
పవన విద్యుత్తుకు పెరుగుతున్న ఆదరణ
జూన్ 15న గ్లోబల్ విండ్ డే
భూ భ్రమణం, ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య తేడావల్ల గాలులు ఏర్పడి ఒకవైపు నుంచి మరోవైపునకు వీస్తాయి. ఈ గాలి ఎందుకు అవసరం అంటే వెంటనే ఏం చెబుతాం.. గాలి పీల్చకుండా బ్రతుకలేమని అంటాం. వాతావరణ మార్పులకు గాలి అవసరం అని చెబుతాం. అయితే ఇటీవల నెలకొంటున్న పరిస్థితుల వల్ల గాలి అవసరాలు పెరుగుతున్నాయి. గాలి నెమ్మదిగా మన వరండా నుంచి గుమ్మం ద్వారా మన టీవీలో చేరి వినోదాన్ని అందిస్తోంది. మన మొబైల్‌లో ప్రవేశిస్తోంది. మన మిక్సీలో పిండి రుబ్బేందుకు సహాయం చేస్తోంది. అదేంటి గాలి ఇన్ని పనులు చేస్తోందా అని ఆశ్చర్యపోతున్నారా.. క్రమంగా పవన విద్యుత్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆయా ప్రాజెక్ట్‌ల్లో తయారైన కరెంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి నిత్యావసరాలకు వాడుతున్నాం. ఈరోజు గ్లోబల్ విండ్ డే సందర్భంగా పవన విద్యుత్‌కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వాస్తవానికి 3500 ఏళ్ల కిందటే పవనశక్తిని కనుగొన్నా.. భౌగోళిక, సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా అంతగా అభివృద్ధి చెందలేదు. పారిస్ వాతావరణ ఒప్పందం తరవాత అనేక దేశాలు పవన విద్యుత్తుపై దృష్టి సారిస్తున్నాయి. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసేందుకు, కర్బన ఉద్గారాలను కట్టడి చేసేందుకు, ఇంధన సుస్థిరతను సాధించేందుకు పునరుద్ధరణీయ ఇంధన వనరులు దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగమవుతున్న ఇంధనాల్లో వీటి వాటా 41శాతం. అందులోనూ పవన విద్యుత్తు 11శాతానికే పరిమితమైంది. సౌర విద్యుత్తు తరవాత చౌకగా లభ్యమయ్యేది పవన విద్యుత్తే. థర్మల్ విద్యుత్తు కంటే దీన్ని సుమారు 35శాతం తక్కువ ఖర్చుకే ఉత్పత్తి చేయవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా భారత్ పవన విద్యుత్తు తయారీలో నాలుగో స్థానం(42.87 గిగావాట్లు)లో ఉంది. మొదటి స్థానంలో చైనా 288.32 గిగావాట్లు, తరవాతి స్థానాల్లో వరుసగా అమెరికా (122.32 గిగావాట్లు), జర్మనీ (62.85 గిగావాట్లు) ఉన్నాయి. డెన్మార్క్ తన విద్యుత్తు అవసరాలన్నింటికీ పూర్తిస్థాయిలో పవనశక్తినే ఉపయోగిస్తోంది. భారతదేశానికి మూడు వైపులా సుమారు 7,600 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉంది. నేషనల్ విండ్‌పవర్ కార్పొరేషన్, ప్రపంచ బ్యాంకుల సంయుక్త నివేదిక ప్రకారం..సముద్ర తీరాల వద్ద సుమారు 300 గిగావాట్ల సామర్థ్యంతో, ఇతర ప్రాంతాల్లో 195 గిగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పే అవకాశముంది. 2030 నాటికి 450 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన పునరుద్ధరణ ఇంధన వనరుల విద్యుదుత్పత్తి కేంద్రాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పవనశక్తి ద్వారా 140 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించాలని నిర్ణయించింది. కానీ, నేటికీ పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 42.87 గిగావాట్లకే పరిమితమైంది.
రాష్ట్రాలవారీగా పవన విద్యుత్తు స్థాపిత సామర్థ్యం
తమిళనాడు 9.62 గిగావాట్లు
గుజరాత్ 8.58
మహారాష్ట్ర 5.1
కర్ణాటక 4.98
రాజస్థాన్ 4.34
ఆంధ్రప్రదేశ్ 4.11
తెలంగాణ 0.12 గిగావాట్ల

పునరుత్పాదక ఇంధన వనరుల్లో సౌరశక్తి కూడా ప్రధానపాత్ర పోషిస్తోంది. పవన విద్యుత్తు, సౌరశక్తి మధ్య ప్రధాన తేడాలు గమనిస్తే..సౌరశక్తి పగటిపూటే లభ్యమవుతుంది. విద్యుత్తు వినియోగం మాత్రం రాత్రి వేళల్లో ఎక్కువగానే ఉంటుంది. దాంతో గ్రిడ్ స్థిరత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. బ్యాటరీ నిల్వల ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉన్నప్పటికీ, ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పవనశక్తి లభ్యత రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. సౌర, పవన విద్యుత్తులను సమ్మిళితం చేయడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment