Podu farmer
-
పోడుదారులకు రైతుబంధు.. రైతులు వివరాలు అందించాలి
నర్సంపేటరూరల్/ఖానాపురం/నెక్కొండ/నల్లబెల్లి : పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హక్కుపత్రాలు పొందే రైతులకు రైతుబంధు సైతం అందించడానికి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని ఖానాపురం, నల్లబెల్లి, నెక్కొండ, నర్సంపేట మండలాల్లో పోడు భూముల కోసం 3,353 మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్వే చేసిన అనంతరం 3,271 మంది లబ్ధిదారులు.. 7,333 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. సాంకేతిక కారణాలతో 3,262 మందికి పట్టాలను సైతం తయారీ చేయించి పంపిణీకి సిద్ధం చేశారు. హక్కుపత్రాలు పొందే రైతులకు రైతుబంధు సైతం అందించనుంది. ఇప్పటికే ఇతర రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. వీరితోపాటు గిరిజన రైతులకు సైతం అందించడానికి వివరాలు సేకరిస్తున్నారు. హక్కుపత్రాలు పొందిన గిరిజన రైతుల వివరాలను ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు.. మండల వ్యవసాయ అధికారులకు అందించారు. వివరాల ఆధారంగా గిరిజన రైతుల వద్ద నుంచి ఆధార్, బ్యాంకు ఖాతాల జిరాక్స్ పత్రాలను స్వీకరిస్తున్నారు. ఖానాపురం మండలలో సుమారు 1,829 మంది గిరిజన రైతులు, సుమారు 700 ఎకరాల భూమిని గుర్తించారు. వీరిలో సుమారు 1200 మంది నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు వివరాలు సేకరించి వ్యవసాయ అధికారులకు చేరవేస్తున్నారు. సుమారు మరో 629 మంది రైతులు ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈనెల 30 లోపు వ్యవసాయ అధికారులకు అందజేస్తే జూలై 3 లోపు ఆన్లైన్లో నమోదు చేయడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటి వరకు 560 దరఖాస్తులను వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా, ఇప్పటికే రైతుల వివరాలు ఆన్లైన్ చేయగా రైతు బంధు డబ్బులు సైతం ఖాతాల్లో జమ అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. నల్లబెల్లి మండలంలో 1083 మంది పోడు రైతులు హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్రామస్థాయిలో 964 మంది రైతుల దరఖాస్తులు ఆమోదించారు. ప్రభుత్వం 906 దరఖాస్తులను ఆమోదించి, 2,700 ఎకరాలకు హక్కుపత్రాలు అందించనుంది. నెక్కొండలో 220 మంది రైతులకు 355 ఎకరాలకు, నర్సంపేట మండలంలో 120 మందికి 237 ఎకరాల భూమికి సంబంధించి హక్కుపత్రాలు అందించనుంది. ఈ మండలాల్లో కూడా అధికారులు పోడు రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఆన్లైన్ చేసేందుకు గడువు పొడిగించాలి రైతుబంధు కోసం గిరిజన రైతుల నుంచి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏఈఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 70దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నారు. నమోదు సమయంలో సర్వర్ మొరాయిస్తోంది. ఉ దయం, రాత్రి వేళ నిత్యం కంప్యూటర్‌తో కుస్తీ పడి తే సుమారు 120 నుంచి 150 వరకు ఆన్లైన్ అవుతున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో వ్యవసాయ అధికారులు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. రైతులు వివరాలు అందించాలి హక్కుపత్రాలు కలిగిన వివరాలు పంచాయతీ కార్యదర్శులకు అందాయి. వాటి ఆధారంగా గిరిజన రైతులు ఆధార్, బ్యాంకు ఖాతాల జిరాక్స్‌లను వ్యవసాయ విస్తరణ అధికారులకు లేదా పంచాయతీ కార్యదర్శులకు అందించాలి. సకాలంలో ఆన్లైన్ చేస్తేనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వివరాలు అందించని రైతులు రైతుబంధును కోల్పోవాల్సి వస్తుంది. – బోగ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి, ఖానాపురం -
పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ..
-
ఖమ్మం: గుడిపాడులో పోడు రైతులు ఫారెస్ట్ సిబ్బందికి మధ్య ఘర్షణ
-
Haritha Haram: పోడు రైతుకు హరితహారం గండం
పోడు రైతుకు హరిత గండం ముంచుకొస్తోంది. వర్షాకాలం ఆరంభం కాగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టే హరితహారం కార్యక్రమంలో ఏజెన్సీలోని పోడు భూముల్లో అలజడి మొదలవుతుంది. ఈసారి ముందుగానే అప్రమత్తమైన ఏజెన్సీ పోడు భూముల రైతులు... వామపక్షాల మద్దతుతో తమ భూములను కాపాడుకునేందుకు ప్రతిఘటనకు సిద్ధమవుతున్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి స్వరాష్ట్రం తెలంగాణ వరకు పోడు రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని అనేక ఏళ్లుగా పోడు ఉద్యమాలు సాగుతున్నప్పటికీ పరిష్కార మార్గం కనిపించడం లేదు. అంతే కాకుండా ఆ భూమి అటవీ శాఖ పరిధిలో ఉందంటూ అధికారులు ట్రెంచ్‌లు కొడుతుండటంతో పోడు రైతులు అడ్డుపడుతున్నారు. ఆ సమయంలో వారిపై ప్రతియేటా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తరతరాలుగా అడవిని ఆధారం చేసుకొని బతుకుతున్న ఆదివాసులు నేడు అడవికి దూరమవుతున్నారు. అడవికీ, ఆదివాసీకీ మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది. అడవుల్లోని ప్రతి చెట్టూ ఆదివాసీలకు పూజనీయమే. అనేక చెట్లూ, జంతువులూ ఆదివాసీల తెగలను సూచిస్తాయి. అందుకే ఎల్లప్పుడూ అడవీ, అడవిలోని జంతుజాలమూ సురక్షితంగా తమ తరువాతి తరాలకు అందాలని ఆదివాసీలు ప్రగాఢంగా కోరుకుంటారు. చట్టాలకు భంగం కలగకుండా ఆదివాసీల అభిప్రాయాలను గౌరవిస్తూ... వారి కోరికల మేరకే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనీ, గ్రామసభల ద్వారా చేసిన తీర్మానాలూ, అటవీ చట్టాలు, ఆదివాసీ హక్కుల చట్టాలకు అనుగుణంగా అడవినీ, ఆదివాసులను పరిరక్షించాలనీ రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ నేడు అటవీశాఖ అధికారులూ, పోలీసులూ రాజ్యాంగ నిర్దేశాలను తుంగలో తొక్కి ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే పనులు చేస్తున్నారు. ఇకనైనా ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలను రక్షించి, ఏళ్లుగా పరిష్కారం కాని ఆదివాసీ గిరిజనుల భూములకు పోడు పట్టాలు అందించాలి. అçప్పుడే వాళ్ళ అభివృద్ధి సాధ్యమవుతుంది. – జటావత్ హనుము, హైదరాబాద్ -
పోడు రైతులకు పట్టాలివ్వకపోవడం అన్యాయం
సాక్షి, హైదరాబాద్: పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పట్టాలివ్వకపోవడం అన్యాయమని, వెంటనే వారికి పట్టాలివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోడుసాగుదారులకు అన్యాయం జరిగిందని, ఎన్ని పోరాటాలు చేసినా పోడుసాగుదారులకు పట్టాలివ్వలేదని వాపోయారు. తెలంగాణ వచ్చి ఇప్పటికి ఏడేళ్లు గడుస్తున్నా పట్టాలివ్వకపోవడం శోచనీయమని, ధరఖాస్తులు తీసుకుని ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారో అర్థం కావడంలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోడుపట్టాలివ్వకపోవడం వల్ల రైతుబంధు అందడం లేదని, చనిపోయిన రైతు కుటుంబాలకు రైతుబీమా అందక రోడ్డున పడ్డారని, పంట రుణాలు ఇవ్వడం లేదని విచారం వ్యక్తంచేశారు. -
‘పోడు’ పట్టాల కోసం గిరిజనేతర రైతుల పోరు
సాక్షి, మహబూబాబాద్: గిరిజనేతర పోడు రైతులు కూడా కదంతొక్కారు. వందల ఏళ్లుగా అడవితో, గిరిజనులతో మమేకమైన తమను అటవీభూములకు దూరం చేయొద్దంటూ ఏకమయ్యారు. తమ పోడుభూములకు కూడా పట్టాలివ్వాలంటూ పోరుబాట పట్టారు. సోమవారం భారీగా తరలివచ్చి మహబూబాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, గూడూరు ఏజెన్సీ ప్రాంతాల నుంచి వేలాదిమంది గిరిజనేతర రైతులు ట్రాక్టర్లు, డీసీఎంల్లో జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. కలెక్టరేట్ ముట్టడికిగాను మూడుకొట్ల సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి రైతులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట జరిగింది. ఎట్టకేలకు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు 20 మందిని పోలీసులు అనుమతించారు. ఈ మేరకు రైతులు అదనపు కలెక్టర్ కొమురయ్యను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఖాసీం, ఎమ్మార్పీఎస్ నాయకుడు పీరయ్య మాట్లాడుతూ వందల ఏళ్ల క్రితమే ఏజెన్సీ ప్రాంత గిరిజనులతో సమానంగా గిరిజనేతరులు పోడు చేసుకుని జీవిస్తున్నారని అన్నారు. వీరికి కూడా గిరిజనులతో సమానంగా పోడుపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొంతనలేని నిబంధనలు పెట్టి గిరిజనేతరులకు అన్యాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనేతరులకు పోడుపట్టాలు ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజనేతర రైతు పోరాట సమితి నాయకులు, ఏజెన్సీ మండలాల్లోని ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
పోడు భూముల రైతులను పరామర్శించిన సీతక్క
-
ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం
ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్రంలో జరుగుతున్న పోడు రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అఖిలభారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య అన్నారు. ఆదివారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణలో అధికారం కోసం సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్య తీవ్రంగా మారిందన్నారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో పోడు రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నింటికి అటవీశాఖ అధికారులు, ప్రభుత్వం కారణమన్నారు. 2006 అటవీ హక్కు చట్టం కింద పోడు సాగుదారులు పొందిన భూమిని అధికారులు హరితహారం పేరుతో లాక్కుంటున్నారన్నారు. అటవీశాఖ అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పోడు సాగు భూముల నుంచి ఆదివాసీలను కేసీఆర్ ప్రభుత్వం గెంటివేయడాన్ని వ్యతిరేకిస్తూ, ఆదివాసీలు నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావంగా రాష్ట్రంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఆందోళనలు చేపడతామన్నారు. ఈ నెల 20న దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. మద్దతు ధర మహా మోసం.. ప్రధాని మోదీ ప్రకటించిన వ్యవసాయ ఉత్పత్తుల మద్ధతు ధర మహా మోసం అని ఆరోపించారు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు తగ్గించి చూపించారని, వాటిని సాకుగా చూపించి ధరలు పెంచామని చెప్పడం ద్రోహం అన్నారు. ప్రకటించిన ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వరి, గోధుమలతో పాటు ఇతర ధాన్యాలను కూడా ప్రభుత్వం సేకరించాలన్నారు. అక్టోబర్‌లో కొత్తగూడెంలో జాతీయ ఆదివాసీ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీల డిమాండ్లకు తాము మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యం బాగలేని ఎన్డీ రాష్ట్ర నాయకుడు మధుని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం దారుణమని, ఇటీవలే అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదల అయిన మధు ఏ నేరం చేశారని ప్రశ్నించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కోటేశ్వరరావు, కెచ్చెల రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయల చంద్రశేఖర్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, చిన చింద్రన్న, ఆవుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పోడు రైతులకూ పెట్టుబడి
సాక్షి, అచ్చంపేట: నల్లమల ప్రాంతంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏళ్ల తరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు మేలు జరిగేలా రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సాగుకు సాయం అందించేలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు బంధు’ పథకాన్ని పోడు రైతులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు అటవీహక్కు చట్టం పత్రాలను కొన్నేళ్ల క్రితమే ఇచ్చారు. అయితే, ఈ పత్రాలతో బ్యాంకు ద్వారా రుణాలు పొందే అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుని సాగు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గిరిజన రైతులకు కూడా ‘రైతు బంధు’ కింద పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీ–ఫారం సర్టిఫికెట్ ఉంటేనే.. ఆర్ఓఎఫ్ఆర్ టైటిల్‌తో పాటు డీ ఫారం పట్టా సర్టిఫికెట్ ఉన్న గిరిజనులకు రైతుబంధు పథకం వర్తిస్తుం ది. అలాగే గిరిజనులే సొంతంగా సాగు చేస్తూ ఉండాలని ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అటవీ హక్కు చట్టంతో తరతరాల నుంచి పోడు చేసుకొంటున్న గిరిజనులకు అన్ని రకాల హక్కులు సక్రమించేలా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో హక్కు పత్రాలు అందజేశారు. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1,879 మంది 3,456 ఎకరాల పోడు భూముల కో సం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులను గుర్తించేందుకు గ్రామపంచాయతీల్లో 45 అటవీ హక్కుల కమిటీలు, నాలుగు డివిజన్ స్థాయి కమిటీలు, జిల్లా స్థాయిలో డీఎల్ఎస్ కమిటీలు ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించారు. చివరకు 1,016 మంది రైతులను అర్హులుగా గుర్తించి 2,197 ఎకరాల భూమికి హక్కు కల్పిస్తూ పత్రాలు అందజేశారు. ఇంతకాలం ప్రైవేట్ అప్పులే.. పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు అందించినా వాటి ద్వారా పంట సాగుకు బ్యాంకు రుణాలు అందలేదు. దీంతో చేసేదేం లేక గిరిజనులు ప్రైవేట్‌గా అప్పులు తెచ్చుకుని పంట సాగుచేసే వారు. పెట్టుబడి పెట్టే స్తోమత లేక కొందరు పోడు భూములను ఇతరలకు కౌలుకు ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతులకు రూ.4వేలు ఇవ్వాలని నిర్ణయించిన విషయం విదితమే. తొలుత రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూశాఖ నిర్వహించిన భూప్రక్షాళనలో పోడు భూములను వ్యవసాయ భూములుగా కాకుండా ‘బీ’ కేటగీరీలో వివాదాస్పద భూములుగా చేర్చారు. గుర్తించారు. దీంతో ఆ భూములకు పెట్టుబడి సాయం ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చివరకు గిరిజనుల ఒత్తిడి, ప్రజాప్రతినిధుల విన్నపాలతో పోడు భూములకు పెట్టుబడి సాయం అందజేయాలని తాజాగా నిర్ణయం తీసుకోవడంతో 1,016 మంది హక్కుదారులకు పెట్టుబడి సాయం అందనుంది. అర్హులకు అందేనా? అటవీ భూములు సాగు చేసే రైతులకు పెట్టుబడి సా యం అందజేయాలన్న నిర్ణయం మంచిదే అయినా అర్హులైన గిరిజనులకు ఆ సాయం అందుతుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 2008 నుంచి ఆటవీ భూములపై హక్కుపత్రాలు పొందిన గిరిజనుల్లో చాలా మంది పెట్టుబడి పెట్టే స్థోమత లేక ఇతరులకు కౌలుకు ఇవ్వగా మరికొందరు అమ్ముకున్నారు. మరికొన్ని చోట్ల పోడు భూములు అక్రమణ కు గురయ్యాయి. అక్కడక్కడా అటవీ అధికారులు తమ భూములని చెబుతూ స్వాధీనం చేసుకున్నారు. కొందరికి హక్కు పత్రాలు వచ్చిన వారి భూములు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ మేర కు మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయంలో ప్రతి బుధవారం నిర్వహించిన గిరిజన దర్భార్‌లో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు దరఖాస్తు లు ఇచ్చారు. ఇప్పటి వరకు 40 దరఖాస్తులు అందగా వీటిని డీఎఫ్ఓ, ఆర్డీఓలకు పంపించినట్లు ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందులో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఇక 2009 తర్వాత ఎక్కడ కూడా ఎఫ్ఆర్సీ చట్టం కింద పట్టాలు కానీ, హక్కు పత్రాలు అందజేయకపోవడంతో ఇంకా పలువురు పోడు రైతులు ఎదురుచూస్తున్నారు. మరి వీరి సంగతి? అటవీ హక్కుల చట్టం ఏర్పాటుపై 2009లో రెండో సారి అధికారులు సమావేశం నిర్వహించారు. ఇందు లో 291 మంది గిరిజనులు 864 ఎకరాల భూమి కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించినా హక్కు పత్రాలు అందించలేదు. ఇంకా పలువురు పోడు భూ ముల్లో సాగు చేస్తుండగా అటవీ అధికారులు తరచూ దాడులకు దిగుతుండడం గమనార్హం. నాగర్‌కర్నూల్ జిల్లాలో వేలాది మంది గిరిజనులు పోడు భూములు సాగు చేస్తుండగా హక్కు పత్రాలు లేవు. చట్టం ఏం చెబుతోందంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటవీ హక్కు చట్టం ప్రకారం తరతరాల నుంచి పోడు చేసుకుంటున్న గిరిజనులకు అన్ని రకాల హక్కులు సక్రమించాల్సి ఉ న్నా అది అమలుకు నోచుకోలేదు. 2005 డిసెంబర్ 31కు పూర్వం సాగులో ఉన్న రైతులకు హక్కు పత్రా లు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం చెబుతోంది. కేంద్రప్రభుత్వం నిర్దేశించిన 13వ నిబంధన ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి అటవీహక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. గిరిజనులతో పాటు గిరిజనేతరులు 75 ఏళ్ల పాటు మూడు తరాలుగా భూమి వారి అక్రమణలో ఉన్నట్లు రుజువైతే వారికీ ప ట్టా పొందే అర్హత ఉంది. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి ఆక్రమిత భూమిలో గరిష్టంగా పది ఎకరాల వరకు కేటాయించి హక్కు పత్రాలను అందజేయాలి. 2006లో ఎస్ఎల్బీసీ సొరంగానికి సంబంధించిన పనులు అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ప్రారంభించారు. అప్పటి వరకు ఉన్న గిరిజనులు, గిరిజనేతరులకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉన్నా ఎవరూ దృష్టి సారించకపోవడంతో అక్కడ పోడు భూములు సాగు చేసుకుంటున్న వందలాది మంది గిరిజనులు అన్యాయానికి గురయ్యారు. -
మర్రిగూడెంలో పోడు రైతు ఆత్మహత్య
-పంట నాశనం చేశారని మనస్తాపం? చండ్రుగొండ ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం మర్రిగూడెంకు చెందిన పోడు రైతు మడకం వెంకటేశ్వర్లు(30) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు తనకున్న ఐదెకరాల పోడుభూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. దీని కోసం రూ.లక్ష వరకు అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు. ఇటీవల అటవీశాఖ అధికారులు ఆ పంటను నాశనం చేయడంతో మనస్తాపం చెంది ఇంటి వెనుక భాగంలో కండువతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు ఉరివేసుకున్న తీరు అనుమానాస్పందంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, వెంకటేశ్వర్లు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోలేదని ఏఎస్సై హుస్సేన్ అంటున్నారు. అతను గుంటూరు జిల్లాలో పని చేసుకుంటున్నాడని, వెంకటేశ్వరుల సోదరుడు శ్రీను ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, కర్మకాండల కోసం వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.