సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టులో జలవిద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల్లో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 22,573 క్యూసెక్కులు చేరాయి. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు.. పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 808.90 అడుగుల్లో 33.67 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
కృష్ణా పరీవాహక ప్రాంతంలో నారాయణపూర్, ఉజ్జయిని డ్యామ్‌లకు దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధాన పాయ, భీమాల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 41,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 37,930 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల నాగార్జునసాగర్‌లోకి 2,015 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 8,685 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.39 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతలకు దిగువన మున్నేరు, వాగులు, వంకల ప్రవాహం వల్ల ప్రకాశం బ్యారేజ్‌లోకి 15,698 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 6,114 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 9,584 క్యూసెక్కులను అధికారులు కడలిలోకి వదిలేస్తున్నారు.
ఆల్మట్టిలోకి పెరిగిన వరద
పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,07,769 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 54.56 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదలుతున్న ఆరు వేల క్యూసెక్కులు నారాయణపూర్ డ్యామ్‌కు చేరుతున్నాయి. సోమవారం ఆల్మట్టిలోకి మరింతగా వరద పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
తుంగభద్రలోనూ పెరిగిన ప్రవాహం
తుంగభద్ర డ్యామ్, తుంగ ఆనకట్ట దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల తుంగభద్రలో వరద ఉద్ధృతి కొంత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 54,657 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 21.36 టీఎంసీలకు చేరుకుంది.
శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు
Published Mon, Jul 24 2023 4:18 AM | Last Updated on Mon, Jul 24 2023 6:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment