అటవీ హక్కు చట్టం కింద హక్కు పొందిన భూముల్లో సాగు చేస్తున్న రైతులు
సాక్షి, అచ్చంపేట: నల్లమల ప్రాంతంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏళ్ల తరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు మేలు జరిగేలా రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సాగుకు సాయం అందించేలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు బంధు’ పథకాన్ని పోడు రైతులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.
అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు అటవీహక్కు చట్టం పత్రాలను కొన్నేళ్ల క్రితమే ఇచ్చారు. అయితే, ఈ పత్రాలతో బ్యాంకు ద్వారా రుణాలు పొందే అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుని సాగు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గిరిజన రైతులకు కూడా ‘రైతు బంధు’ కింద పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డీ–ఫారం సర్టిఫికెట్ ఉంటేనే..
ఆర్‌ఓఎఫ్‌ఆర్ టైటిల్‌తో పాటు డీ ఫారం పట్టా సర్టిఫికెట్ ఉన్న గిరిజనులకు రైతుబంధు పథకం వర్తిస్తుం ది. అలాగే గిరిజనులే సొంతంగా సాగు చేస్తూ ఉండాలని ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అటవీ హక్కు చట్టంతో తరతరాల నుంచి పోడు చేసుకొంటున్న గిరిజనులకు అన్ని రకాల హక్కులు సక్రమించేలా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో హక్కు పత్రాలు అందజేశారు.
ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1,879 మంది 3,456 ఎకరాల పోడు భూముల కో సం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులను గుర్తించేందుకు గ్రామపంచాయతీల్లో 45 అటవీ హక్కుల కమిటీలు, నాలుగు డివిజన్ స్థాయి కమిటీలు, జిల్లా స్థాయిలో డీఎల్‌ఎస్ కమిటీలు ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించారు. చివరకు 1,016 మంది రైతులను అర్హులుగా గుర్తించి 2,197 ఎకరాల భూమికి హక్కు కల్పిస్తూ పత్రాలు అందజేశారు.
ఇంతకాలం ప్రైవేట్ అప్పులే..
పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు అందించినా వాటి ద్వారా పంట సాగుకు బ్యాంకు రుణాలు అందలేదు. దీంతో చేసేదేం లేక గిరిజనులు ప్రైవేట్‌గా అప్పులు తెచ్చుకుని పంట సాగుచేసే వారు. పెట్టుబడి పెట్టే స్తోమత లేక కొందరు పోడు భూములను ఇతరలకు కౌలుకు ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతులకు రూ.4వేలు ఇవ్వాలని నిర్ణయించిన విషయం విదితమే.
తొలుత రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూశాఖ నిర్వహించిన భూప్రక్షాళనలో పోడు భూములను వ్యవసాయ భూములుగా కాకుండా ‘బీ’ కేటగీరీలో వివాదాస్పద భూములుగా చేర్చారు. గుర్తించారు. దీంతో ఆ భూములకు పెట్టుబడి సాయం ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చివరకు గిరిజనుల ఒత్తిడి, ప్రజాప్రతినిధుల విన్నపాలతో పోడు భూములకు పెట్టుబడి సాయం అందజేయాలని తాజాగా నిర్ణయం తీసుకోవడంతో 1,016 మంది హక్కుదారులకు పెట్టుబడి సాయం అందనుంది.
అర్హులకు అందేనా?
అటవీ భూములు సాగు చేసే రైతులకు పెట్టుబడి సా యం అందజేయాలన్న నిర్ణయం మంచిదే అయినా అర్హులైన గిరిజనులకు ఆ సాయం అందుతుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 2008 నుంచి ఆటవీ భూములపై హక్కుపత్రాలు పొందిన గిరిజనుల్లో చాలా మంది పెట్టుబడి పెట్టే స్థోమత లేక ఇతరులకు కౌలుకు ఇవ్వగా మరికొందరు అమ్ముకున్నారు. మరికొన్ని చోట్ల పోడు భూములు అక్రమణ కు గురయ్యాయి. అక్కడక్కడా అటవీ అధికారులు తమ భూములని చెబుతూ స్వాధీనం చేసుకున్నారు. కొందరికి హక్కు పత్రాలు వచ్చిన వారి భూములు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ మేర కు మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయంలో ప్రతి బుధవారం నిర్వహించిన గిరిజన దర్భార్‌లో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు దరఖాస్తు లు ఇచ్చారు. ఇప్పటి వరకు 40 దరఖాస్తులు అందగా వీటిని డీఎఫ్‌ఓ, ఆర్డీఓలకు పంపించినట్లు ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందులో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఇక 2009 తర్వాత ఎక్కడ కూడా ఎఫ్‌ఆర్‌సీ చట్టం కింద పట్టాలు కానీ, హక్కు పత్రాలు అందజేయకపోవడంతో ఇంకా పలువురు పోడు రైతులు ఎదురుచూస్తున్నారు.
మరి వీరి సంగతి?
అటవీ హక్కుల చట్టం ఏర్పాటుపై 2009లో రెండో సారి అధికారులు సమావేశం నిర్వహించారు. ఇందు లో 291 మంది గిరిజనులు 864 ఎకరాల భూమి కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించినా హక్కు పత్రాలు అందించలేదు. ఇంకా పలువురు పోడు భూ ముల్లో సాగు చేస్తుండగా అటవీ అధికారులు తరచూ దాడులకు దిగుతుండడం గమనార్హం. నాగర్‌కర్నూల్ జిల్లాలో వేలాది మంది గిరిజనులు పోడు భూములు సాగు చేస్తుండగా హక్కు పత్రాలు లేవు.
చట్టం ఏం చెబుతోందంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటవీ హక్కు చట్టం ప్రకారం తరతరాల నుంచి పోడు చేసుకుంటున్న గిరిజనులకు అన్ని రకాల హక్కులు సక్రమించాల్సి ఉ న్నా అది అమలుకు నోచుకోలేదు. 2005 డిసెంబర్ 31కు పూర్వం సాగులో ఉన్న రైతులకు హక్కు పత్రా లు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం చెబుతోంది. కేంద్రప్రభుత్వం నిర్దేశించిన 13వ నిబంధన ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి అటవీహక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. గిరిజనులతో పాటు గిరిజనేతరులు 75 ఏళ్ల పాటు మూడు తరాలుగా భూమి వారి అక్రమణలో ఉన్నట్లు రుజువైతే వారికీ ప ట్టా పొందే అర్హత ఉంది.
ఈ మేరకు ఒక్కో కుటుంబానికి ఆక్రమిత భూమిలో గరిష్టంగా పది ఎకరాల వరకు కేటాయించి హక్కు పత్రాలను అందజేయాలి. 2006లో ఎస్‌ఎల్‌బీసీ సొరంగానికి సంబంధించిన పనులు అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ప్రారంభించారు. అప్పటి వరకు ఉన్న గిరిజనులు, గిరిజనేతరులకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉన్నా ఎవరూ దృష్టి సారించకపోవడంతో అక్కడ పోడు భూములు సాగు చేసుకుంటున్న వందలాది మంది గిరిజనులు అన్యాయానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment