‘అమ్మ’ లేనిదే ఆ ‘బిడ్డ’ ఉండలేదు.. ‘తల్లి’ దూరమైతే ఏమాత్రం తట్టుకోలేదు... ఇక్కడ... ‘అమ్మ’ అంటే... భూమాత..! ‘బిడ్డ’ అంటే... రైతు..!! భూమాతను తనకు దూరం చేయడాన్ని ఆ బిడ్డ తట్టుకోలేకపోయాడు. తనకు, తన కుటుంబానికి సర్వస్వమైన ఆ భూమాతను లాక్కుంటుంటే సహించలేకపోయాడు. అడ్డుకోలేని అశక్తుడయ్యాడు. మనసు ముక్కలైంది. బతుకు లేదనుకున్నాడు. ప్రాణాలు తీసుకోబోయాడు.
ఇల్లెందు: మండలంలోని రాఘబోయినగూడెం పంచాయతీ బోడియాతండా గ్రామానికి చెందిన పోడు రైతు కున్సోత్ చంద్రు, ఆత్మహత్యకు యత్నించాడు. సాగు భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతుండడాన్ని తట్టుకోలేకపోయాడు. భరించలేని మనోవేదనతో ఆ భూమి లోనే.. ఆ భూమాత ఒడిలోనే.. ఆ మట్టిలోనే ఐక్యమవుదామనుకున్నాడు. పురుగు మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే ఇల్లెందు వైద్యశాలలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
గత 20 ఏళ్ల క్రితం కున్సోతో చంద్రు, ఆయన కుమార్తె భద్రమ్మతో కలిసి బోడియాతండా సమీపంలో పది ఎకరాల పోడు నరికి సేద్యం చేపట్టాడు. 2006లో అటవీ హక్కుల చట్టం కింద ఇతడికి ప్రభుత్వం హక్కు పత్రం కూడా ఇచ్చింది. ఇటీవల రైతుబంధు పథకం కింద పది ఎకరాలకుగాను రూ.40వేలు కూడా వచ్చాయి.
ఈ భూమిలో సేద్యం చేయరాదంటూ అతడిని అటవీశాఖ అధికారులు గత మూడేళ్లుగా అడ్డుకుంటున్నారు. మరో ముగ్గురు రైతులది కూడా ఇదే పరిస్థితి. ఈ నలుగురు రైతులు కలిసి కోర్టును ఆశ్రయించారు. ఉన్నతాధికారులకు సమస్యను విన్నవించారు. అటవీశాఖ అధికారులు ఆగలేదు. చంద్రు, మరో ముగ్గురు రైతులు, పదిమంది కూలీలతో తమ పోడు భూమిని సాగు చేసేందుకు శుక్రవారం వెళ్లారు.
అప్పటికే రోళ్లపాడు సెక్షన్ ఆఫీసర్ భాగ్య, కుంటల, వేపలగడ్డ, కొల్లాపురం బీట్ ఆఫీసర్లు పాపయ్య, ఎల్.శ్రీను, గౌరమ్మ, సిబ్బంది కలిసి ఆ నలుగురు రైతుల భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లారు. ఇటు రైతులు, అటు అధికారులు. వారి మధ్య వాగ్వివా దం జరిగింది.
తన కళ్లెదుటే... తన భూమాతను (భూమిని) అధికారులు లాక్కోవడాన్ని చూస్తూ చంద్రు తట్టుకోలేకపోయాడు. పురుగు మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే ఇల్లెందు వైద్యశాలకు తరలించారు. డాక్టర్ నాగశశికాంత్ ప్రాథమిక వైద్యం అందించి ఖమ్మం ఆస్పత్రికి రిఫర్ చేశారు.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏమంటున్నారంటే..
చంద్రు ఆత్మహత్యాయత్నంపై ఫారెస్టు సెక్షన్ ఆఫీ సర్ భాగ్యను ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘కుంటల సెక్షన్‌లోని బోడియాతండా సమీపంలోని భూమి లో మొక్కలు నాటేందుకు ముగ్గురు బీట్ ఆఫీసర్ల తో కలిసి శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లాము. మారణాయుధాలు చేబూనిన కొంతమంది అక్కడ? ప్లాంటేషన్‌ను తొలగించేందుకు యత్నించారు.
మేము గట్టిగా ప్రశ్నించటంతో వారు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. అంతలోనే, తాను మందు తాగినట్టుగా చంద్రు కేకలు వేశాడు. ఆయనను అక్కడే ఉన్న కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment