ప్రైవేట్ పవనాలపై ప్రభుత్వ ప్రేమ.. ప్రజలపై పెను భారం.. ‘ముఖ్య’నేతకు భారీ ప్రయోజనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ విద్యుత్తు కొనుగోలు కుంభకోణానికి తెరలేచింది. ఒక ప్రైవేట్ పవన విద్యుత్ కంపెనీకి భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిసినా పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ అభ్యంతరాలను ఖాతరు చేయలేదు. విద్యుత్ వినియోగదారులపై పెనుభారం పడుతుందని తెలిసినా లెక్కచేయలేదు. అవసరం లేకపోయినా పవన విద్యుత్ కొనుగోలు చేయడమంటే ఇటు వినియోగదారులను, అటు డిస్కమ్‌లను ముంచేయడమేనని ఇంధనశాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించగా, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే డిస్కమ్‌లకు ఆత్మహత్యా సదృశం అవుతుందని సీఎస్ ఘాటుగా చెప్పారు. అయినా సరే భారీ ముడుపులకోసం రాష్ట్ర ప్రజలపై రూ.1000 కోట్లకు మించి భారాన్ని మోపడానికి సర్కారు సిద్ధమైంది. తమిళనాడుకు చెందిన పవన విద్యుత్ ప్రాజెక్టు యూనిట్ 3.46 రూపాయలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా, సుజ్లాన్ పవన విద్యుత్ యూనిట్ రూ.4.84గా ఏపీఈఆర్‌సీ నిర్థారించింది. దీనివల్ల రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై పెనుభారం పడనుండగా, ప్రైవేట్ విద్యుత్ కంపెనీతో పాటు ‘ముఖ్య’ నేతకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతోందని తెలుస్తోంది.
గతంలో అధికారంలో ఉండగా ప్రైవేట్ విద్యుత్ కంపెనీలతో ఏ తరహాలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చేసుకున్నారో ఇప్పుడు అదే తరహాలో పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరతీశారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏపీ జెన్‌కోకు విదేశీ బొగ్గు కొనుగోలులో రూ.500 కోట్లు, సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో రూ.755 కోట్లు, కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల పనుల్లో రూ.2,680 కోట్లు, ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లలో రూ.15వేల కోట్లు అవకతవకలకు పాల్పడి వందలాది కోట్లు ముడుపులు అందుకున్న రీతిలోనే పవన విద్యుత్తు విషయంలోనూ వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా చంద్రబాబు ప్రభుత్వం అధిక ధరలకు కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తుందన్న విషయాన్ని దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ట్రేడింగ్ కార్పొరేషన్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్సే్చంజ్ (ఐఈఎక్స్) ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు గతంలోనే లేఖ రాసిన విషయం గమనార్హం.
అభ్యంతరాలు కాదని మంత్రి మండలి ఆమోదం
సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ వెంచర్స్ లిమిటెడ్ అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 3000 మెగావాట్ల పవన్ విద్యుత్, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. దీంతోపాటు పవన విద్యుత్ పరికరాలకు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం 2015 పవన, సోలార్ విద్యుత్ విధానంతో పాటు నూతన పారిశ్రామిక విధానం మేరకు ఆ కంపెనీలకు రాయితీలను వర్తింపచేసింది. ఈ మేరకు గత ఏడాది జనవరి 11వ తేదీన ప్రాజెక్టు అమలు ఒప్పందాన్ని డిసెంబర్ 2022 వరకు చేసుకుంది. ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు సమన్వయంతో ప్రాజెక్టు అమలు చేయాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సుజ్లాన్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్‌సీ)కి లేఖ రాశారు. అలాగే దీర్ఘకాలిక విద్యుత్ అవసరాలు, విద్యుత్ కొనుగోలుకు ప్రణాళికను రూపొందించి ఏపీఈఆర్సీ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి అనుమతి పొందాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన ఏపీ డిస్కమ్‌లతో పాటు ఏపీ ట్రాన్స్‌కో కూడా సుజ్లాన్‌తో ప్రాజెక్టు అమలు ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ మేరకు ఈ ఏడాది మార్చి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిలోకి వస్తున్న 837.20 మెగావాట్ల పవన విద్యుత్తును కొనుగోలు చేయాల్సిందిగా సుజ్లాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కో–ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన సమావేశమై ఈ అంశంపై చర్చించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకునేందుకు ఈ సమావేశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ నిరాకరించింది. జాతీయ టారిఫ్ పాలసీ (ఎన్‌టీపీ) 2016లో నిర్ధారించిన మేరకు సంప్రదాయేతర ఇంధన వనరులను టెండర్ల ద్వారానే (కాపిటేటివ్ బిడ్డింగ్) కొనుగోలు చేయాలని కేంద్రం స్పష్టం చేసిందని, అయితే ఇందుకు ఇంకా మార్గదర్శకాలను ఖరారు చేయలేదని పేర్కొంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ మార్గదర్శకాలను సూచించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడమే కాకుండా, 1000 మెగావాట్ల పవన్ విద్యుత్ కొనుగోలుకు బిడ్స్‌ను ఆహ్వానించింది. తమిళనాడుకు చెందిన పవన విద్యుత్ ప్రాజెక్టు యూనిట్ రూ.3.46కు పంపిణీ చేసేందుకు బిడ్ దాఖలు చేసింది. అయితే ఏపీఈఆర్‌సీ పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి పరిస్థితిని సమీక్షించడమే కాకుండా విద్యుత్ వినియోగదారులు, డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి నేపధ్యంలో సుజ్లాన్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోరాదని నిర్ణయించారు. ఇదే విషయాన్ని డిస్కమ్‌లకు ఆదేశాల రూపంలో జారీ చేశారు. ఇంధనశాఖ అభిప్రాయంతో ఆర్థికశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ కూడా ఏకీభవించారు. సుజ్లాన్‌తో ఒప్పందాలను చేసుకోరాదంటూ గత నెల 3వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశానికి ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలను కేబినెట్ తిరస్కరించింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి సూచన మేరకు సుజ్లాన్ విద్యుత్తు కొనుగోలు చేయాలంటూ ఈ నెల 9వ తేదీ జరిగిన మంత్రిమండలి సమావేశం ఆమోదించడం గమనార్హం.
రూ.1000 కోట్ల అదనపు భారం ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్
విద్యుత్ వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరులు ఉండాలనే ఏపీఈఆర్‌సీ నిబంధనలను ఇప్పటికే అమలు చేసినందున కొత్తగా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ స్పష్టంచేశారు. సంప్రదాయేతర ఇంధన వనరులను తప్పనిసరిగా డిస్కమ్‌లు కొనుగోలు చేయాలంటే తక్కువ ధరకు వస్తున్న, ఇప్పటికే ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను మూసివేయాల్సి వస్తుందని తెలిపారు. దీనివల్ల డిస్కమ్‌లపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, విద్యుత్ వినియోగదారులపై ఆ భారం పడుతుందని చెప్పారు. సుజ్లాన్ సంస్థ నుంచి 837.20 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తే ఏటా రూ.250 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.1000 కోట్లు అదనపు భారం డిస్కమ్‌లపై పడుతుందన్నారు. సుజ్లాన్‌కు పారిశ్రామిక విధానం మేరకు రాయితీలు కల్పించినందున పవన విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 12,014 మిలియన్ యూనిట్లు మిగులు ఉందని, మూడేళ్ల వరకు అదనపు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ డిస్కమ్‌లు సుజ్లాన్‌తో పాటు ఏ కంపెనీతో కూడా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్‌లో కొనాల్సి వస్తే టెండర్ల ద్వారానే చేయాలని సూచించారు.
డిస్కమ్‌లకు సూసైడల్ సీఎస్ దినేశ్ కుమార్
ఇప్పటికే డిస్కమ్‌లు ఏడాదికి రూ.2000 కోట్ల రూపాయల నష్టాల్లో కొనసాగుతున్నాయని, పవన విద్యుత్ యూనిట్‌ను రూ.4.84కు కొనుగోలు చేయాలంటూ ఒప్పందాలు చేసుకుంటే డిస్కమ్‌లకు ఆత్మహత్యా సదృశం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఘాటుగా చెప్పారు. ఇప్పటికే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ఒప్పందాలను సమీక్షించి తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై ట్రాన్స్‌కో, డిస్కమ్స్ దృష్టి సారించాలని సూచించారు. సుజ్లాన్‌తో ఒప్పందాలను చేసుకోరాదంటూ గత నెల 3వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశానికి ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలను తిరస్కరించి కేబినెట్, ఈ నెల 9వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొనుగోళ్లను ఆమోదించడం గమనార్హం.
మొదటినుంచీ ముడుపుల బాటే...
విద్యుత్ ప్రాజెక్టులను, కొనుగోళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటినుంచీ ముడుపులకు మార్గాలుగానే చూస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఒప్పందాలు చేసుకుంటూ భారీగా ముడుపులు అందుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి నిర్వాకం వల్లనే విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోతున్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయినా కానీ పట్టించుకోకుండా పవన విద్యుత్ కొనుగోలు చేస్తూ మరో రూ.1000 కోట్ల భారం మోపేందుకు సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన ఒప్పందాల వివరాలు..
- విదేశీ బొగ్గు కొనుగోలులో అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే 20.55 డాలర్లు అధికంగా చెల్లించిన అంశంలో రూ.వందల కోట్లు ముడుపులు చేతులు మారిన అంశంపై కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ సమన్లు జారీ.
- అనంతపురం తలారిచెరువు సోలార్ పవర్ ప్రాజెక్టులో మెగావాట్‌కు రూ.1.51 కోట్లు అధికంగా చెల్లించడంవల్ల ఖజానాపై రూ.755 కోట్ల భారం. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో టెండర్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేయాల్సి వచ్చింది.
- కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో పనుల అంచనావ్యయాన్ని రూ.2,680 కోట్లు పెంచి రూ.500 కోట్లు ముడుపులు పొందారు. దీనిపైనా పిల్ దాఖలు కావడంతో కాంట్రాక్టుల అప్పగింతకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
- అధికారం చేపట్టిన మరుక్షణమే చంద్రబాబు రెండువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చి డిస్కమ్‌ల నెత్తిన భారం మోపారు. ఆ తర్వాత కూడా అదే తీరును కొనసాగిస్తూ అవసరం లేకున్నా ముడుపుల కోసం ప్రైవేటు సంస్థలనుంచి 13 వేల మిలియన్ యూనిట్లు కొనుగోలు జరిపి డిస్కమ్‌లు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణమయ్యారు.
- బయట మార్కెట్‌లో యూనిట్ రూ.2.71కి దొరుకుతున్నా ఆంధ్రప్రదేశ్ రూ.5.11 చెల్లించి కొనుగోలు చేయడంపై దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ట్రేడింగ్ కార్పొరేషన్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్సే్చంజ్ (ఐఈఎక్స్) ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు లేఖ రాసింది.