![Katra Srinagar Vande Bharat Train Route Fare Ticket Booking Full Details](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/katra-main.jpg.webp?itok=0xb4GTqC)
రాబోయే వేసవి సెలవుల్లో కుటుంబంతోపాలు ఆనందంగా గడపాలని అనుకుంటున్నారా? అయితే అందుకు కశ్మీర్‌కు వెళ్లే వందేభారత్ సిద్ధంగా ఉంది. అందమైన లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సహజసిద్ధ అందాలను ఈ రైలులో నుంచి చూసి ఎంతగానో ఆనందించవచ్చు. అంతేకాదు ఈ ప్రయాణంలోని మధురానుభూతులను మీ వెంట తీసుకెళ్లవచ్చు.
ఇదంతా ఎంతో దూరంలో లేదు. కశ్మీర్‌కు ప్రతిపాదిత వందే భారత్ రైలును ఎప్పుటి నుంచి నడుపుతారనే దానికి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఒక సీనియర్ రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న శ్రీనగర్‌కు వెళ్లే వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. శ్రీనగర్‌కు నడిచే ఈ వందే భారత్ రైలు కాట్రా- శ్రీనగర్ మధ్య నడుస్తుంది. అంటే ఢిల్లీలో లేదా దేశంలోని మరో ఇతర ప్రాంతంలో నివసిస్తున్నవారు ముందుగా కాట్రా చేరుకోవాలి. ఇక్కడి నుండి కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలులో శ్రీనగర్‌కు చేరుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఢిల్లీ నుంచి కట్రాకు గల వందేభారత్ రైలులో కట్రా చేరుకుని, అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్లవచ్చు. కాగా కట్రా- శ్రీనగర్ మధ్య నడిచే కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలు దేశంలోని ఇతర ప్రాంతాలకు నడిచే వందే భారత్ రైళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
కశ్మీర్‌కు నడిచే ప్రత్యేక వందే భారత్ రైలును అక్కడి వాతావరణం, అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ ప్రత్యేక రైలు -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రయాణిస్తుంది. ఈ రైలులోని కోచ్‌లు చైర్ కార్లు, జనరల్ చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్లుగా విభజించారు. కొన్ని నెలల తర్వాత ఈ రైలును జమ్మూ వరకు పొడిగించనున్నారు. అప్పటి నుంచి ఈ రైలు జమ్మూ- శ్రీనగర్ మధ్య నడవనుంది. ఈ రైలు మార్గంలో రియాసి, బక్కల్, దుగ్గ, సవల్కోట్, సంగల్డాన్, సుంబెర్, ఖారి, బనిహాల్, ఖాజిగుండ్, సదురా, అనంతనాగ్, బిజ్బెహారా, పంజ్గామ్, అవంతిపోరా, రత్నిపోరా, కాకాపోరా, పాంపోర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు కాట్రా నుంచి శ్రీనగర్‌కు రెండున్నర నుండి మూడు గంటల్లో చేరుకుంటుంది.
రైల్వే వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ రైలులో ఏసీ చైర్ కార్ ఛార్జీ రూ.1500 నుంచి రూ.1700 మధ్య ఉండే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ రూ. 2400 నుండి రూ. 2600 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 17న రైలు ప్రారంభించిన అనంతరం రైల్వే అధికారులు ఛార్జీలను ప్రకటించనున్నారు. అప్పటి నుంచి సీట్ల బుకింగ్ ప్రారంభం కానుంది.
ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్?
Comments
Please login to add a commentAdd a comment