పురుగుల లార్వాతో తయారు చేసిన కేకు
బెల్జియం : అవును! బెల్జియంకు చెందిన ఘెంట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కేకులు, కుకీలు ఇతర ఆహారపదార్ధాలు దేంతో తయారుచేశారో తెలిస్తే మన కడుపులో తిప్పేయటం ఖాయం. ఒక వేళ అది తిన్న తర్వాత అసలు విషయం తెలిస్తే వాంతి చేసుకుంటారు. ఇంతకీ అవి దేంతో తయారు చేశారని ఆలోచిస్తున్నారా?.. బ్లాక్ సోల్జర్ అనే పురుగుల లార్వాతో. పురుగుల లార్వాతో పదార్ధాలను తయారుచేయటం డైరీ ఉత్పత్తులకంటే మేలని అంటున్నారు ఘెంట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. డేలాన్ జోంపా సోస అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘ పురుగుల పెంపకం పాడి పరిశ్రమ లాగా ఎక్కువ ప్లేస్‌ను తీసుకోదు. వాటి తిండికి కూడా ఎక్కువ ఖర్చుకాదు. నీటిని కూడా తక్కువ తీసుకుంటాయి.
వీటిలో అధిక ప్రొటీన్, విటమిన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. వీటి పెంపకానికి తక్కువ ఖర్చు, పర్యావరణానికి మంచిద’ని తెలిపింది. పురుగుల ద్వారా తయారైన వాటిని తిన్న వారు పురుగు పదార్ధాలకు, పాల పదార్ధాలకు మధ్య పెద్ద తేడా గుర్తించలేకపోయారు. అయితే సగం తిన్న తర్వాత ఓ రకమైన రుచిని తాము పొందామని చెప్పారు. ఏదేమైనప్పటికి పురుగులతో తయారుచేసిన పదార్ధాలను కొనబోమని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment