సాక్షి, హైదరాబాద్: పోడు భూముల క్రమబద్దీకరణతో ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోడు ఆక్రమణలకు హక్కులు కట్టబెట్టేందుకు ఆక్రమణదారులు, చట్ట ఉల్లంఘనుల నుంచి దరఖాస్తుల స్వీకరణ సరైంది కాదని వారు అభ్యంతరం చెబుతున్నారు. ఇది మళ్లీ భూపోరాటాలు, భూకబ్జాలకు కారణమవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగైదు ఏళ్లుగా అమలు చేస్తున్న కఠిన వైఖరితో అటవీ ఆక్రమణలు గణనీయంగా తగ్గడమేగాక, 2% దాకా పచ్చదనం పెరిగినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆక్రమణల్లోని వేలాది ఎకరాలను అటవీ శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోడు సమస్యకు పరిష్కారం పేరిట ప్రభుత్వం చేస్తున్న కొత్త ఆలోచనలపై పలువురు పర్యావరణవేత్తలు భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే...
పర్యావరణానికి పెద్దదెబ్బ...
పర్యావరణం, అడవులు, జీవవైవిధ్య పరిరక్షణ వంటి అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. పోడు క్రమబద్ధీకరణ పేరిట అటవీ ఆక్రమణలకు సర్కార్ పచ్చజెండా ఊపడం పర్యావరణానికి పెద్దదెబ్బ.
అడవి, జీవావరణాలతో గిరిపుత్రులకు ఉన్న బంధం.. తల్లీబిడ్డల మధ్యనున్న సంబంధం లాంటిది. ఆక్రమణలు, మైనింగ్, పోడు.. ఇతర రూపాల్లో అడవి క్షీణించినా అది బలహీనమవుతుంది. అటవీ ప్రాంతం తగ్గినా, సన్నగిల్లినా ఆదివాసీలపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
– ప్రొ. కె.పురుషోత్తంరెడ్డి, పర్యావరణ నిపుణులు
ఆక్రమణలను సక్రమం చేయడం సరికాదు..
పోడు భూముల క్రమబద్ధీకరణ పేరిట అటవీ ఆక్రమణలను సక్రమం చేయడం సరికాదు. 2006కు ముందే పోడు భూములను వాటిని సాగు చేసుకునే వారికి ఇవ్వాలని, సంబంధిత కుటుంబం మూడు తరాలు వ్యవసాయం చేస్తేనే హక్కులు కల్పించాలని కేంద్ర చట్టంలో ఉంది. మళ్లీ ఇప్పుడు గత 15 ఏళ్ల ఆక్రమణలను క్రమబద్దీకరిస్తామనేది అడవుల విధ్వంసమే. గిరిజనుల ఉపాధి, పునరావాసానికి పోడు అనేదే ప్రధానమైనది కాదు.
భూమి కోసం అడవులను ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీడీల ద్వారా ఆదివాసీ, గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అన్వేషించాలి. విద్యాకల్పన, నైపుణ్యాల శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన వంటివి చేయాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న కుట్రగా భావించాలి.
– పొట్లపెల్లి వీరభద్రరావు, పర్యావరణవేత్త
గిరిజనేతరుల ఆక్రమణలు పెరుగుతాయి...
పోడు క్రమబద్ధీకరణను అడ్డం పెట్టుకుని మళ్లీ అటవీ ఆక్రమణలు ఊపందుకోవడం ఖాయం. ఇది అటవీ, పర్యావరణ పరిరక్షణకు తీరని నష్టం. తేనేతుట్టె లాంటి ఈ అంశాన్ని మళ్లీ కదపడం మంచిదికాదు. భూములను క్రమబద్దీకరిస్తామన్న ప్రతీసారి పట్టాలు లభిస్తాయనే ఆశతో గిరిజనేతరుల ఆక్రమణలు పెద్ద ఎత్తున పెరిగాయి.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్య పరిష్కారం కాకపోగా మరింత తీవ్రమౌతుంది. మళ్లీ పోడు ఆక్రమణల క్రమబద్దీకరణకు అవకాశమివ్వడం వల్ల నేడు కాకపోతే రేపు పట్టాలొస్తాయనే ఆశతో ధైర్యంగా కొత్త ఆక్రమణలకు దిగుతారు.
– ఇమ్రాన్ సిద్ధిఖీ, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ బయాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment