హస్తినకు వరద గండం.. | flood danger to delhi | Sakshi
Sakshi News home page

హస్తినకు వరద గండం..

Published Fri, Apr 4 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

flood danger to delhi

న్యూఢిల్లీ: యమునానదిలో వరద మైదానాలు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఢిల్లీ నగరానికి భారీ వరద గండం పొంచి ఉందని పలువురు పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇటీవల యూఎన్ ప్యానెల్ నివేదికలో సైతం ప్రపంచంలోనే అధిక వరద ముప్పు ఉన్న మూడు నగరాల్లో ఢిల్లీ కూడా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. టోక్యో, షాంఘైలకు కూడా ఇటువంటి ప్రమాదమే పొంచి ఉందని  ఆ నివేదికలో పేర్కొన్నారు.
 
గత సోమవారం విడుదలైన ‘వాతావరణ మార్పుల నివేదిక-2014, ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు’లో పర్యావరణ నిపుణులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరద ముప్పు నుంచి తప్పించుకోవాలంటే డ్యాంలు, కాలువలు ఏర్పాటుచేసే బదులు వరద మైదానాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 2070 కల్లా ఆసియా ఖండంలోని ఢాకా, గౌంగ్‌ఝూ, హో ఛి మిన్‌హ్ సిటీ, షాంఘై, బ్యాంకాక్, రంగూన్, హాయ్‌పాంగ్ నగరాలతో పాటు ముంబై, కోల్‌కతాలకు సైతం తీర ప్రాంత వరద ముంపు ప్రమాదం పొంచి ఉందని అందులో పేర్కొన్నారు.
 
వాతావరణ మార్పుల కారణంగా ఢిల్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని నివేదికలో వెల్లడించారు. యూఎన్ ఐపీసీసీ నివేదికలో ఢిల్లీ పర్యావరణ సమస్యలపై ప్రస్తావించడం ఇదే మొదటిసారి. నగరంలో వరదలు వచ్చే అవకాశంపైనే ప్రధానంగా ఈ నివేదికలో చర్చించారు. నగరంలో యము నా వరద మైదానాల అక్రమ వినియోగం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అందులో పేర్కొన్నారు.
 
ఢిల్లీ నగరంలోకి ప్రవేశించేం దుకు ముందే యమునానది నీటిని వ్యవసాయం, తాగునీటి అవసరాల నిమిత్తం మళ్లిస్తున్నారు. ‘ మా అంచనాల ప్రకారం.. పల్లా నుంచి జైత్‌పూర్ వరకు ఉన్న వరద మైదానాల్లో 30 శాతం ఇప్పటికే వేరే అవసరాలకు కేటాయించేశారు. ఇక్కడ నిర్మించిన అక్షరధామం, బాట్లా హౌస్, మెట్రో స్టేషన్లు, ఇతర శాశ్వత నిర్మాణాలను ఇక్కడి నుంచి తరలించడం సాధ్యం కాదు. ఒక్క టీడీసీ మిల్లేనియం బస్‌డిపో నిర్మాణ ప్రతిపాదనను మాత్రం ఆపేయవచ్చు. వజీరాబాద్ నుంచి ఓఖ్లా వరకు గల పలు వరద మైదానాల్లో చాలావరకు ఇప్పటికే ఆక్రమణకు గురయినట్లు మా సర్వేలో తేలింది..’ అని యమునా జియే అభియాన్‌కు చెంది న మనోజ్ మిశ్రా వివరించారు.
 
ఇదిలా ఉండగా నగరంలో వాతావరణ మార్పులపై కూడా ఐపీసీసీ దృష్టి పెట్టింది. నగరంలో 1970 నుంచి ఇప్పటివరకు పాలెం వాతావరణ కేంద్రంలో ప్రతి యేటా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలపై ఢిల్లీ ఐఐటీ సర్వే చేసింది. సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చి చూసింది. ‘1968లో సఫ్దర్ జంగ్‌తో పోలిస్తే పాలెం ఎడారిలా ఉండేది. ఈ రెండింటి మధ్య ప్రతి ఏడాది వాతావరణంలో వస్తున్న మార్పులను గమనించి నగరీకరణ వల్ల ఉష్ణోగ్రతల్లో ఎలా మార్పులు సంభవిస్తాయో క్రోడీకరించాం. 1980 వరకు ఈ రెండు ప్రాంతాల సరాసరి కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు లేవు.
 
అయితే 2000 సంవత్సరం వచ్చేసరికి పాలెంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం మొదలయ్యాయి. నగరీకరణ వల్లే ఈ మార్పు సంభవించిందని మా అధ్యయనంలో తేలింది..’ అని ఐపీసీసీ రిపోర్ట్ తయారుచేసిన వారిలో ఒకరైన ఐఐటీ ప్రొఫెసర్ మంజు మోహన్ వివరించారు. ఆమె అధ్యయనం ప్రకారం పాలెంలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో అప్పటికంటే ఇప్పుడు ఒక డిగ్రీ ఎక్కువగా నమోదవుతోంది. కాగా, ఈ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల నగరాల్లో వేడిమి సంబంధిత సమస్యలు పెరుగుతాయని సదరు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement