స్వయంకృతం కాశ్మీర్ విలయం
పర్యావరణవేత్తలు పదే పదే చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టినందుకు కాశ్మీర్ మూల్యాన్ని చెల్లించుకోవాల్సివచ్చింది. అతి పెద్ద ప్రశ్న మన ముందు ఇంకా నిలిచే ఉంది. గత తప్పుల నుండి ప్రభుత్వం నేర్చుకుంటుందా, తగు దిద్దుబాటు చర్యలను చేపడుతుందా?
హెచ్చరికలను పట్టించుకునే నాధులెవరూ లేరిప్పుడు. అధిక ఆర్థిక వృద్ధిని సాధించాలనే వెర్రి వ్యామోహం సహజ ఫలితంగానే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. కాశ్మీర్ వరద మృతుల అంచనాలు కట్టాక, వరద తీశాక, శ్రీనగర్ తిరిగి మెల్ల మెల్లగా సాధారణ స్థితికి చేరుతోంది. క నీవినీ ఎరుగని విషాదాన్ని ఎదుర్కొన్న ప్రజలు తిరిగి సున్నితమైన పర్యావరణాన్ని నిర్లక్ష్యంగా కొల్లగొడుతూ దైనందిన కార్యకాలాపాల్లో మునిగిపోతారు.
2005లో హఠాత్తుగా ముంబై నగరం వరద తాకిడికి గురయినప్పుడు కూడా ఇలాగే జరగడం చూశాను. మహారాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది మరణించగా, భారత ఆర్థిక రాజధాని ముంబై జల ప్రళయం మాత్రం పతాక శీర్షికలకెక్కింది. జన సమ్మర్ధం ఎక్కువగా ఉన్న ముంబై పారిశ్రామిక ప్రాంతాల గుండా ప్రవహించే 19 కిలో మీటర ్ల మితి నది పోవాయ్, విహార్ సరస్సులను నింపి, ఆ పై మాహిం కయ్య వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆ నది పొంగి పొర్లడమే వరదలకు కారణమంటూ అప్పుడు దాన్ని తప్పు పట్టారు. మితి నది అభివృద్ధి సంస్థ మాత్రం ఇలా పేర్కొంది: ‘‘తుపాను నీటిని సముద్రంలోకి పారేలా చేయడానికి ఉపయోగపడే మితి నది ఏళ్లు గడిచే కొద్దీ ఒక మురుగు కాలువగా క్షీణించి పోయింది.’’
అంతకు ముందు 2000లో హైదరాబాద్ విధ్వంసకర వరద బీభత్సానికి గురైంది. తిరిగి 2009లో కుండపోతగా కురిసిన వర్షాలకు హైదరాబాద్‌లో చాలా భాగాలు, కర్నూలు నగరం పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ‘‘ఆగస్టు 2000 హైదరాబాద్ వరదలను ప్రకృతి విలయం ఫలితంగా పరిగణించడానికి వీల్లేదు. వృద్ధి చెందుతున్న పట్టణ ఆవాసాల ప్రణాళికా రచనలోని లోపాలను ఈ వరదలు నగ్నంగా బట్టబయలు చేశాయి. వింతేమిటంటే 2000 వరదల సమయంలో హైదరాబాద్‌లో 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షం కురవగా, నగరాన్ని ఆనుకొని ఉన్న దుర్భిక్ష ప్రాంతాల్లాంటి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో చెదురుమదురుగా మాత్రమే వానలు పడ్డాయి’’ అని భారత భూగర్భ పరిశోధనా సంస్థ పేర్కొంది.
ప్రణాళికాబద్ధంగాని పట్టణీకరణ ఎంత భారీ నష్టాలకు దారితీస్తుందో అవగాహన కలగడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నివేదిక నుండి ఈ ఉల్లేఖనను చూడండి. ‘‘బంజారాహిల్స్ దక్షిణ పర్వత పాదం వద్ద ఉండే మసాబ్ టాంక్‌గా పిలిచే చెరువు ఇప్పుడు కిక్కిరిసిన నివాస, వాణిజ్య ప్రాంతం. పైగా చెరువు పల్లపు భాగమంతటినీ విజయనగర్, శాంతినగర్ వంటి నివాస ప్రాంతాలుగా మార్చేశారు. దీంతో ఈ ప్రాంతంలో పల్లానికి పారుతుండే వర్షపు నీటి పాయలన్నీ అదృశ్యమైపోయాయి. సహజసిద్ధమైన డ్రైనేజీ వ్యవస్థ అంతర్ధానమైన స్థితిలో ఆ ప్రాంతమంతా ముంపునకు గురికావడం సహజం.’’
బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌కతా, గువాహటి... ఎక్కడ చూసినా ఇదే కథ.
మన తప్పును వాతావరణ మార్పులపైకి నెట్టేయడం అత్యంత అనువైనదిగా ఉంటుంది. మనం చేసిన తప్పులను మన తక్షణ నియంత్రణలో లేని కారణాలపైకి తోసేయడం పలాయనవాదం. అది స్వీయ పరాజయానికి హేతువు. వాతావరణం వేడెక్కితే, వానలు ఆలస్యమైతే, వేసవి సుదీర్ఘంగా కొనసాగితే వాతావరణ మార్పులను తప్పుపట్టాలి. వాతావరణ మార్పులు సైతం వాస్తవానికి మన నియంత్రణకు పూర్తిగా బాహ్యమైనవేమీ కాదు. కానీ వాటిని వాస్తవంగా అలా పరిగణించడమే జరుగుతోంది. సమాజంలోని చెడుగులన్నిటికి రాజకీయ నేతలనే తప్పు పట్టడం మనకు అలవాటు. అలాగే అభివృద్ధి ప్రేరితమైన విపత్తులకు కూడా మనం మనల్ని తప్పు పట్టుకోడానికి ఇచ్చగించం.
సులువుగా వేరొకరి పైకి బాధ్యతను తోసిపారేయగలిగినప్పుడు మనల్ని మనం తప్పుపట్టుకోవడం ఎందుకు? వందేళ్ల క్రితం 1908లో హైదరాబాద్ మూసీ నది వరద బీభత్సానికి గురైంది. ఆ విపత్తులో 15,000 మంది మరణించారని అంచనా. అలాగే శ్రీనగర్ కూడా 1893లో అతి పెద్ద వరద ముప్పును ఎదుర్కొంది. కాబట్టి నేటి ఈ విప త్తులకు కారణంగా వాతావరణ మార్పులను తప్పు పట్టజాలమని అంగీకరి స్తారని భావిస్తాను.
2013 జూలై నాటి ఉత్తరాఖండ్ వరద బీభత్సానికి కూడా చాలా మంది వాతావరణ మార్పులనే తప్పు పట్టారు. ఆ విపత్తు తర్వాతైనా దేశం గుణ పాఠా లను నేర్చుకుంటుందని అనుకున్నాను. అలాంటిదేమీ జరగలేదు. సరికదా, ప్రణాళికా రహితమైన పట్టణీకరణ సమస్యను లేవనెత్తిన మరుక్షణమే.. మీరంతా అభివృద్ధి వ్యతిరేకులనే గగ్గోలు లేస్తోంది. ఉత్తరాఖండ్, కాశ్మీర్ లకు హిమాలయ పర్వత సునామీల్లా తాకిన ఈ మహా విలయాలకు చలిం చని వర్గానికి చెందినవారిదే ఈ గగ్గోలంతా. ఎంతకాలం డబ్బు చేసుకోగలి గితే అంతకాలం ప్రకృతి వనరులను పూర్తిగా కొల్లగొట్టాలనే ఆసక్తి మాత్ర మే గల వర్గమిది. వేలాది మంది ప్రాణాల మీదికి వచ్చినా, బతికిబట్టకట్టిన లక్షలాది మంది ఏ దుష్ఫలితాలను అనుభవించినా వారికి పట్టదు.
‘‘ప్రతి ఒక్కరికీ తెలిసినా విశ్వసించడానికి నిరాకరించే ముప్పు’’అనే అత్యంత సముచితమైన శీర్షికతో ‘ది ట్రిబ్యూన్’ పత్రిక సెప్టెంబర్ 14, 2014న ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ‘‘ఒక గిన్నె ఆకారంలో ఉన్న శ్రీనగర్ లోకి జీలం నది కట్టలు తెంచుకుని ఒక్కసారిగా వచ్చి పడితే ఆ వరద వెల్లువ బయటకు పోయే మార్గం లేదనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అంతా దాన్ని విస్మరించడాన్నే ఎంచుకున్నారు’’ అని ఆ వ్యాసకర్తలు తెలిపారు. దానితోపాటే ఆ పత్రిక ప్రచురించిన మరో నివేదికలో శ్రీనగర్ లోని 50 శాతం సరస్సులు, కుంటలు, చిత్తడి నేలలను నివాస, వాణిజ్య సముదాయాలుగా మార్చారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చెప్పారు. బందీపుర జిల్లాలోని వులార్ సరస్సు ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు. అది 87.58 చదరపు కిలోమీటర్ల మేరకు కుంచించుకుపోయింది. సుప్రసిద్ధమైన శ్రీనగర్ దాల్ లేక్ విస్తీర్ణం 24 చ.కి.మీ. నుండి 16 చ.కి.మీలకు క్షీణించిపోయింది. వేగంగా పెరుగుతున్న పూడిక కారణంగా సగటు లోతు 3 మీటర్లకు తగ్గిపోయింది. 165 కిలోమీటర్ల పొడవైన జీలం నది పొంగి పొరలినప్పుడు ఈ దురాక్రమణలకు ప్రతీకారం కాచుకుని వేచి చూస్తోంది.
పర్యావరణపరమైన రెండు మహా బీభత్సాలు వెంట వెంటనే వచ్చి పడటంతో అధికారంలో ఉన్నవాళ్లు మేల్కొంటారని భావించాను. అది తప్పని తేలింది. మీడియా, వ్యాపార పారిశ్రామిక వర్గాలు, మేధావులు, ప్రణాళికా రచయితలు, అహోరాత్రాలు విస్తృతమైన బహిరంగ చర్చలను నిర్వహించి ముందు ముందు ఇలాంటి పర్యావరణపరమైన నష్టాలను ఎలా కనిష్టం చేసుకోవాలని చర్చిస్తారని భావించాను. కానీ అందుకు విరుద్ధంగా పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతులను నిరాకరిస్తున్నందుకు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను మీడియా అదే పనిగా తప్పు పట్టడం మాత్రమే కనిపిస్తోంది. పర్యావరణంతో ముడిపడి ఉన్న సమస్యలపై హెచ్చరికలు చేసే వారు ఎవరైనా గానీ వారిపై దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగించే వారిగా చిత్రించి సాగుతున్న దాడి అలాంటిది. పదే పదే చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టినందుకు కాశ్మీర్ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. అతి పెద్ద ప్రశ్న మన ముందు ఇంకా నిలిచే ఉంది. గత తప్పుల నుండి ప్రభుత్వం నేర్చుకుంటుం దా, తగు దిద్దుబాటు చర్యలను చేపడుతుందా?
(వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) దేవేందర్ శర్మ