకు అధిపతిగా గానీ/ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా అనుభవమున్న వారినే ఈఆర్సీ చైర్‌పర్సన్‌గా నియమిస్తారు.
మరిన్ని కీలక నిబంధనలివీ..
►డిస్కంలు కేంద్రం నిర్దేశించిన మేర పునరుత్పాదక విద్యుత్‌ను కొనాల్సిందే. తగ్గితే ప్రతి యూనిట్‌కు తొలి ఏడాది 25–35 పైసల చొప్పున, తర్వాత 35–50 పైసల చొప్పున జరిమానా చెల్లించాలి.
►డిస్కంలు విద్యుదుత్పత్తి కంపెనీలకు ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరపడంలో విఫలమైతే.. ఆయా డిస్కంలకు విద్యుత్ సరఫరా ఆపేసే అధికారాన్ని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ల (ఆర్‌ఎల్డీసీ)కు కేంద్రం అప్పగించనుంది. ఇప్పటికే రూ.వేల కోట్లు బకాయి పడిన డిస్కంలకు ఇది గుదిబండగా మారనుంది.
►సరఫరా చేసిన విద్యుత్‌కు సరితూగేలా వినియో గదారుల నుంచి బిల్లులు వసూలయ్యేలా ఈఆర్సీ లు చార్జీలను నిర్ణయించాలి. డిస్కంలు టారిఫ్ ప్రతిపాదనలను గడువులోగా సమర్పించకుంటే.. ఈఆర్సీలే మధ్యంతర టారిఫ్ జారీ చేయాల్సి ఉంటుంది. చార్జీలు ఆటోమేటిగ్గా పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment