ఇండియన్ ‘లోన్’
మోదీకి ముందున్న 14 మంది ప్రధానులు చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లయితే, మోదీ ఎనిమిదిన్నరేళ్లలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేశారు. పుట్టబోయే ప్రతి బిడ్డపై 1.25 లక్షల రూపాయల రుణభారం మోపారు.
– కేటీఆర్ కామెంట్
.......
కౌంటర్.. ‘స్టేట్’మెంట్
తెలంగాణ అప్పు రూ. 3.12 లక్షల కోట్లయ్యింది. రెండేళ్లలోనే బీఆర్‌ఎస్ సర్కారు రూ. 87 వేల కోట్ల అప్పును చేసింది. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. మన పిల్లలకు అప్పు మిగులుస్తున్నారు. సరాసరి తలసరి రూ. 94 వేల అప్పును మోపుతున్నారు
– బండి సంజయ్, కిషన్‌రెడ్డి విమర్శలు
.......
అప్పుల ‘మధ్య’తరగతి..
‘‘కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చేమోగానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం..’’ అంటారు.
కళ్ల తడి కామన్ కానీ, ఈ రోజుల్లో అసలు అప్పు చేయకుండా జీవితం దాటనేలేం. కుటుంబాలన్నీ అప్పుల కుప్పలే.
‘ఈఎంఐ’.. అని రుణాల పేరు పోష్‌గా మారిందంతే. వాయిదాల్లేకుండా బతికేదెవ్వరు.. ఇంటికి, బండికి, చదువుకు, పెళ్లికి.. చిట్‌లు.. ఒక్కటేమిటి ముఖ్యంగా మధ్యతరగతి బతుకంటేనే అప్పులు కదా...!
చిన్నప్పుడు ‘తీసివేతలు’ నేర్పుతున్నప్పుడు లెక్కల మాస్టారు ‘ఒకటి అప్పు తీసుకోరా ..’ అని ఎప్పటి నుంచి చెప్పారో, అప్పటినుంచి బతుకు లెక్కంతా అప్పులే. రుణాలు తీసుకుంటూనే ఉన్నాం. వడ్డీలు, కిస్తులు కడుతూనే ఉన్నాం.
అప్పూ గొప్పే...
రిచ్ క్లాస్‌లో ఇదేం నామోషీ కాదు. అంబానీ నుంచి అదానీ దాకా అపరకుబేరులైనా అప్పు చేయా ల్సిందే. నిజానికి ఇలాంటి వారికే ఎక్కువ అప్పు లిస్తారు కూడా. ఈ రేంజ్‌లో ఉన్న వారికి రెడ్ కార్పెట్ వేసి అప్పులిచ్చి గౌరవించడం, ఎగ్గొడితే ఫ్లయిట్లలో విదేశాలకు పంపడం కూడా మనకు తెలిసిందే కదా..
అప్పుకు మారుపేరైన.. ‘ఈఎంఐ’ల్లో పుట్టి (హాస్పిటల్ చార్జీలు కూడా ఈఎంఐలో కట్టేంతగా ఉంటాయి), ఈఎంఐల్లో పెరిగి, ఈఎంఐలతో చదువుకుని, ఈఎంఐల్లో పోవడమే మధ్య, పేద తరగతి జీవితం.
కానీ, అప్పుల్లోనూ అంత ఖదర్‌గా బతికే బిజినెస్, రిచ్ క్లాసూ ఉంది.
రుణ.. పురాణం
నిజానికి ఈ అప్పు లొల్లి, అప్పుల్లోనూ పేద ధనిక తారతమ్యం పురాణాల కాలం నుంచీ ఉన్నట్టుంది.
బూడిద పూసుకుని, కనీసం ఒంటిపై బ్రాండెడ్ బట్టల్లేకుండా పులి చర్మాలు, నారచీరలు ధరించి శ్మశానాల్లో తిరుగుతూ ఉండే ‘శంకరుడి’కి కుబేరు డెప్పుడయినా లోన్ ఆఫర్ చేసిన సందర్భాలు కనిపిస్తాయా..? గడ్డ కట్టుకు పోయే చలిలో హిమాలయాల్లో నివసించే శివుడు కనీసం ‘హోమ్‌లోన్’కు అప్లయి చేసుకున్న దాఖలాలూ లేవు. యుగాల తరబడి అదే నందీశ్వరుడిని యూజ్ చేశాడే కానీ, ఎవరైనా శివుడికి ‘వెహికల్ లోన్’ అరేంజ్ చేశారా..? పుష్పక విమానంలో తిరిగే కుబేరుడు ఆఫర్ చేశాడా.. ఎందుకంటే ఆయన పేద దేవుడు. పైగా ఎవరేం అడిగినా ఇచ్చేసే భోళా శంకరుడాయే.. ‘కొల్లాటరల్ సెక్యూరిటీ’ చూపే శక్తి లేదు. ప్రధానుల, ముఖ్యమంత్రుల రికమండేషన్ కూడా లేనట్టుంది.
... ఇప్పటి మన రైతులు, పేదోళ్ల పరిస్థితిలాగా!
అదే, విష్ణుమూర్తిని చూడండి. ఆయన మ్యారేజీకి కుబేరుడు ఎంత డబ్బిచ్చాడు! తిరుపతి వెంకన్నఇంకా కిస్తులు కడుతూనే ఉన్నాడు. ఆయనకు ఆ అప్పెలా వచ్చింది. ఆ అప్పు ఎందుకు తప్పు కాలేదు..? ఎందుకంటే ఆయన బాగా రిచ్చి. స్వయంగా లక్ష్మీదేవియే అర్ధాంగి. దేవుళ్లలో బాగా పలుకుబడి ఉన్నవాడు. ఘనంగా అల వైకుంఠపురంలో ఆ మూల సౌధాల్లో నివసిస్తాడు. పెద్దోళ్లందరికీ కావలసినవాడు. ఇంకేం ఎంతైనా అప్పు పుట్టుద్ది... మన రిచ్ పీపుల్ లాగా.
– ఇక మన ఆర్థిక మంత్రి సీతారామన్ లాంటి వాళ్లెవరైనా ఉంటే దేవుళ్లలో ఇప్పటికే వెంకన్న రుణం అంతా ‘రైటాఫ్ ’ అయిపోయేది.
అప్పు.. సంపన్నం
ఇది చూడండి.. మనం ఆరాధనగా చూసే అమెరికా, సింగపూర్ తలసరి అప్పులు ఎక్కువే. అక్కడ సింగపూర్‌లో ఒక్కొక్కరిపై 97.46 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. జపాన్, కెనడా, బెల్జియం వంటి సంపన్న దేశాల వారి తలసరి అప్పులు ఎక్కువ. రిచ్‌నెస్ అలా ఉంటది మరి.
అప్పుల్లోనూ.. పూర్
ఆఫ్గానిస్థాన్ , డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బురుండి, మడగాస్కర్, లైబీరియా వంటి చిన్న దేశాల్లో తలసరి అప్పు తక్కువే. విదేశాల నుంచి అప్పులు దొరకడం కష్టం. ఆదాయమే సరిగ్గా లేని వాళ్లకు అప్పులెలా ఇస్తారు.. అదీ సంగతి
.......
.. ఇంతకీ బీఆర్‌ఎస్‌కైనా, బీజేపీకైనా చెప్పొచ్చేదేమంటే.. ఎంత అప్పుంటే అంత దర్జా.. ఎంత దర్జా ఉంటే అంత అప్పు... కనుక ‘పక్కోడు చేసే అప్పులు..’ పెరుగుతున్నాయని చింతించవలదు.
డబ్బున్నోడికి అప్పు ఈజీ కదా.. అంటే అప్పుంటే డబ్బు, దర్పం ఉన్నట్టే కదా! అంటే మనం బాగానే ఉన్నాం అనుకుంటే సరి.
.......
కానీ, ‘...మన మీద పడే అప్పులపై ’ చింతించే మిడిల్ క్లాస్ ఒకటి ఉందండోయ్..
‘ఇప్పటికే ఏళ్ల తరబడి ఇంటి లోన్ కడుతున్నాను, ఈ మధ్యే పిల్లాణ్ణి స్కూల్లో వేయడానికి ఓ లక్ష అప్పు చేశాను, కరోనా మింగిన నాలుగు లక్షల తాలూకు అప్పు, వడ్డీ అలాగే ఉన్నాయి. రెండో అమ్మాయి స్కూల్లో చేరడానికి రెడీ అవుతోంది. ఈ ఖర్చులిలా ఉండగా మన ‘డబుల్ ఇంజన్ సర్కార్లు’ వాళ్లు చేసిన అప్పులన్నీ మనతోనే కట్టిస్తారు.. వాళ్ల జేబు లోంచి కట్టరుగా... అని మా ఆవిడ భయంగా అడుగుతోంది..’
– కేటీఆర్, సంజయ్ ΄పోటా పోటీ ‘అప్పుల’ విమర్శలు చూసి ఓ నెటిజన్ పోస్టు ఇది.
ఆలోచించదగ్గ ఆందోళనే. అక్కడిదాకా రాకుండా చూడండి. ఇప్పటికే అప్పులు కట్టలేక చస్తున్నాం. (క్లిక్ చేయండి: బయటపడిన అమెరికా డొల్లతనం)
Comments
Please login to add a commentAdd a comment