న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన యమునా నది శుక్రవారం కొంత శాంతించింది. నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినప్పటికీ పలు కీలక ప్రాంతాలు ఇంకా వరద ముట్టడిలోనే ఉన్నాయి. నది నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్ దాకా వరద నీరు చేరింది. యమునా నదిలో నీటమట్టం గురువారం 208.66 మీటర్లకు చేరుకోగా, శుక్రవారం సాయంత్రం 6 గంటలకల్లా 208.17 మీటర్లకు తగ్గిపోయింది. వరద ప్రవాహం ధాటికి దెబ్బతిన్న ఇంద్రప్రస్థ వాటర్ రెగ్యులేటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిశీలించారు.
త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ఈ రెగ్యులేటర్ దెబ్బతినడం వల్లే నదిలోని వరద ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. ఇసుక బస్తాలు, కంకరతో వరద ప్రవాహాన్ని ఆపేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, సైనిక జవాన్లు, ఢిల్లీ అధికారులు శ్రమిస్తున్నారు. నగరంలోని రోడ్లపై వరద నీరు ఇంకా తగ్గలేదు. రహదారులు చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లలను ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. వాహనాలను అనుమతించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం కొనసాగుతున్నాయి. వరదలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్మశానాలు సైతం జలమయం కావడంతో అంత్యక్రియలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా పలు శ్మశాన వాటికలను మూసివేసినట్లు నగర మేయర్ షెల్లీ ఒబెరాయ్ చెప్పారు.
వరదలపై ఆరా తీసిన ప్రధాని మోదీ
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కేంద్ర మోంశాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. ఢిల్లీలో వరద పరిస్థితిపై ఆరా తీశారు. మరో 24 గంటల్లో యమునా నదిలో ప్రవాహం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, అతి త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మోదీకి అమిత్ షా
వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment