ఖానాపురం : రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న ఏఈఓ సంతోష్
నర్సంపేటరూరల్/ఖానాపురం/నెక్కొండ/నల్లబెల్లి : పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హక్కుపత్రాలు పొందే రైతులకు రైతుబంధు సైతం అందించడానికి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని ఖానాపురం, నల్లబెల్లి, నెక్కొండ, నర్సంపేట మండలాల్లో పోడు భూముల కోసం 3,353 మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్వే చేసిన అనంతరం 3,271 మంది లబ్ధిదారులు.. 7,333 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. సాంకేతిక కారణాలతో 3,262 మందికి పట్టాలను సైతం తయారీ చేయించి పంపిణీకి సిద్ధం చేశారు. హక్కుపత్రాలు పొందే రైతులకు రైతుబంధు సైతం అందించనుంది. ఇప్పటికే ఇతర రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. వీరితోపాటు గిరిజన రైతులకు సైతం అందించడానికి వివరాలు సేకరిస్తున్నారు.
హక్కుపత్రాలు పొందిన గిరిజన రైతుల వివరాలను ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు.. మండల వ్యవసాయ అధికారులకు అందించారు. వివరాల ఆధారంగా గిరిజన రైతుల వద్ద నుంచి ఆధార్, బ్యాంకు ఖాతాల జిరాక్స్ పత్రాలను స్వీకరిస్తున్నారు. ఖానాపురం మండలలో సుమారు 1,829 మంది గిరిజన రైతులు, సుమారు 700 ఎకరాల భూమిని గుర్తించారు. వీరిలో సుమారు 1200 మంది నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్‌ఆర్‌సీ కమిటీ సభ్యులు వివరాలు సేకరించి వ్యవసాయ అధికారులకు చేరవేస్తున్నారు. సుమారు మరో 629 మంది రైతులు ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుంది.
ఈనెల 30 లోపు వ్యవసాయ అధికారులకు అందజేస్తే జూలై 3 లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటి వరకు 560 దరఖాస్తులను వ్యవసాయ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కాగా, ఇప్పటికే రైతుల వివరాలు ఆన్‌లైన్ చేయగా రైతు బంధు డబ్బులు సైతం ఖాతాల్లో జమ అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. నల్లబెల్లి మండలంలో 1083 మంది పోడు రైతులు హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్రామస్థాయిలో 964 మంది రైతుల దరఖాస్తులు ఆమోదించారు.
ప్రభుత్వం 906 దరఖాస్తులను ఆమోదించి, 2,700 ఎకరాలకు హక్కుపత్రాలు అందించనుంది. నెక్కొండలో 220 మంది రైతులకు 355 ఎకరాలకు, నర్సంపేట మండలంలో 120 మందికి 237 ఎకరాల భూమికి సంబంధించి హక్కుపత్రాలు అందించనుంది. ఈ మండలాల్లో కూడా అధికారులు పోడు రైతుల వివరాలు సేకరిస్తున్నారు.
ఆన్‌లైన్ చేసేందుకు గడువు పొడిగించాలి
రైతుబంధు కోసం గిరిజన రైతుల నుంచి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏఈఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 70దరఖాస్తులను ఆన్‌లైన్ చేస్తున్నారు. నమోదు సమయంలో సర్వర్ మొరాయిస్తోంది. ఉ దయం, రాత్రి వేళ నిత్యం కంప్యూటర్‌తో కుస్తీ పడి తే సుమారు 120 నుంచి 150 వరకు ఆన్‌లైన్ అవుతున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో వ్యవసాయ అధికారులు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు.
రైతులు వివరాలు అందించాలి
హక్కుపత్రాలు కలిగిన వివరాలు పంచాయతీ కార్యదర్శులకు అందాయి. వాటి ఆధారంగా గిరిజన రైతులు ఆధార్, బ్యాంకు ఖాతాల జిరాక్స్‌లను వ్యవసాయ విస్తరణ అధికారులకు లేదా పంచాయతీ కార్యదర్శులకు అందించాలి. సకాలంలో ఆన్‌లైన్ చేస్తేనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వివరాలు అందించని రైతులు రైతుబంధును కోల్పోవాల్సి వస్తుంది.
– బోగ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి, ఖానాపురం
Comments
Please login to add a commentAdd a comment