సాక్షి, హైదరాబాద్: పోడు భూముల వ్యవహారంలో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్నామంటూ తాజాగా రైతులు పెద్ద ఎత్తున అధికారులకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, గత ఏడాది చివరలో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకించి తుది గడువు విధించలేదు.
ఈ క్రమంలో దాదాపు మూడు నెలల పాటు దరఖాస్తులను స్వీకరించి వాటిని కంప్యూటరీకరించారు. తాజాగా వీటిని పరిశీలించి, అర్హతలు ఖరారు చేయాలని ఆదేశాలు జారీన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో పోడు అంశం కొలిక్కి వస్తుందనే భరోసా రావడంతో పెద్ద సంఖ్యలో రైతులు పోడు సాగు చేసుకుంటున్నట్లు ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. వీటిని స్వీకరించి పరిశీలించాలని క్షేత్రస్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు చేస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది.
అధికారులపై నేతల ఒత్తిడి..
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు వేగిరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. జిల్లా, డివిజినల్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామాల వారీగా సభలు నిర్వహించి సాగు వివరాలపై స్పష్టత తీసుకురావడం, శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు అధికారాలు ఇచ్చింది. ఈ క్రమంలో గ్రామాల వారీగా సభలు నిర్వహిస్తున్న కమిటీలకు కొత్త దరఖాస్తులు తలనొప్పిగా మారుతున్నాయి.
వాటిని స్వీకరించాలా? వద్దా? అనేది అధికారులు తేల్చుకోలేక పోతున్నారు. వీటిని తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని కొందరు నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనపై ఉన్నతాధికారులను కిందిస్థాయి అధికారులు సలహాలు కోరుతున్నారు. రాష్ట్రంలోని 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 4,14,353 క్లెయిమ్స్ రాగా.. వీటిలో 86 శాతం పరిశీలన పూర్తయింది.
మరో వారంరోజుల్లో మొత్తం పరిశీలన పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పోడు భూముల సాగుపై సర్వే ప్రక్రియ సైతం వేగవంతం అయింది. ఈ నెలాఖరులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చేనెలలో పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment