తుమకూరులో ములాయంకు రాహుల్ నివాళి
తుమకూరు: పెద్దలకు పలకరింపులు, అక్కడక్కడా హారతులు, పిల్లలతో ముచ్చట్లతో కర్ణాటకలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. వర్షంలోనూ ఆయన యాత్ర కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు తుమకూరు జిల్లా బరకనహాల్ గేట్ వద్ద నుంచి రాహుల్ నడక ఆరంభమైంది. ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంట వచ్చారు. హులియురు వద్ద గిరిజన మహిళలు ఆయనకు హారతి ఇచ్చారు.
అనంతరం వారు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు కెంకెరె వద్ద రాహుల్ టిఫిన్ చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు పొరుగున ఉన్న చిత్రదుర్గం జిల్లాలోకి అడుగుపెట్టారు. హిరియూరు వైపు యాత్ర సాగింది. హిరియూరు వద్ద జడివాన కురుస్తున్నప్పటికీ నడకను ఆపలేదు. కార్యకర్తలను ఉత్సాహపరచడానికి పలుచోట్ల నేతలతో కలిసి పరుగులు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment