పరవళ్లతో పునరుజ్జీవం | Environmentalists On Vedavati River | Sakshi
Sakshi News home page

పరవళ్లతో పునరుజ్జీవం

Published Mon, Feb 6 2023 4:45 AM | Last Updated on Mon, Feb 6 2023 6:56 PM

Environmentalists On Vedavati River - Sakshi

కర్ణాటకలోని వాణి విలాస సాగర్‌ డ్యాం

సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా ఇసుక మేటలతో ఎడారిని తలపించిన వేదవతి నది ప్రస్తుతం జలకళ సం­తరించుకుంది. గతేడాది ఆగస్టు 3 నుంచి ఈ ఏ­డాది జనవరి 9 వరకూ అంటే.. 159 రోజుల­పాటు కర్ణాటకలోని వాణివిలాస రిజర్వాయర్‌.. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)ల గేట్లను ఎత్తేశారంటే.. వేదవతి ప్రవాహ ఉధృతి ఏ స్థాయిలో సాగిందో అంచనా వేసుకో­వ­చ్చు.

వాణివిలాస రిజర్వాయర్‌ పూర్తి నీటి సామ­ర్థ్యం 30.422 టీఎంసీలైతే.. ఆ రిజర్వాయర్‌లోకి 78.32 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఆయకట్టుకు నీళ్లందిస్తూ.. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు 32.179 టీఎంసీలు విడుదల చేశారు.

వాణివిలాస రిజర్వాయర్‌కు 109 కి.మీల దిగువన.. కర్ణాటక సరిహద్దుకు 1.5 కి.మీల దూరంలో అనంతపురం జిల్లాలో గుమ్మ­ఘట్ట మండలంలో రెండు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)లోకి 2022 ఆగస్టు 3 నుంచి జనవరి 9 వరకూ 65.63 టీఎంసీల ప్రవాహం వస్తే.. ఆయకట్టుకు నీళ్లందిస్తూ, ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేస్తూ 62 టీఎంసీలను దిగువకు వదిలేశారు. ఆ జలాలు తుంగభద్ర మీదుగా శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరాయి. అంటే.. బీటీపీ సామర్థ్యం కంటే 63 టీఎంసీలు ఎక్కువ వచ్చినట్లు స్పష్టమవుతోంది. 

89 ఏళ్ల తర్వాత నిండిన ‘వాణివిలాస’ 
► ఇక వేదవతిపై కర్ణాటకలో 1907లో నిర్మించిన వాణివిలాస రిజర్వాయర్‌ 1933, సెప్టెంబరు 2న నిండింది. ఆ తర్వాత గతేడాది ఆగస్టు 3న అంటే 89 ఏళ్ల తర్వాత         నిండింది. దాంతో 50 వేల ఎకరాలకు ఖరీఫ్‌లో నీళ్లందించారు.

► ఇక అనంతపురం జిల్లాలో బీటీపీ ప్రాజెక్టు దశాబ్దం తర్వాత నిండింది. గతేడాది ఆగస్టు 8న 55,574 క్యూసెక్కుల ప్రవాహం డ్యామ్‌లోకి వచ్చింది. డ్యామ్‌ చరిత్రలో అంటే 1961 నుంచి ఇప్పటివరకూ గరిష్ట వరద  ఇదే.

► వర్షాకాలం ముగియడంతో వరద ప్రవాహం నవంబర్‌లోనే తగ్గింది. ఆ తర్వాత నదిలో సహజసిద్ధ ప్రవాహం ప్రారంభమై.. ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్నిబట్టి చూస్తే.. వేదవతి పునరుజ్జీవం పోసుకున్నట్లేనని పర్యావరణ­వేత్తలు విశ్లేషిస్తున్నారు. 

సబ్‌సర్ఫేస్‌ డ్యామ్‌లు, ఇసుక తవ్వకాల నియంత్రణతో..
► కృష్ణా నదికి కోయినా, మలప్రభ, ఘటప్రభ, బీమా, తుంగభద్ర, మూసీ, పాలేరు, మున్నేరులతోపాటు వేదవతి కూడా ప్రధాన ఉప నది. కర్ణాటకలో చిక్‌మగళూరు జిల్లాలోని పశ్చిమ కనుమల్లో చంద్రవంక పర్వత శ్రేణుల్లో వేద, అవతి నదులు పురుడుపోసుకుని.. పుర వద్ద రెండు నదులు కలిసి వేదవతిగా మారి కర్ణాటకలో తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి.. రాష్ట్రంలో అనంతపురం, కర్నూల్‌ జిల్లాల మీదుగా 391 కి.మీలు ప్రవహించి.. బళ్లారి జిల్లా సిరిగుప్ప వద్ద తుంగభద్రలో కలుస్తుంది. 

► కృష్ణా నదీ పరివాహక ప్రాంతం (బేసిన్‌) మహా­రాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 2,58,948 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించగా.. అందులో వేదవతి బేసిన్‌ విస్తీర్ణం 23,590 చ.కి.మీలు (9.1 శాతం). 

► వేదవతి జన్మించే చంద్రవంక పర్వతాల్లోనూ.. ప్రవహించే హగరి లోయలోనూ వర్షాభావ పరిస్థితులవల్ల ప్రవాహం లేక ఇసుక మేటలతో జీవం కోల్పోయింది. దాంతో ఎగువ నుంచి వేదవతి ద్వారా కృష్ణా నదిలోకి పెద్దగా వరద ప్రవాహం చేరడంలేదు. 

► గత నాలుగేళ్లుగా వేదవతి బేసిన్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. నదికి జీవం పోయాలనే లక్ష్యంతో వేదవతిపై అటు కర్ణాటక.. ఇటు రాష్ట్రంలో సబ్‌ సర్ఫేస్‌ డ్యామ్‌లు నిర్మించారు. ఇసుక తవ్వకాలను నియంత్రించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం నదిలోకి వచ్చే వరదను నదీ గర్భంలోకి ఇంకింపచేయడంలో సబ్‌ సర్ఫేస్‌ డ్యామ్‌లు దోహదం చేశాయి. ఇసుక తవ్వకాలను నియంత్రించడంవల్ల నీటి ప్రవాహంతో వేదవతి జీవం పోసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement