ముంబై: స్వయం శక్తితో ఎదిగిన ఎంట్రప్రెన్యూర్ల (సెల్ఫ్–మేడ్) కంపెనీలు అత్యధికంగా బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఏకంగా 129 అత్యంత విలువైన దిగ్గజాలకు దేశీ సిలికాన్ వేలీ .. హబ్‌గా నిలుస్తోంది. ఈ విషయంలో ముంబై (78), గురుగ్రామ్ .. న్యూఢిల్లీ (49) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 200 సంస్థలతో హురున్ ఇండియా రపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వ్యాపార దిగ్గజం రాధాకిషన్ దవనీ ముంబైలో నెలకొల్పిన అవెన్యూ సూపర్‌మార్కెట్స్ (డీమార్ట్ మాతృ సంస్థ) రూ. 2.38 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్‌తో అగ్రస్థానంలో ఉంది.
బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్.. బెంగళరులో నెలకొల్పిన ఫ్లిప్‌కార్ట్ రూ. 1.19 లక్షల కోట్ల విలువతో రెండో స్థానంలో ఉండగా, గురుగ్రామ్ కేంద్రంగా పని చేస్తున్న జొమాటో (వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్) రూ. 86,835 కోట్ల మార్కెట్ క్యాప్‌తో మూడో స్థానంలో నిల్చింది. లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలకూ ఈ జాబితాలో చోటు కల్పించామని, వాటి వేల్యుయేషన్లను ఇన్వెస్టర్లు తగ్గించిన పక్షంలో ఆ వివరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు.
మరిన్ని విశేషాలు..
- లిస్టులో చోటు దక్కించుకున్న 200 కంపెనీలకు 405 మంది వ్యవస్థాపకులు ఉన్నారు. ఇవన్నీ 2000 సంవత్సరం తర్వాత ప్రారంభించినవే. వీటి మొత్తం విలువ రూ. 30 లక్షల కోట్లు.
- అత్యధిక సంఖ్యలో సంస్థలు (45) ఆర్థిక సేవల రంగంలో ఉన్నాయి. 30 కంపెనీలతో రిటైల్ రంగం, 26 సంస్థలతో హెల్త్‌కేర్ రంగం తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
- సొంత నిధులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నిధులతో (బూట్‌స్ట్రాప్) ఏర్పాటు చేసిన సంస్థలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఆ కోవకి చెందిన డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ జిరోధా 10వ స్థానంలో నిల్చింది.
- జాబితాలో ఇరవై మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లు ఉన్నారు. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నయ్యర్ అగ్రస్థానంలో నిల్చారు.
- వయస్సురీత్యా చూస్తే హ్యాపీయెస్ట్ మైండ్స్ వ్యవస్థాపకుడైన 80 ఏళ్ల అశోక్ సూతా అత్యంత సీనియర్‌గా ఉండగా, జెప్టోకి చెందిన 21 సంవత్సరాల కైవల్య వోహ్రా అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment