Podu land
-
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి
చండ్రుగొండ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ ఆదివాసీల చేతిలో మరణించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరణం బాధాకరమే. నిజానికి ప్రభుత్వం పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో చూపిస్తున్న సాచివేత ధోరణే ప్రజలకూ – ప్రభుత్వ అధికారులకు మధ్య యుద్ధం జరగడానికి కారణం అని చెప్పక తప్పదు. అసలు ఈ సంఘటనకు కారణమేమిటో తేల్చడానికి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమంగా తప్పుడు పద్ధతులలో భూ పట్టాలను మంజూరు చేస్తున్నారు అధికారులు. అలాగే గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా తెలిసినా ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన షెడ్యూల్డ్ ప్రాంతంలో కనిపించకుండానే శాంతియుతమైన వాతావరణం క్రమక్రమంగా కరిగి పోతోంది. అందుకు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్‌పై దాడి ఒక మంచి ఉదాహరణ. అటవీ అధికారులు రాష్ట్రంలో ఆదివాసీ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు చేసినప్పడు; పంటలకూ, ఆహార ధాన్యాలకూ, ఇళ్ళకూ నిప్పుపెట్టినప్పుడూ, మనుషుల మీద మూత్రం పోసినప్పుడూ, ఇటువంటి మరికొన్ని అమానవీయ ఘటనలకు పాల్పడినప్పుడూ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించవు. పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వ హించినప్పుడు... పోడు సాగుదారులకు పట్టాలిస్తామనీ, పోడు సమస్యను పరిష్కరిస్తామనీ ఒకపక్క చెబుతూనే... మరోపక్క సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులను ఉసిగొలుపుతోంది ప్రభుత్వం. ఆ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈరోజు అటవీ అధికారి శ్రీనివాస్ హత్య జరిగింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమ్రంతి. చనిపోయిన శ్రీనివాసరావును ముఖ్యమంత్రి తిరిగి తీసుకొస్తాడా? ఆయన పోడు భూముల సాగుపై స్పష్టమైన వైఖరినీ, చిత్తశుద్ధినీ వెల్లడించకుండా ప్రతిసారీ ఎన్నికలసమయంలో సబ్ కమిటీల (అటవీ హక్కుల కమిటీలు) నియామకం పేరుతో కాలం వెళ్ళదీస్తూ అసలు విషయాన్ని దాటవేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఏదేమైనా... ఆదివాసీ ప్రజలూ సహనం, ఓపికతో చట్టానికి లోబడే పోరాటం కొనసాగించాలే తప్ప... ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం తగదు. సంయమనం పాటించాలి. (క్లిక్ చేయండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!) – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
కాళ్లమీద పడినా కర్కశంగా.. గొత్తికోయల దారుణ కృత్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చంద్రుగొండ: బెండాలపాడు అటవీ ప్రాంతంలో తమ ఆఫీసర్‌పై దాడి చేయొద్దని సహచర సిబ్బంది కాళ్లపై పడి మొక్కినా గొత్తి కోయలు కనికరించలేదు. వేటకొడవళ్లతో దాడి చేయడంతో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో కింద పడి ఉన్న ఎఫ్ఆర్ఓపై తులా వేటకొడవలితో దాడి చేస్తుండగా.. ‘మీ కాళ్లు మొక్కుతా, మా సార్‌ను ఏం చేయొద్దు.. మేము ఇక్కడి నుండి వెళ్లిపోతాం’అంటూ రామారావు వేడుకున్నారు. అయినా పట్టించుకోకుండా చేతిలోని పదునైన ఆయుధంతో శ్రీనివాసరావు మెడ, తల, గొంతుపై అదే పనిగా దాడి చేశాడు. మంగును వాచర్ రాములు నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే ఆవేశంగా ఉన్న వారిద్దరినీ నిలువరించడం సాధ్యం కాక శ్రీనివాసరావును అక్కడే వదిలి రామారావు, రాములు తదితరులు ప్లాంటేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు, అటవీ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే వరకు సుమారు గంట పాటు ఎఫ్ఆర్ఓ రక్తపుమడుగులోనే ఉన్నారు. ఆ తర్వాత కారులో మధ్యాహ్నం 1:56 గంటల ప్రాంతంలో చంద్రుగొండ ప్రాథమిక ఆస్పత్రికి, ఆ తర్వాత ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. జీపులో వెళ్లుంటే..: ఫారెస్ట్ ఆఫీసర్‌గా కేటాయించిన జీపులోనే శ్రీనివాసరావు ఎక్కువగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్తుంటారు. కొత్తగూడెం నుంచి చంద్రుగొండకు తన కారులో వచ్చి అక్కడి నుంచి ఫారెస్ట్ జీపులో అడవిలోకి వెళ్లడం ఆయనకు అలవాటు. జీపులో తనతో పాటు సిబ్బందిని తీసుకెళ్లేవారు. కానీ, మంగళవారం ఆయన బైక్ మీద ఫీల్డ్ విజిట్‌కు వెళ్లడం, ఆయన వెంట ఒక్కరే సిబ్బంది ఉండడంతో ఆయనపై పగ పెంచుకుని అదను కోసం చూస్తున్న గొత్తికోయలు తేలికగా దాడి చేయగలిగారని అటవీ సిబ్బంది చెబుతున్నారు. పచ్చదనమే ప్రాణంగా బతికారు పచ్చదనమే ప్రాణంగా బతికిన సిన్సియర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు చివరకు ఆ పచ్చని చెట్ల మధ్యే ప్రాణాలు వదిలారు. అడవుల రక్షణే ఊపిరిగా జీవించిన ఆయన చివరకు విధి నిర్వహణలో తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు సహజంగానే అడవులంటే ప్రేమ కలిగిన ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా పోడు వ్యవసాయాన్ని అరికట్టడంతో పాటు అడవులు పెంచడంపై శ్రద్ధ చూపించేవారు. ఈ క్రమంలో అటవీ శాఖ నుంచి గోల్డ్ మెడల్ సైతం అందుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే ఆయన వ్యక్తిగతంగా మాత్రం చాలా సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రేంజ్లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారని, అలాంటి ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని తోటి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎఫ్ఆర్వో మృతి.. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం కేసీఆర్ -
కొత్తగా ‘పోడు’ దరఖాస్తుల తలనొప్పి
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల వ్యవహారంలో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్నామంటూ తాజాగా రైతులు పెద్ద ఎత్తున అధికారులకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, గత ఏడాది చివరలో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకించి తుది గడువు విధించలేదు. ఈ క్రమంలో దాదాపు మూడు నెలల పాటు దరఖాస్తులను స్వీకరించి వాటిని కంప్యూటరీకరించారు. తాజాగా వీటిని పరిశీలించి, అర్హతలు ఖరారు చేయాలని ఆదేశాలు జారీన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో పోడు అంశం కొలిక్కి వస్తుందనే భరోసా రావడంతో పెద్ద సంఖ్యలో రైతులు పోడు సాగు చేసుకుంటున్నట్లు ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. వీటిని స్వీకరించి పరిశీలించాలని క్షేత్రస్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు చేస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. అధికారులపై నేతల ఒత్తిడి.. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు వేగిరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. జిల్లా, డివిజినల్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామాల వారీగా సభలు నిర్వహించి సాగు వివరాలపై స్పష్టత తీసుకురావడం, శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు అధికారాలు ఇచ్చింది. ఈ క్రమంలో గ్రామాల వారీగా సభలు నిర్వహిస్తున్న కమిటీలకు కొత్త దరఖాస్తులు తలనొప్పిగా మారుతున్నాయి. వాటిని స్వీకరించాలా? వద్దా? అనేది అధికారులు తేల్చుకోలేక పోతున్నారు. వీటిని తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని కొందరు నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనపై ఉన్నతాధికారులను కిందిస్థాయి అధికారులు సలహాలు కోరుతున్నారు. రాష్ట్రంలోని 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 4,14,353 క్లెయిమ్స్ రాగా.. వీటిలో 86 శాతం పరిశీలన పూర్తయింది. మరో వారంరోజుల్లో మొత్తం పరిశీలన పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పోడు భూముల సాగుపై సర్వే ప్రక్రియ సైతం వేగవంతం అయింది. ఈ నెలాఖరులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చేనెలలో పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. -
Bandi Sanjay: ఓటుబ్యాంకు రాజకీయాలు ఎన్నాళ్లు?
దళిత గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం, ఎన్నికల ముందే వారి మీద ప్రేమ కురిపిస్తున్నట్టు నటించడం కేసీఆర్‌కి వెన్నతో పెట్టిన విద్య. ముందుగా దళితు డినే ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్, తర్వాత తానే ఆ కుర్చీలో కూర్చున్నరు. ఆ తర్వాత దళిత గిరిజనులకు మూడెకరాల సాగు భూమి స్తానని మురిపించిన్రు. అది ఇయ్యకుండా దాన్ని మరిపించడానికి ‘దళిత బంధు’ ఇస్తామన్నరు. ఇట్లా కేసీఆర్ ఏం చెప్పినా... ఆయన మాటలే తియ్యగా ఉంటయ్గానీ, ఆయన చేతలు ఎంత చేదుగా ఉంటయో ఎనిమిదేండ్లుగా యావత్ తెలంగాణ రుచి చూస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దళిత గిరిజనుల అభివృద్ధిని పాలకులు కావాలనే విస్మరించిన్రని, దాంతో వారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని టీఆర్ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో మొసలి కన్నీరు కార్చింది. దళితులకు, గిరిజనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేస్తామని అరచేతిలోనే వైకుంఠం చూపించిన్రు. ఇదే మాటను 2018 ఎన్నికల్లో కూడా చెప్తూ ఇంకొన్ని హామీలు జత చేసిన్రు. కానీ, వాటి అమలుకు ప్రయత్నించిన దాఖలాలు ఎక్కడా కనపడవు. ప్రతి దళిత, గిరిజన కటుంబానికి మూడెక రాల భూమి ఇస్తామన్న, మొదటి సంవత్సరం పంట ఖర్చులు భరించడంతో పాటు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీని టీఆర్ఎస్ తుంగలోకి తొక్కింది. రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తప్ప భూపంపిణీ కోసం ఏ బడ్జెట్లోనూ పైసా కేటాయించలేదు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలు ఇస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన్రు. ఏళ్ల తరబడి ఉన్న ఈ సమస్య పరి ష్కారానికి అధికార యంత్రాంగాన్ని వెంటబెట్టు కొని వచ్చి తాను కుర్చీ వేసుకొని సమస్య పరిష్క రిస్తనని ఆర్బాటం చేసిన్రు. కానీ, ఇప్పటివరకూ ఆ కుర్చీ ఎక్కడికి పోయిందో, ఆయన నిర్వహిస్తనన్న ‘ప్రజాదర్బార్’ ఎక్కడికిపోయిందో టీఆర్ఎస్ నాయకులకే తెల్వాలే. పోడు భూములకు పట్టాలు ఇయ్యకపోగా ఫారెస్టు, రెవెన్యూ అధికారులను గిరిజనులపైకి ఎగదోసి టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతున్నది. 30,40 సంవత్స రాలుగా సాగు చేసుకుంటున్న వారి నుంచి పోడు భూములు లాక్కోని నయవంచన చేస్తున్నది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో, అక్కడ అధికంగా ఉన్న గిరిజనుల ఓట్ల కోసం గిరిజనులకు భూమి హక్కు పత్రాలిస్తానని చెప్పి కేసీఆర్ ఓట్లు కాజేసిన్రు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 7 లక్షల ఎక రాల్లో పోడు భూముల సమస్య ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హక్కు పత్రాలను సైతం ప్రభుత్వం గుంజుకోవడం దారుణం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని నీరుగార్చేందుకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రణాళిక ప్రకారం ఎత్తులు వేసింది. ఈ చట్టంలోని సెక్షన్ (3), ‘11డీ’లో పేర్కొన్న మౌళిక వసతుల అభివృద్ధికి 7 శాతం నిధులు వాడుకోవచ్చు అన్న నిబంధనను ఉపయోగించుకొని సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వెచ్చించి, ఎస్సీ, ఎస్టీలకు తీవ్రద్రోహం చేసింది. ఇలా ఈ ఎనిమిదేండ్లలో దళిత గిరిజనులకు కేటాయించిన 40 వేల కోట్ల నిధులను దారి మళ్లించింది. ఇగ, 2014 నుంచి 2019 వరకు ఎస్సీ కార్పోరేషన్ రుణాల కోసం 5,33,800 మంది దరఖాస్తు చేసుకోగా... ఇప్పటికీ 4,17,011 మంది రుణాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నరు. గిరిజనుల జనాభా నిష్పత్తికి అనుగుణంగా తమకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నరు. కానీ, ఆర్డినెన్స్ తీసుకు రావడం ద్వారా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా... టీఆర్ఎస్ సర్కారు మీన మేషాలు లెక్కిస్తున్నది. పది శాతం రిజర్వేషన్లు అమలులోకి రాకపోవడం వల్ల గిరిజన యువ తకు ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర నష్టం జరుగుతున్నది. మిషన్ భగీరథ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు గిరిజన ప్రాంతాలకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని అసమర్థ పాలన సాగిస్తున్నరు. అనేక గిరిజన గ్రామాలకు సరైన వైద్య సౌకర్యాలు లేవు. మారుమూల గిరిజన గూడేలకు సరైన రవాణా సౌకర్యాలు లేక ఆస్పత్రులకు పోవాలంటే ఇప్పటికీ ‘డోలె’ను ఆశ్రయించాల్సిన దుఃస్థితి. ఇక, మునుగోడు నియోజకవర్గంలో శివన్న గూడెం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల గోడును టీఆర్ఎస్ పట్టించు కున్న పాపాన పోలే. జూఠా మాటలతో, గారడీ హామీలతో పరి పాలన సాగిస్తున్న దొర గడీలకు, నియంతృత్వ కుటుంబ పాలనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డయ్. మునుగోడులో రాబోయే ప్రజా తీర్పు, భవిష్యత్‌లో బీజేపీ ప్రభుత్వానికి దారులు వేయబోతున్నది. పేదల పార్టీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత గిరిజనుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తం. దగావడ్డా దళిత గిరిజనుల దుఖ్కం తీరుస్తం. సకల జనుల తెలంగాణకు బాటలు వేస్తం. (క్లిక్ చేయండి: అప్రతిహత ప్రగతికి పట్టం కట్టండి) - బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు -
Haritha Haram: పోడు రైతుకు హరితహారం గండం
పోడు రైతుకు హరిత గండం ముంచుకొస్తోంది. వర్షాకాలం ఆరంభం కాగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టే హరితహారం కార్యక్రమంలో ఏజెన్సీలోని పోడు భూముల్లో అలజడి మొదలవుతుంది. ఈసారి ముందుగానే అప్రమత్తమైన ఏజెన్సీ పోడు భూముల రైతులు... వామపక్షాల మద్దతుతో తమ భూములను కాపాడుకునేందుకు ప్రతిఘటనకు సిద్ధమవుతున్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి స్వరాష్ట్రం తెలంగాణ వరకు పోడు రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని అనేక ఏళ్లుగా పోడు ఉద్యమాలు సాగుతున్నప్పటికీ పరిష్కార మార్గం కనిపించడం లేదు. అంతే కాకుండా ఆ భూమి అటవీ శాఖ పరిధిలో ఉందంటూ అధికారులు ట్రెంచ్‌లు కొడుతుండటంతో పోడు రైతులు అడ్డుపడుతున్నారు. ఆ సమయంలో వారిపై ప్రతియేటా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తరతరాలుగా అడవిని ఆధారం చేసుకొని బతుకుతున్న ఆదివాసులు నేడు అడవికి దూరమవుతున్నారు. అడవికీ, ఆదివాసీకీ మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది. అడవుల్లోని ప్రతి చెట్టూ ఆదివాసీలకు పూజనీయమే. అనేక చెట్లూ, జంతువులూ ఆదివాసీల తెగలను సూచిస్తాయి. అందుకే ఎల్లప్పుడూ అడవీ, అడవిలోని జంతుజాలమూ సురక్షితంగా తమ తరువాతి తరాలకు అందాలని ఆదివాసీలు ప్రగాఢంగా కోరుకుంటారు. చట్టాలకు భంగం కలగకుండా ఆదివాసీల అభిప్రాయాలను గౌరవిస్తూ... వారి కోరికల మేరకే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనీ, గ్రామసభల ద్వారా చేసిన తీర్మానాలూ, అటవీ చట్టాలు, ఆదివాసీ హక్కుల చట్టాలకు అనుగుణంగా అడవినీ, ఆదివాసులను పరిరక్షించాలనీ రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ నేడు అటవీశాఖ అధికారులూ, పోలీసులూ రాజ్యాంగ నిర్దేశాలను తుంగలో తొక్కి ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే పనులు చేస్తున్నారు. ఇకనైనా ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలను రక్షించి, ఏళ్లుగా పరిష్కారం కాని ఆదివాసీ గిరిజనుల భూములకు పోడు పట్టాలు అందించాలి. అçప్పుడే వాళ్ళ అభివృద్ధి సాధ్యమవుతుంది. – జటావత్ హనుము, హైదరాబాద్ -
భూమి దక్కదని ఆదివాసీ రైతు ఆత్మహత్య
బోథ్: అటవీ అధికారులు ఆ ఐదెకరాలు స్వాధీనం చేసుకుని కుంట నిర్మాణం చేపట్టడంతో మనస్తాపం చెందిన ఆదివాసీ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జీడిపల్లికి చెందిన లక్ష్మణ్ (48) ఐదెకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నాడు. పోడుభూ ములకు పట్టాలిచ్చే కార్యక్రమంలో ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు. ఆదివారం లక్ష్మణ్‌కు చెందిన భూమిలో అటవీ అధికారులు నీటికుంట నిర్మించడానికి ప్రొక్లెయిన్‌తో వెళ్లారు. ఆవేదనకు గురైన లక్ష్మణ్ ఇంటి నుంచి పురుగుమందు తీసుకుని చేను వద్దకు వెళ్లాడు. తన భూమిలో నీటికుంట నిర్మాణం చేపట్టవద్దని వేడుకున్నాడు. అయినా అధికారులు పనులు ఆపకపోవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మణ్ పురుగుమందు తాగాడు. పక్కనున్నవారు గమనించి ఆయనను బోథ్ ఆస్పత్రికి, ఆపై ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించినా పరిస్థితి విషమించి మృతి చెందాడు. లక్ష్మణ్‌కు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కాగా, లక్ష్మణ్ రాగానే పనులు ఆపేశామని బోథ్ అటవీ క్షేత్ర అధికారి సత్యనారాయణ చెప్పారు. -
అడవి కబ్జాపై ఆకాశరామన్న ఉత్తరాలు రాయండి
సిరిసిల్ల: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిపాటు డిజిటల్ భూసర్వేలు నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో శనివారం పోడుభూములపై అఖిలపక్ష నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్రవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అడవిని.. పుడమిని కాపాడేందుకు నవంబర్ 8వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో అర్జీలు స్వీకరిస్తున్నామని, వాటిని పరిశీలించి శాస్త్రీయంగా గూగుల్ మ్యాప్స్‌తో విశ్లేషించి అర్హులకు పట్టాలిస్తామని తెలిపారు. మళ్లీ అడవుల జోలికి వెళ్లకుండా కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ కృషితో హరితహారంలో అగ్రస్థానంలో ఉన్నామని, నాలుగున్నర శాతం అడవి పెరిగిందని అన్నారు. ‘ధరణి’తో అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని, ఇప్పటికే 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. ధరణితో నేరుగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని, రెవెన్యూ అవినీతి తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు. దేశం మొత్తంగా ధరణిని అనుసరించే రోజులు వస్తాయన్నారు. అక్షాంశాలు.. రేఖాంశాలతో సర్వే అక్షాంశాలు.. రేఖాంశాల ఆధారంగా సంపూర్ణ డిజిటల్ భూసర్వే చేయిస్తామని కేటీఆర్ అన్నారు. ఇది పూర్తయితే భూముల హద్దులు, వాటి యజమానుల వివరాలు పక్కాగా నమోదవుతాయని తెలిపారు. అంతకంటే ముందు 2005 నాటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల చట్టం ఆధారంగా భూమిని నమ్ముకున్న గిరిజనుల్లో అర్హులకు పారదర్శకంగా పట్టాలిస్తామన్నారు. ఇందులోనూ ఎవరైనా పైరవీలు చేసినా, అనర్హులకు అండగా ఉన్నా జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించారు. ఎవరైనా అటవీ భూములను కబ్జా చేస్తే వెంటనే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయాలని, ఆకాశరామన్న ఉత్తరం రాసినా.. సరిపోతుందని మంత్రి వివరించారు. అడవులను నరికివేసే వారిపై కఠినంగా ఉంటామన్నారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందం అటవీ భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు పట్టాలిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టమే ప్రతిబంధకంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ చట్ట సవరణకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తానని చెప్పారని వివరించారు. క్షేత్రస్థాయిలో అర్జీల స్వీకరణ పూర్తయిన తర్వాత సమగ్ర సమాచారంతో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో అటవీభూములను ఆక్రమించబోమని, ఎవరైనా కబ్జా చేసినా సహించబోమని అఖిల పక్షనేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
క్రమబద్దీకరణతో అడవికి ముప్పు..!
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల క్రమబద్దీకరణతో ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోడు ఆక్రమణలకు హక్కులు కట్టబెట్టేందుకు ఆక్రమణదారులు, చట్ట ఉల్లంఘనుల నుంచి దరఖాస్తుల స్వీకరణ సరైంది కాదని వారు అభ్యంతరం చెబుతున్నారు. ఇది మళ్లీ భూపోరాటాలు, భూకబ్జాలకు కారణమవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు ఏళ్లుగా అమలు చేస్తున్న కఠిన వైఖరితో అటవీ ఆక్రమణలు గణనీయంగా తగ్గడమేగాక, 2% దాకా పచ్చదనం పెరిగినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆక్రమణల్లోని వేలాది ఎకరాలను అటవీ శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోడు సమస్యకు పరిష్కారం పేరిట ప్రభుత్వం చేస్తున్న కొత్త ఆలోచనలపై పలువురు పర్యావరణవేత్తలు భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే... పర్యావరణానికి పెద్దదెబ్బ... పర్యావరణం, అడవులు, జీవవైవిధ్య పరిరక్షణ వంటి అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. పోడు క్రమబద్ధీకరణ పేరిట అటవీ ఆక్రమణలకు సర్కార్ పచ్చజెండా ఊపడం పర్యావరణానికి పెద్దదెబ్బ. అడవి, జీవావరణాలతో గిరిపుత్రులకు ఉన్న బంధం.. తల్లీబిడ్డల మధ్యనున్న సంబంధం లాంటిది. ఆక్రమణలు, మైనింగ్, పోడు.. ఇతర రూపాల్లో అడవి క్షీణించినా అది బలహీనమవుతుంది. అటవీ ప్రాంతం తగ్గినా, సన్నగిల్లినా ఆదివాసీలపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. – ప్రొ. కె.పురుషోత్తంరెడ్డి, పర్యావరణ నిపుణులు ఆక్రమణలను సక్రమం చేయడం సరికాదు.. పోడు భూముల క్రమబద్ధీకరణ పేరిట అటవీ ఆక్రమణలను సక్రమం చేయడం సరికాదు. 2006కు ముందే పోడు భూములను వాటిని సాగు చేసుకునే వారికి ఇవ్వాలని, సంబంధిత కుటుంబం మూడు తరాలు వ్యవసాయం చేస్తేనే హక్కులు కల్పించాలని కేంద్ర చట్టంలో ఉంది. మళ్లీ ఇప్పుడు గత 15 ఏళ్ల ఆక్రమణలను క్రమబద్దీకరిస్తామనేది అడవుల విధ్వంసమే. గిరిజనుల ఉపాధి, పునరావాసానికి పోడు అనేదే ప్రధానమైనది కాదు. భూమి కోసం అడవులను ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీడీల ద్వారా ఆదివాసీ, గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అన్వేషించాలి. విద్యాకల్పన, నైపుణ్యాల శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన వంటివి చేయాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న కుట్రగా భావించాలి. – పొట్లపెల్లి వీరభద్రరావు, పర్యావరణవేత్త గిరిజనేతరుల ఆక్రమణలు పెరుగుతాయి... పోడు క్రమబద్ధీకరణను అడ్డం పెట్టుకుని మళ్లీ అటవీ ఆక్రమణలు ఊపందుకోవడం ఖాయం. ఇది అటవీ, పర్యావరణ పరిరక్షణకు తీరని నష్టం. తేనేతుట్టె లాంటి ఈ అంశాన్ని మళ్లీ కదపడం మంచిదికాదు. భూములను క్రమబద్దీకరిస్తామన్న ప్రతీసారి పట్టాలు లభిస్తాయనే ఆశతో గిరిజనేతరుల ఆక్రమణలు పెద్ద ఎత్తున పెరిగాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్య పరిష్కారం కాకపోగా మరింత తీవ్రమౌతుంది. మళ్లీ పోడు ఆక్రమణల క్రమబద్దీకరణకు అవకాశమివ్వడం వల్ల నేడు కాకపోతే రేపు పట్టాలొస్తాయనే ఆశతో ధైర్యంగా కొత్త ఆక్రమణలకు దిగుతారు. – ఇమ్రాన్ సిద్ధిఖీ, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ బయాలజిస్ట్ -
‘పోడు’పై వాయిదా తీర్మానం తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, దీనిపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మంగళవారం సభలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆయన చాంబర్లో కలసి పోడు సమస్యలపై సభలో చర్చ జరపాలని కోరారు. అయినా ఫలితం లేకపోవడం మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ జరుగుతున్న సమయంలో గన్‌పార్కు వద్దకు వచ్చి నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. అడవుల్లో నివసించే వారికి తమ హయాంలో భూములపై హక్కులు కల్పించామని, తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. పోడు వ్యవసాయం చేసే అడవిబిడ్డలను పోలీసులు కొట్టి అరెస్టు చేయడం నిత్యకృత్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని తాము అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినా తిరస్కరించారని, దీనిపై స్పీకర్‌ను కలిసి నిరసన తెలిపామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ విధానాలను మానుకోవాలని, లేదంటే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య మాట్లాడుతూ గిరిజన పోడు భూములపై ఇచ్చిన మాటలను ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నేతలను అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. అనంతరం మంథని ఎమ్మెల్యే డి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పోడు భూములపై ప్రభుత్వ వైఖరి సరిగా లేదని, గిరిజనుల భవిష్యత్తు తో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. -
హోరెత్తిన ‘పోడు’ పోరు
సాక్షి నెట్వర్క్: పోడుభూముల పోరు తీవ్రతరమైంది. వెంటనే పట్టాలివ్వాలని మంగళవారం గిరిజన రైతులు రోడ్డెక్కారు. అటవీ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లోనూ సడక్‌బంద్ నిర్వహించారు. కదంతొక్కారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, పోడుభూముల కోసం పోరాడే గిరిజనులను జైళ్లలో పెట్టడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోడుసాగుదారులకు పట్టాలివ్వాలనే డిమాండ్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చేపట్టిన రాస్తారోకోలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బోయిన నర్సింహులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, చంద్రుగొండ, ములకలపల్లి, పాల్వంచల్లో కూడా రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కారేపల్లి, కొణిజర్ల, సత్తుపల్లి, పెనుబల్లిల్లోనూ వివిధ పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పేద గిరిజన రైతులకు వెంటనే పట్టాలివ్వాలి పోడు భూములు గిరిజనుల హక్కు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పరిధిలోని హైదరాబాద్–శ్రీశైలం హైవేపైనున్న హాజీపూర్ చౌరస్తాలో నల్లమల సడక్‌బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, మల్లు రవి, వంశీకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేతలు నంద్యాల నర్సింహారెడ్డి, జాన్‌వెస్లీ హాజరయ్యారు. అంతకుముందు నారాయణ హైదరాబాద్ నుంచి హజీపూర్ వెళ్తూ డిండిలో మీడియాతో మాట్లాడా రు. కేసీఆర్ గిరిజనుల వైపు ఉంటారా, బీజేపీ వైపు ఉంటారా అని ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఉమ్మడి వరంగల్‌లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యాన మంగళవారం చేపట్టిన ‘సడక్ బంద్’విజయవంతమైంది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, తెలంగాణ ఆదివాసీ గిరిజన, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాలు రాస్తారోకోలు నిర్వహించారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములపై ఆందోళన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో సడక్ బంద్ నిర్వహించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని మిర్యాలగూడలో గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. సూర్యాపేటలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా గన్నారం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై గంటపాటు బైఠాయించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, కిసాన్ ఖేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై, బాన్సువాడ, గాంధారిలో రాస్తారోకో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు, నిర్మల్ జిల్లా ఖానాపూర్, సత్తెనపల్లి, కడెంలోని పాండ్వపూర్, దస్తురాబాద్, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్, రెబ్బెన, కౌటాల, దహెగాం, సిర్పూర్(టి) మండల కేంద్రాల్లో సడక్ బంద్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారం, బెల్లంపల్లి, నెన్నెల, లక్సెట్టిపేట, కోటపల్లి, చెన్నూర్‌లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అం దజేశారు. ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు వద్ద సడక్‌బంద్‌లో టీజేఎస్ అధినేత కోదండరాం పాల్గొన్నారు. -
పోడు భూమి పోతోందని..
‘అమ్మ’ లేనిదే ఆ ‘బిడ్డ’ ఉండలేదు.. ‘తల్లి’ దూరమైతే ఏమాత్రం తట్టుకోలేదు... ఇక్కడ... ‘అమ్మ’ అంటే... భూమాత..! ‘బిడ్డ’ అంటే... రైతు..!! భూమాతను తనకు దూరం చేయడాన్ని ఆ బిడ్డ తట్టుకోలేకపోయాడు. తనకు, తన కుటుంబానికి సర్వస్వమైన ఆ భూమాతను లాక్కుంటుంటే సహించలేకపోయాడు. అడ్డుకోలేని అశక్తుడయ్యాడు. మనసు ముక్కలైంది. బతుకు లేదనుకున్నాడు. ప్రాణాలు తీసుకోబోయాడు. ఇల్లెందు: మండలంలోని రాఘబోయినగూడెం పంచాయతీ బోడియాతండా గ్రామానికి చెందిన పోడు రైతు కున్సోత్ చంద్రు, ఆత్మహత్యకు యత్నించాడు. సాగు భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతుండడాన్ని తట్టుకోలేకపోయాడు. భరించలేని మనోవేదనతో ఆ భూమి లోనే.. ఆ భూమాత ఒడిలోనే.. ఆ మట్టిలోనే ఐక్యమవుదామనుకున్నాడు. పురుగు మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే ఇల్లెందు వైద్యశాలలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గత 20 ఏళ్ల క్రితం కున్సోతో చంద్రు, ఆయన కుమార్తె భద్రమ్మతో కలిసి బోడియాతండా సమీపంలో పది ఎకరాల పోడు నరికి సేద్యం చేపట్టాడు. 2006లో అటవీ హక్కుల చట్టం కింద ఇతడికి ప్రభుత్వం హక్కు పత్రం కూడా ఇచ్చింది. ఇటీవల రైతుబంధు పథకం కింద పది ఎకరాలకుగాను రూ.40వేలు కూడా వచ్చాయి. ఈ భూమిలో సేద్యం చేయరాదంటూ అతడిని అటవీశాఖ అధికారులు గత మూడేళ్లుగా అడ్డుకుంటున్నారు. మరో ముగ్గురు రైతులది కూడా ఇదే పరిస్థితి. ఈ నలుగురు రైతులు కలిసి కోర్టును ఆశ్రయించారు. ఉన్నతాధికారులకు సమస్యను విన్నవించారు. అటవీశాఖ అధికారులు ఆగలేదు. చంద్రు, మరో ముగ్గురు రైతులు, పదిమంది కూలీలతో తమ పోడు భూమిని సాగు చేసేందుకు శుక్రవారం వెళ్లారు. అప్పటికే రోళ్లపాడు సెక్షన్ ఆఫీసర్ భాగ్య, కుంటల, వేపలగడ్డ, కొల్లాపురం బీట్ ఆఫీసర్లు పాపయ్య, ఎల్.శ్రీను, గౌరమ్మ, సిబ్బంది కలిసి ఆ నలుగురు రైతుల భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లారు. ఇటు రైతులు, అటు అధికారులు. వారి మధ్య వాగ్వివా దం జరిగింది. తన కళ్లెదుటే... తన భూమాతను (భూమిని) అధికారులు లాక్కోవడాన్ని చూస్తూ చంద్రు తట్టుకోలేకపోయాడు. పురుగు మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే ఇల్లెందు వైద్యశాలకు తరలించారు. డాక్టర్ నాగశశికాంత్ ప్రాథమిక వైద్యం అందించి ఖమ్మం ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏమంటున్నారంటే.. చంద్రు ఆత్మహత్యాయత్నంపై ఫారెస్టు సెక్షన్ ఆఫీ సర్ భాగ్యను ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘కుంటల సెక్షన్‌లోని బోడియాతండా సమీపంలోని భూమి లో మొక్కలు నాటేందుకు ముగ్గురు బీట్ ఆఫీసర్ల తో కలిసి శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లాము. మారణాయుధాలు చేబూనిన కొంతమంది అక్కడ? ప్లాంటేషన్‌ను తొలగించేందుకు యత్నించారు. మేము గట్టిగా ప్రశ్నించటంతో వారు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. అంతలోనే, తాను మందు తాగినట్టుగా చంద్రు కేకలు వేశాడు. ఆయనను అక్కడే ఉన్న కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు’’ అని చెప్పారు. -
‘పోడు’ పరిరక్షణకు నేడు మహా ధర్నా
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: పోడు భూమిని సాగు చేసుకుంటున్న వారిపై ప్రభుత్వం దమనకాండకు దిగడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నిర్వహిస్తున్న ధర్నాలో బీకేఎంయూ నేత నాగేంద్రనాథ్ ఓఝా, కె.నారాయణ, జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం, ప్రొ. హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు. తరతరాలుగా పోడు చేసుకుని జీవిస్తున్న ఎస్టీ, ఎస్సీ, బడుగు బలహీనవర్గాల వారిని హరితహారం పేరిట ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఈ ధర్నాను చేపట్టినట్లు తెలియజేశారు. అటవీ హక్కుల చట్టం, 2006 ప్రకారం పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాల్సిందిపోయి వారిని దౌర్జన ్యంగా ప్రభుత్వం గెంటేస్తోందని ధ్వజమెత్తారు. పోడు సాగుదారుల గ్రామాలపై అటవీ, పోలీసు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తూ, పీడీ యాక్ట్ కింద అక్రమ కేసులు బనాయించి జైళ్లలో నిర్బంధిస్తున్నారని విమర్శించారు. -
పోడులో ‘పోరు’ నాగళ్లు
* 200 ఎకరాల్లో విత్తనాలు చల్లిన 300 మంది గిరిజనులు * సీపీఎం ఆధ్వర్యంలో భూపోరాటం వాజేడు: ఖమ్మం జిల్లా వాజేడు మండల పరిధిలోని చెరుకూరు, కడేకల్ గ్రామాల మధ్య ఉన్న పోడు భూమిలో మంగళవారం కృష్ణాపురం గ్రామానికి చెందిన 300 మంది గిరిజనులు నాగళ్లు కట్టి దున్నారు. ఇక్కడి ఎర్రబోరు ప్రాంతంలో అటవీశాఖ అధికారులు హరితహారం మొక్కలు నాటుతుండగా, 2007లో ఈ ప్రాంతాన్ని చదును చేశామని.. అప్పటి నుంచి తామే పోడు చేసుకుంటున్నామని గిరిజనులు పేర్కొంటూ భూపోరాటానికి దిగారు. సుమారు 100 మంది రైతులు సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎర్రబోరులోని 200 ఎకరాల భూమిని దున్నారు. తొమ్మిది రకాల విత్తనాలను చల్లారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వచ్చి.. గిరిజనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, సుమారు 300 మంది గిరిజనులు ఉండడంతో అటవీ సిబ్బంది తక్కువగా ఉండడంతో ఏం చేయలేక మిన్నకున్నారు. ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేసినా.. స్పందించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.