పోడు రైతుకు హరిత గండం ముంచుకొస్తోంది. వర్షాకాలం ఆరంభం కాగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టే హరితహారం కార్యక్రమంలో ఏజెన్సీలోని పోడు భూముల్లో అలజడి మొదలవుతుంది. ఈసారి ముందుగానే అప్రమత్తమైన ఏజెన్సీ పోడు భూముల రైతులు... వామపక్షాల మద్దతుతో తమ భూములను కాపాడుకునేందుకు ప్రతిఘటనకు సిద్ధమవుతున్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి స్వరాష్ట్రం తెలంగాణ వరకు పోడు రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.
పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని అనేక ఏళ్లుగా పోడు ఉద్యమాలు సాగుతున్నప్పటికీ పరిష్కార మార్గం కనిపించడం లేదు. అంతే కాకుండా ఆ భూమి అటవీ శాఖ పరిధిలో ఉందంటూ అధికారులు ట్రెంచ్‌లు కొడుతుండటంతో పోడు రైతులు అడ్డుపడుతున్నారు. ఆ సమయంలో వారిపై ప్రతియేటా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తరతరాలుగా అడవిని ఆధారం చేసుకొని బతుకుతున్న ఆదివాసులు నేడు అడవికి దూరమవుతున్నారు.
అడవికీ, ఆదివాసీకీ మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది. అడవుల్లోని ప్రతి చెట్టూ ఆదివాసీలకు పూజనీయమే. అనేక చెట్లూ, జంతువులూ ఆదివాసీల తెగలను సూచిస్తాయి. అందుకే ఎల్లప్పుడూ అడవీ, అడవిలోని జంతుజాలమూ సురక్షితంగా తమ తరువాతి తరాలకు అందాలని ఆదివాసీలు ప్రగాఢంగా కోరుకుంటారు. చట్టాలకు భంగం కలగకుండా ఆదివాసీల అభిప్రాయాలను గౌరవిస్తూ... వారి కోరికల మేరకే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనీ, గ్రామసభల ద్వారా చేసిన తీర్మానాలూ, అటవీ చట్టాలు, ఆదివాసీ హక్కుల చట్టాలకు అనుగుణంగా అడవినీ, ఆదివాసులను పరిరక్షించాలనీ రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ నేడు అటవీశాఖ అధికారులూ, పోలీసులూ రాజ్యాంగ నిర్దేశాలను తుంగలో తొక్కి ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే పనులు చేస్తున్నారు.
ఇకనైనా ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలను రక్షించి, ఏళ్లుగా పరిష్కారం కాని ఆదివాసీ గిరిజనుల భూములకు పోడు పట్టాలు అందించాలి. అçప్పుడే వాళ్ళ అభివృద్ధి సాధ్యమవుతుంది.
– జటావత్ హనుము, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment