దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతూ, ప్రయాణికులకు నూతన రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి. తాజాగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రైల్వే లైన్ ద్వారా దేశాన్ని అనుసంధానించడానికి ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్(యూఎస్‌బీఆర్‌ఎల్) పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఢిల్లీ నుండి రైళ్లు కశ్మీర్‌కు బయలుదేరనున్నాయి. ఈ మార్గంలో నడిపేందుకు ముందుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంపిక చేశారు. అయితే కశ్మీర్ లోయలో హిమపాతం, అక్కడి సబ్-జీరో ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ వందేభారత్ రైలులో పలు నూతన ఫీచర్లను జోడించారు.
ఇప్పటివరకు కశ్మీర్ వైపు వెళ్లే రైళ్లు కాట్రా వరకు మాత్రమే నడుస్తున్నాయి. తదుపరి రైల్వే లైన్ వేసే పనిని వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన యూఎస్‌బీఆర్‌ఎల్ ప్రాజెక్ట్(USBRL Project) కింద చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా 17 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది. ఇది త్వరలో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్మూ, కాట్రా గుండా వెళతాయి. సంగల్డాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీనిని రోడ్డు మార్గంతో పోలిస్తే, ఆరు గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం అవుతుంది.
కశ్మీర్ లోయ వరకూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందే భారత్‌ను ఎంపిక చేశారు. ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. రైలు బయట మంచుకురుస్తుంటో లోపలి ప్రయాణికులు వెచ్చదనాన్ని అనుభవించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్‌లో రైళ్లు నడపడానికి మంచు కురువడం, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ప్రధాన సవాలుగా నిలుస్తున్నాయి. విండ్ స్క్రీన్ పై మంచు కురుస్తున్న కారణంగా, లోకో పైలట్ ముందున్న రోడ్డును చూడలేకపోతారు. మైనస్ ఉష్ణోగ్రత(Subzero temperature)లో టాయిలెట్ పైప్‌లైన్‌లు కూడా స్తంభించిపోతాయి. అలాగే విపరీతమైన చలి కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.
కశ్మీర్‌కు నడిపేందుకు రూపొందించిన రైలులో పైలట్ క్యాబిన్ విండ్‌స్క్రీన్ డబుల్ లేయర్ గ్లాస్‌తో తయారు చేశారని, మధ్యలో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఉత్తర రైల్వే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ మీడియాకు తెలిపారు. ఈ సాంకేతికత కారణంగా గ్లాస్‌కు అంటుకున్న మంచు వెంటనే కిందకు జారిపోతుందన్నారు. వైపర్ నుండి వేడి నీరు కూడా బయటకు వస్తుందని, ఇది మిగిలిన మంచు, ఆవిరిని తొలగిస్తుందన్నారు. కొత్త ఫీచర్లతో కూడిన ఈ వందే భారత్‌లో లోకో పైలట్ క్యాబిన్‌లోని సీట్లు కూడా మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. రైలు అంతటా హీటర్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌లో హై లెవల్ థర్మోస్టాట్ లేయరింగ్ ఉంటుంది. తద్వారా సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా లోపలి ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉంటుంది.
వందే భారత్ టాయిలెట్లలో నీటి పైప్‌లైన్‌ను సిలికాన్ హీటింగ్ ప్యాడ్‌లతో ఇన్సులేట్ చేశారు. తద్వారా బయో టాయిలెట్‌లోని ట్యాంక్‌కు హీటింగ్ కూడా అందుతుంది. ఫలితంగా దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు. ఇదేవిధంగా ఈ నూతన వందే భారత్ రైలు కిటికీలకు డబుల్ లేయర్డ్ గ్లాస్ కూడా అమర్చారు. దీంతో ఎవరైనా ఒకవేళ రాయి విసిరినప్పటికీ, పైగాజు మాత్రమే పగిలిపోతుంది. ప్రయాణికులకు ఎటువంటి హాని వాటిల్లదు.
ఇది కూడా చదవండి: సంధ్యావేళ.. మహా కుంభమేళా
Comments
Please login to add a commentAdd a comment