పోడులో ‘పోరు’ నాగళ్లు
* 200 ఎకరాల్లో విత్తనాలు చల్లిన 300 మంది గిరిజనులు
* సీపీఎం ఆధ్వర్యంలో భూపోరాటం
వాజేడు: ఖమ్మం జిల్లా వాజేడు మండల పరిధిలోని చెరుకూరు, కడేకల్ గ్రామాల మధ్య ఉన్న పోడు భూమిలో మంగళవారం కృష్ణాపురం గ్రామానికి చెందిన 300 మంది గిరిజనులు నాగళ్లు కట్టి దున్నారు. ఇక్కడి ఎర్రబోరు ప్రాంతంలో అటవీశాఖ అధికారులు హరితహారం మొక్కలు నాటుతుండగా, 2007లో ఈ ప్రాంతాన్ని చదును చేశామని.. అప్పటి నుంచి తామే పోడు చేసుకుంటున్నామని గిరిజనులు పేర్కొంటూ భూపోరాటానికి దిగారు.
సుమారు 100 మంది రైతులు సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎర్రబోరులోని 200 ఎకరాల భూమిని దున్నారు. తొమ్మిది రకాల విత్తనాలను చల్లారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వచ్చి.. గిరిజనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, సుమారు 300 మంది గిరిజనులు ఉండడంతో అటవీ సిబ్బంది తక్కువగా ఉండడంతో ఏం చేయలేక మిన్నకున్నారు. ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేసినా.. స్పందించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.