Bandi Sanjay: ఓటుబ్యాంకు రాజకీయాలు ఎన్నాళ్లు? | Bandi Sanjay Kumar Write on Vote Bank Politics in Telangana, Munugode Bypoll | Sakshi
Sakshi News home page

Bandi Sanjay: ఓటుబ్యాంకు రాజకీయాలు ఎన్నాళ్లు?

Published Thu, Oct 27 2022 12:34 PM | Last Updated on Thu, Oct 27 2022 12:59 PM

Bandi Sanjay Kumar Write on Vote Bank Politics in Telangana, Munugode Bypoll - Sakshi

దళిత గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం, ఎన్నికల ముందే వారి మీద ప్రేమ కురిపిస్తున్నట్టు నటించడం కేసీఆర్‌కి వెన్నతో పెట్టిన విద్య. ముందుగా దళితు డినే ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్, తర్వాత తానే ఆ కుర్చీలో కూర్చున్నరు. ఆ తర్వాత దళిత గిరిజనులకు మూడెకరాల సాగు భూమి స్తానని మురిపించిన్రు. అది ఇయ్యకుండా దాన్ని మరిపించడానికి ‘దళిత బంధు’ ఇస్తామన్నరు. ఇట్లా కేసీఆర్‌ ఏం చెప్పినా... ఆయన మాటలే తియ్యగా ఉంటయ్‌గానీ, ఆయన చేతలు ఎంత చేదుగా ఉంటయో ఎనిమిదేండ్లుగా యావత్‌ తెలంగాణ రుచి చూస్తున్నది.  

ఉమ్మడి రాష్ట్రంలో దళిత గిరిజనుల అభివృద్ధిని పాలకులు కావాలనే విస్మరించిన్రని, దాంతో వారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని టీఆర్‌ఎస్‌ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో మొసలి కన్నీరు కార్చింది. దళితులకు, గిరిజనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేస్తామని అరచేతిలోనే వైకుంఠం చూపించిన్రు. ఇదే మాటను 2018 ఎన్నికల్లో కూడా చెప్తూ ఇంకొన్ని హామీలు జత చేసిన్రు. కానీ, వాటి అమలుకు ప్రయత్నించిన దాఖలాలు ఎక్కడా కనపడవు.

ప్రతి దళిత, గిరిజన కటుంబానికి మూడెక రాల భూమి ఇస్తామన్న, మొదటి సంవత్సరం పంట ఖర్చులు భరించడంతో పాటు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీని టీఆర్‌ఎస్‌ తుంగలోకి తొక్కింది. రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తప్ప భూపంపిణీ కోసం ఏ బడ్జెట్‌లోనూ పైసా కేటాయించలేదు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలు ఇస్తామని కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన్రు. ఏళ్ల తరబడి ఉన్న ఈ సమస్య పరి ష్కారానికి అధికార యంత్రాంగాన్ని  వెంటబెట్టు కొని వచ్చి తాను కుర్చీ వేసుకొని సమస్య పరిష్క రిస్తనని ఆర్బాటం చేసిన్రు. కానీ,  ఇప్పటివరకూ ఆ కుర్చీ ఎక్కడికి పోయిందో, ఆయన నిర్వహిస్తనన్న ‘ప్రజాదర్బార్‌’ ఎక్కడికిపోయిందో టీఆర్‌ఎస్‌ నాయకులకే తెల్వాలే.

పోడు భూములకు పట్టాలు ఇయ్యకపోగా ఫారెస్టు, రెవెన్యూ అధికారులను గిరిజనులపైకి ఎగదోసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాడులకు పాల్పడుతున్నది. 30,40 సంవత్స రాలుగా సాగు చేసుకుంటున్న వారి నుంచి పోడు భూములు లాక్కోని నయవంచన చేస్తున్నది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సమయంలో, అక్కడ అధికంగా ఉన్న గిరిజనుల ఓట్ల కోసం గిరిజనులకు భూమి హక్కు పత్రాలిస్తానని చెప్పి కేసీఆర్‌ ఓట్లు కాజేసిన్రు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 7 లక్షల ఎక రాల్లో పోడు భూముల సమస్య ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హక్కు పత్రాలను సైతం ప్రభుత్వం గుంజుకోవడం దారుణం.  

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని నీరుగార్చేందుకు కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ప్రణాళిక ప్రకారం ఎత్తులు వేసింది. ఈ చట్టంలోని సెక్షన్‌ (3), ‘11డీ’లో పేర్కొన్న మౌళిక వసతుల అభివృద్ధికి 7 శాతం నిధులు వాడుకోవచ్చు అన్న నిబంధనను ఉపయోగించుకొని సబ్‌ప్లాన్‌ నిధులను ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వెచ్చించి, ఎస్సీ, ఎస్టీలకు తీవ్రద్రోహం చేసింది. ఇలా ఈ ఎనిమిదేండ్లలో దళిత గిరిజనులకు కేటాయించిన 40 వేల కోట్ల నిధులను దారి మళ్లించింది. ఇగ, 2014 నుంచి 2019 వరకు ఎస్సీ కార్పోరేషన్‌ రుణాల కోసం 5,33,800 మంది దరఖాస్తు చేసుకోగా... ఇప్పటికీ 4,17,011 మంది రుణాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నరు. 

గిరిజనుల జనాభా నిష్పత్తికి అనుగుణంగా తమకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నరు. కానీ, ఆర్డినెన్స్‌ తీసుకు రావడం ద్వారా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా... టీఆర్‌ఎస్‌ సర్కారు మీన మేషాలు లెక్కిస్తున్నది. పది శాతం రిజర్వేషన్లు అమలులోకి రాకపోవడం వల్ల గిరిజన యువ తకు ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర నష్టం జరుగుతున్నది. మిషన్‌ భగీరథ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ నాయకులు గిరిజన ప్రాంతాలకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని అసమర్థ పాలన సాగిస్తున్నరు. అనేక గిరిజన గ్రామాలకు సరైన వైద్య సౌకర్యాలు లేవు. మారుమూల గిరిజన గూడేలకు సరైన రవాణా సౌకర్యాలు లేక ఆస్పత్రులకు పోవాలంటే ఇప్పటికీ ‘డోలె’ను ఆశ్రయించాల్సిన దుఃస్థితి. ఇక, మునుగోడు నియోజకవర్గంలో శివన్న గూడెం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల గోడును టీఆర్‌ఎస్‌ పట్టించు కున్న పాపాన పోలే.

జూఠా మాటలతో, గారడీ హామీలతో పరి పాలన సాగిస్తున్న దొర గడీలకు, నియంతృత్వ కుటుంబ పాలనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డయ్‌. మునుగోడులో రాబోయే ప్రజా తీర్పు, భవిష్యత్‌లో బీజేపీ ప్రభుత్వానికి దారులు వేయబోతున్నది. పేదల పార్టీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత గిరిజనుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తం. దగావడ్డా దళిత గిరిజనుల దుఖ్కం తీరుస్తం. సకల జనుల తెలంగాణకు బాటలు వేస్తం. (క్లిక్ చేయండి: అప్రతిహత ప్రగతికి పట్టం కట్టండి)


- బండి సంజయ్‌కుమార్‌ 
కరీంనగర్‌ పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement