యమునా నది ఢిల్లీ పరిధిలో 48 కి.మీ. మేరకు ప్రవహిస్తుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించింది. జూలై 10న సంభవించిన వరదల కారణంగా రాజధాని నగరానికి రూ.10 వేల కోట్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా.
ఢిల్లీలో చిత్తడి నేలలు, బావులు, సరస్సులు వంటి జల వనరులు 1,040కి పైగా ఉన్నాయి. వీటికి అధికారిక గుర్తింపు లేదు. ప్రభుత్వం నోటిఫై చేయకపోవడంతో అవి సులభంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫలితంగా ఢిల్లీని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. నిజానికి దేశంలోని అన్ని చిన్నా పెద్దా నగరాలదీ ఇదే సమస్య...
♦ ఢిల్లీలో మురుగునీటి పారుదల వ్యవస్థ 1970ల నాటిది. నాటితో పోలిస్తే నగర జనాభా కనీవినీ ఎరగనంతగా పెరిగిపోయింది.
♦ దాంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. ఇక అడ్డగోలు నిర్మాణాలతో డ్రైనేజీ వ్యవస్థ కుదించుకుపోయి సమస్య మరీ పెద్దదవుతోంది.
♦ ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతం దాదాపుగా 97 చదరపు కిలోమీటర్లుంటుంది. నగర భూభాగంలో ఇది 7%. ఇందులో అత్యధిక భూభాగాన్ని ఆక్రమణలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు కట్టడానికి కేటాయించడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
♦ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదిక ప్రకారం ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతాలు 600కు పైగా ఉన్నాయి. వీటిలో 60% వరకు నీరు లేక ఎండిపోయాయి. ఒక్క రోజులోనే అతి భారీ వర్షం కురవడంతో అవన్నీ ఇప్పుడు నీట మునిగాయి.
♦ పైగా వీటిలో చాలా ప్రాంతాలు ఆక్రమణలకు లోనయ్యాయి. వాటిని వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకొని లక్షలాది మంది బతుకుతున్నారు. మరెన్నో భూముల్ని అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించారు. 2010లో కామన్‌వెల్త్ క్రీడల కోసం నిర్మించిన గ్రామం, అక్షరధామ్ ఆలయం వంటివెన్నో వరద ప్రాంతాల్లోని ఆక్రమిత భూములపై నిర్మించినవే.
♦ చిత్తడి నేలలు సహజసిద్ధంగా నీటిని పీల్చుకొని భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. కానీ ఢిల్లీలోని చిత్తడి నేలల్లో 200కు పైగా ఎండిపోయి ఆక్రమణలకు గురయ్యాయి.
హతినికుండ్ వివాదం
హరియాణాలో 1996లో కట్టిన ఈ ఆనకట్ట ద్వారా నీళ్లు యమున నది తూర్పు, పశ్చిమ కాలువల్లోకి ప్రవహిస్తాయి. హరియాణా ప్రభుత్వం ఈ బ్యారేజ్ గేట్లు ఎత్తేయడంతో నేరుగా యమున నదిలోకి వరద నీరు చేరి ప్రమాదకరంగా మారుతోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే తాము నిబంధనలకనుగుణంగానే వ్యవహరిస్తూ లక్ష క్యూసెక్కులు దాటితేనే నీటిని వదులుతున్నామని హరియాణా ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ నెల 10వ తేదీన హతినికుండ్ ప్రాజెక్టు నుంచి ఏకంగా 3.59 లక్షల క్యూసెక్కుల నీరు యమునలోకి వచ్చింది. అందుకే ఢిల్లీ నీట మునిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే 2010 వర్షాకాలంలో 7 లక్షల క్యూసెక్కుల నీరు హతినికుండ్ నుంచి విడదల చేసినప్పటికీ అప్పట్లో నగరానికి పెద్దగా ముప్పు రాలేదు. ఇప్పుడు మూడు లక్షల క్యూసెక్కులకే ముప్పు రావడానికి ఆక్రమణలు, అడ్డగోలు నిర్మాణాలే కారణమని సౌత్ ఆసియా నెట్‌వర్క్ ఆన్ డామ్స్, రివర్స్, పీపుల్ కోఆర్డినేటర్ హిమాంశు ఠక్కర్ అభిప్రాయపడ్డారు.
చిత్తడి నేలల పునరుద్ధరణ..
వరద ప్రభావాన్ని తగ్గించాలంటే ఆక్రమణలను తొలగించి నదీ తీర ప్రాంతాలను పునరుద్ధరించాల్సిన అవసరం చాలా ఉంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుందుకు ప్రభుత్వం కృషి చేయాలి. యమునా నది పొంగి పొర్లకుండా ఢిల్లీకి రక్షణ కవచంలా ఉండే చిత్తడి నేలలు, సరస్సులు, చెరువుల వంటివి తగ్గిపోతున్నాయి. అవి లేకుండా యమున ప్రవాహం సవ్యంగా సాగదన్న అభిప్రాయాలున్నాయి.
ఈ సరస్సులు, చెరువులు, బావుల వంటివి నీటిని స్టోరేజ్ చేయడం వల్ల డ్రైనేజీలోకి వెళ్లే నీటి ప్రవాహం తగ్గుతుంది. ‘‘నదుల వరదను శాపంగా చూడకూడదు. పరివాహక ప్రాంతంలో గడ్డివాములు, చెట్లు పెంచడం వంటివి చేస్తే వరద ముప్పు నుంచి తప్పించుకోవచ్చు’’ అని సీనియర్ సైంటిస్ట్ ఫయాద్ ఖుద్‌సర్ చెప్పారు.
ఢిల్లీ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటోంది. నిర్మాణాలు పెరిగి కాంక్రీట్ జంగిల్‌గా మారింది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సన్నద్ధత లేదు. అందుకే నగరం ఇలా వరద ముప్పుకు లోనవుతోంది. – రితేశ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్, సౌత్ ఏషియా
– సాక్షి , నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment