పవన విద్యుదుత్పత్తిలో భారత్‌కు 5వ ర్యాంకు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 పవన విద్యుదుత్పత్తి దేశాల్లో భారత్ 5వ స్థానం దక్కించుకుంది. గతేడాది 1,700 మెగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా జతకావడంతో ఇది సాధ్యపడింది. అంతర్జాతీయ పునరుత్పాదక విద్యుత్ రంగ స్థితిగతులు 2014 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 2013లో 35,000 మెగావాట్ల మేర అదనంగా సామర్థ్యం జత కావడంతో పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 3,18,000 మెగావాట్లకు చేరుకుంది.
చైనా అత్యధికంగా 16,100 మె.వా. అదనపు సామర్థ్యంతో అగ్రస్థానంలో నిలవగా.. అమెరికా, జర్మనీ, స్పెయిన్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇందులో పెట్టుబడుల విషయంలో చైనా టాప్‌లో, భారత్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. గత కొన్నాళ్లుగా పవన, సౌర విద్యుదుత్పత్తి వ్యయాలు భారీగా తగ్గడంతో ప్రభుత్వ మద్దతు లేకుండానే ప్రాజెక్టుల ఏర్పాటు క్రమంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. 2013లో భారత్ మొత్తం 4,000 మె.వా. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని జతచేసుకుంది. ప్రస్తుతం 30,000 మె.వా.గా ఉన్న ఈ విభాగ విద్యుదుత్పత్తిని 2017 నాటికి 55,000 మె.వా.కు పెంచుకోవాలని యోచిస్తోంది.