సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులు కీటకాలపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా వాటి జనాభా తగ్గుతోంది. ముఖ్యంగా రక్షిత ప్రాంతాల్లోని కీటకాల సంతతి అత్యంత వేగంగా తగ్గిపోవడమే కాకుండా పెరుగుదల కూడా భారీగా పడిపోయిందని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ వర్జ్‌బర్గ్ బయో సెంటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జోర్గ్ ముల్లర్ వెల్లడించారు. ఈ నెలలో విడుదలైన నేచర్ మ్యాగజైన్‌లో ఆయన రాసిన కథనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది.
1989 నుంచి 2016 మధ్యకాలంలో జర్మనీలోని రక్షిత ప్రాంతాల్లో కీటకాల జీవం 75 శాతం కంటే ఎక్కువగా తగ్గిపోయిందని ముల్లర్ పేర్కొన్నారు. 2005లో అత్యంత వేగంగా పతనమైందని.. ఆ తర్వాత సంవత్సరాల్లో వాటి పెరుగుదల కోలుకోలేదని అధ్యయనం నిరూపించిందని స్పష్టం చేశారు. ముల్లర్ 2022లో చేసిన అధ్యయనంలో కీటకాల బయో మాస్‌లో కొంత పెరుగుదల కనిపించింది.
అయితే, గతంలో తగ్గినంత వేగంగా ఈ పెరుగుదల లేదని ఆయన పేర్కొన్నారు. ముల్లర్ బృందం 2016, 2019, 2020, 2022లో పచ్చిక భూములు, వ్యవసాయ యోగ్యమైన పొలాలు సహా అనేక బహిరంగ ఆవాసాలలో పురుగుల బయో మాస్ పెరుగుదలపై పరిశోధనలు చేసింది.
వాతావరణ మార్పులు.. ఆవాసాల నష్టం
పర్యావరణ పరిరక్షణలో ఎంతో కీలకమైన కీటకాల క్షీణత మానవాళి జీవనంపైనా పెద్ద ప్రభావం చూపుతుందని ప్రొఫెసర్ ముల్లర్ పేర్కొన్నారు. వీటి జాతి తగ్గిపోవడానికి వాతావరణ మార్పులు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఆవాసాల నష్టం, పట్టణీకరణ, కాలుష్యం, సింథటిక్ పురుగు మందులు, ఎరువుల వినియోగం కూడా కారణమని తేల్చారు. వీటితోపాటు జీవ సంబంధ కారకాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా 1989 నుంచి 2016 మధ్య కీటకాల బయో మాస్‌లో 75 శాతానికి పైగా క్షీణత నమోదైనట్టు.. 2005 తర్వాత వాతావరణ ప్రభావాలు కీటకాలకు ప్రతికూలంగా మారినట్టు గుర్తించారు. ఉష్ణోగ్రతలు కీటకాల జీవన చక్రంలోని వివిధ దశల్లో వాటి జనాభాను ప్రభావితం చేస్తాయని, వీటి మనుగడ శీతాకాల పరిస్థితులు, వేసవి వంటి చివరి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ముల్లర్ తన అధ్యయనంలో పేర్కొన్నారు.
శీతాకాలంలో చాలా వెచ్చగాను పొడిగాను ఉండటం, వేసవిలో చల్లగాను తడిగాను మారడంతో ఆ పరిస్థితులను తట్టుకోలేక కీటకాలు అంతరించిపోయినట్టు తేల్చారు. కీటకాల నాశనం ఆహార గొలుసును చిక్కుల్లో పడేస్తోందని.. దీనివల్ల కీటకాలను తినే పక్షులకు ఆహారం లభించక మరణిస్తున్నాయని మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీలో ఎకో క్లెమటాలజీ ప్రొఫెసర్ అన్నెట్ మెన్జెల్ తెలిపారు. దీనివల్ల పంటలు నాశనం అవుతున్నట్టు తేల్చారు. ముఖ్యంగా ఈ తగ్గుదల 2005 నుంచి 2019 మధ్య బాగా తగ్గినట్టు గుర్తించారు.
20 నుంచి 30% తగ్గిన పంటలు
ఆహార గొలుసులో కీటకాలు తగ్గిపోవడంతో పక్షులకు ఆహారం దొరకక చనిపోతున్నాయని, వీటిలో సముద్ర పక్షులు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రభావం జర్మనీతో పాటు సమీప యూరోపియన్ దేశాల్లోనూ కనిపించినట్టు తేల్చారు. ఆహారం కొరతతో వలస పక్షులు సైతం రావడం లేదని, స్థానిక పక్షులు సైతం తగ్గిపోతున్నాయని, ఉన్నవి పంటలపై దాడులు చేస్తున్నాయని గుర్తించారు.
ఈ క్రమంలో 2005–2019 మధ్య పంట దిగుబడులు 30% వరకు తగ్గినట్టు అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువుల్ని తగ్గించాలని, సమతుల వాతావరణ పరిస్థితులను కాపాడేందుకు అడవులను పెంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లేకపోతే ఆసియా, అమెరికా దేశాలకూ ఇదే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment