ప్రాణాలతో చెలగాటం.. | Adulteration of eating foods | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో చెలగాటం..

Published Mon, Mar 12 2018 8:38 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Adulteration of eating foods - Sakshi

శాంతినగర్‌లో కల్తీ పదార్థాలతో మిఠాయిల తయారీ కేంద్రం

ఆదిలాబాద్‌: కల్తీకి కాదేదు అనర్హం అన్న చందంగా తాగునీటితో పాటు తినుబండారాలు, పప్పులు, ఉప్పు, నూనె, బియ్యం, కారంపొడి, పుసుపు, పిండి, పాల పదార్థాల్లో ఎత్తున కల్తీ పెద్ద జరుగుతోంది.  మార్కెట్‌లో సురక్షితం కానివి, ఆరోగ్యానికి హానికరమైనవి, నాణ్యత లోపించినవి, ప్యాకింగ్‌పై ఒక రకమైన పదార్థామని చెబుతూ లోన మరో రకం పదార్థాలను కలిపి విక్రయాలు జరుపుతున్నారు. వంట నూనెలను లూజ్‌గా విక్రయించరాదనే నిబంధనలు ఉన్నా జిల్లాలో విచ్చలవిడిగా వీటి విక్రయాలు కొనసాగుతున్నాయి.

హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్‌ సెంటర్లు, మిఠాయి, ఐస్‌క్రీం దుకాణాలు, బేకరీల్లో కుళ్లిన పదార్థాలు వాడడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆహారభద్రత, ప్రమాణాల యాక్టు–2006 ప్రకారం ఆహార కల్తీకి పాల్పడితే చట్టరీత్యా శిక్షార్హులవుతారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో దాడులు చేస్తేనే కల్తీ వ్యాపారాన్ని అడ్డుకోగలుగుతారు.  

వార సంతల్లోనూ.. 
జిల్లాలో ఆయా ప్రాంతాల్లో జరిగే వారసంతల్లోనూ నాసిరకం వస్తువులు, కల్తీ ఆహార పదార్థాలను ప్రజలకు కట్టబెడుతున్నారు. జనం అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. కొన్ని సంస్థలకు చెందిన వస్తువుల మాదిరిగా పోలీ ఉండేలా తయారు చేసి విక్రయిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వారసంతలు జరుగుతుంటాయి. ప్రతి వారం వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు ఇక్కడికి వచ్చి వస్తువులు కొనుగోళ్లు చేస్తుంటారు.

ముఖ్యంగా జిల్లాలో ఇచ్చోడ, నార్నూర్, సిరికొండ, సిరిచల్మ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, తదితర ప్రాంతాల్లో జరిగే వారసంతల్లో కల్తీ సరుకులు జోరుగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా చిరుదాన్యాలు, కారంపొడి, పౌడర్లు, సబ్బులు, కాస్మోటిక్‌ వస్తువులు, పప్పుదినుసుల్లో నాసిరకమైన వాటిని విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తుండడంతో ప్రజలు వీటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు.   


రసాయన పదార్థాలతో తయారు చేసిన పెప్సీకోల


కల్తీ నూనె, రసాయన పదార్థాలతో సిద్ధం చేసిన పాస్ట్‌ఫుడ్‌ ​​​​​​​

- ఖానాపూర్, బొక్కల్‌గూడ, శాంతినగర్‌ కాలనీలలో అనుమతి లేకుండా ఎన్నో ఆహార పదార్థాల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ప్రమాదకరమైన రసాయనాలతో శీతలపానియాలు, మిఠాయిలు, బ్రెడ్‌ప్యాకెట్లు వంటివి తయారు చేసి పట్టణంతో పాటు గ్రామాల్లో విక్రయాలు చేస్తున్నారు. శనివారం సీసీఎస్‌ సీఐ సురేశ్‌ ఆధ్వర్యంలో దాడులు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.10 లక్షల విలువ చేసే కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మహాలక్ష్మీవాడ, న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీలో మిక్సర్‌ తయారీ కేంద్రాలున్నాయి. ఇందులో కూడా కల్తీ సాగుతున్నట్లు సమాచారం.   
- జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌లో ఉన్న ఓ ఫేమస్‌ బిర్యానీ హౌస్, కలెక్టర్‌చౌక్‌లోని రెస్టారెంట్‌లో గతంలో మున్సిపల్‌ అధికారులు దాడులు చేసి కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు బిర్యానీ హౌస్‌లలో పెద్ద ఎత్తున ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.  రోజుల తరబడి చికెన్‌ను ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు దాన్ని వండుతున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. అధికారులు నామమాత్రంగా దాడులు చేయడంతో అప్పుడప్పుడే ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. 
- జిల్లాలో విచ్చలవిడిగా ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్లు వెలిశాయి. ఇందులో వేసవిలో రూ.కోట్ల వ్యాపారం సాగుతోంది. ఏ ఒక్క ప్లాంట్‌లో కూడా సరైన ప్రమాణాలు పాటించడం లేదు. కొంత మంది ఇళ్లలో ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని రూ.15 నుంచి రూ.20 చొప్పున వాటర్‌ క్యాన్‌లను విక్రయిస్తున్నారు. 
 - జిల్లా కేంద్రంలోని డైట్‌మైదానం ఎదుట పాస్ట్‌ఫుడ్‌ దుకాణాలు వెలిశాయి. ఇందులో కల్తీ నూనె, రసాయాన పదార్థాలు వాడుతున్నారు. నోటికి రుచికరంగా ఉంటుందని వీటిని తినేందుకు మొగ్గుచూపిన చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇటీవల సీఏం కేసీఆర్‌ రాక సందర్భంగా అధికారులు వీటిని తొలగించగా.. ఆ మరుసటి రోజే దుకాణాలు మళ్లీ వెలిశాయి.  

దాడులు కొనసాగుతాయి.. 
ఆదిలాబాద్‌లో అనుమతి లేకుండా ఆహార పదార్థాలు, వస్తువులు తయారు చేసినా, కల్తీ ఆహార పదార్థాలు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నాం. కొన్ని చోట్ల రసాయనాలు వాడి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలియడంతో వాటిపై కూడా నిఘా పెంచాం. ఎవరైనా నకిలీ వస్తువులు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. 
 నర్సింహారెడ్డి, ఆదిలాబాద్‌ డీఎస్పీ  

కల్తీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు.. 
పట్టణంలో కల్తీవ్యాపారం చేసినట్లు సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ సెంటర్లలో నాణ్యమైన పదార్థాలే వాడాలి. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు తెలిస్తే మాకు సమాచారం అందించాలి. కల్తీ వ్యాపారాలపై దాడులు చేస్తాం. ఒకవేళ కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తాం
నవీన్, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement