‘పోడు’ పరిరక్షణకు నేడు మహా ధర్నా
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పోడు భూమిని సాగు చేసుకుంటున్న వారిపై ప్రభుత్వం దమనకాండకు దిగడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నిర్వహిస్తున్న ధర్నాలో బీకేఎంయూ నేత నాగేంద్రనాథ్ ఓఝా, కె.నారాయణ, జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం, ప్రొ. హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు. తరతరాలుగా పోడు చేసుకుని జీవిస్తున్న ఎస్టీ, ఎస్సీ, బడుగు బలహీనవర్గాల వారిని హరితహారం పేరిట ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఈ ధర్నాను చేపట్టినట్లు తెలియజేశారు.
అటవీ హక్కుల చట్టం, 2006 ప్రకారం పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాల్సిందిపోయి వారిని దౌర్జన ్యంగా ప్రభుత్వం గెంటేస్తోందని ధ్వజమెత్తారు. పోడు సాగుదారుల గ్రామాలపై అటవీ, పోలీసు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తూ, పీడీ యాక్ట్ కింద అక్రమ కేసులు బనాయించి జైళ్లలో నిర్బంధిస్తున్నారని విమర్శించారు.