ఇవేం లెక్కలు..? | Telangana farmer suicides: 536 and counting | Sakshi
Sakshi News home page

ఇవేం లెక్కలు..?

Published Mon, Feb 9 2015 4:28 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఇవేం లెక్కలు..? - Sakshi

ఇవేం లెక్కలు..?

అన్నదాతల కష్టాలు పాలకులకు పట్టడం లేదు. కాలం కలిసి రాక.. అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడంలో అటు అధికారులు, ఇటు పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్యను తక్కువ చేసి చూపించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రెండేళ్లలో సుమారు 70 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే.. అధికారుల జాబితాలో మాత్రం 14 మంది రైతులు మాత్రమే చనిపోయినట్లు చూపించడం గమనార్హం.

అందులోనూ కేవలం రెండు కుటుంబాలకే పరిహారం అందింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.- సాక్షి ప్రతినిధి, ఖమ్మం

 
ప్రభుత్వానికి పట్టని అన్నదాతల చావుకేకలు
రెండేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులు 14మందేనట !
రికార్డులకెక్కని బలవన్మరణాలు
వీధినపడిన కుటుంబాలు... దిక్కుతోచని పిల్లలు

 
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ప్రకృతి ప్రకోపించి.. కాలం కలిసిరాక.. చేసిన అప్పు తీర్చలేక.. కొత్తగా అప్పు పుట్టక.. పొట్టకొచ్చిన పంటచేనుపై స్వారీ చేస్తున్న పురుగులపై మందు చల్లడానికి సైతం చేతిలో చిల్లిగవ్వ లేక.. కళ తప్పిన చేలను చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వ గుర్తింపు కరువైంది. బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన అధికారులు ప్రామాణికాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో జిల్లాలో బలవన్మరణానికి పాల్పడిన వారి కుటుంబసభ్యులకు తీరని అన్యాయం జరుగుతోంది. వ్యవసాయ రంగం లో నెలకొన్న ఆటుపోట్ల ను అధిగమించలేక రెండేళ్లుగా పెద్దసంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, ప్రభుత్వం మాత్రం ఈ జాబితాను పదుల సంఖ్యకే పరిమితం చేసింది.

ఇంటిపెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్నవారికి ప్రభుత్వ ఆసరా కలగానే మిగులుతోంది. భూమినే నమ్ముకొని, ఆరుగాలం శ్రమించి, వరుణదేవుడు కరుణించక, విద్యుత్ సక్రమంగా అందక, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలపై కనికరం లేని అధికారులు.. రెండేళ్లలో 14మంది రైతులు మాత్రమే బలవన్మరణాలకు పాల్పడ్డారని నివేదికల్లో పేర్కొంటున్నా రు. వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో 2013-14 ఏడాదిలో దాదాపు 40 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోగా.. వీటిలో 35వరకు పోలీసు రికార్డుల్లో సైతం నమోదయ్యాయి.

ప్రాథమిక సమాచారం సేకరించిన సమయంలో అప్పుల బాధ తాళలేక, వ్యవసాయంలో నష్టం వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారంటూ చెప్పిన మండల, జిల్లా అధికారు లు, తీరా ఉన్నతాధికారులకు పంపించే నివేదికల్లో మాత్రం అనేక ప్రామాణికాలను బూచిగా చూపి జాబితాలో పేర్లు తగ్గించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి ఎంతోకొంత సహాయం అందుతుం దని ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాల్లో నిరాశ, నిసృ్పహ అలుముకుంది. జిల్లాలోని వివిధ రైతు సంఘాలు సైతం గత ఏడాది జూన్ నుంచి ఈ సంవత్సవరం జనవరి వరకు 29మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం సేకరించాయి.

ఇదే తరహా లో గత ఏడాది సైతం పలు రైతు సంఘాలు ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చినా వాటిలో పలువురి పేర్లు ప్రభుత్వ జాబితాలో కనిపించనే లేదు.. అధికారుల లెక్కల ప్రకారం 2013-14లో 14 మంది మాత్రమే అత్మహత్యకు పాల్పడినట్లు నివేదిక ఇచ్చినా అందులో రెండు కుటుంబాలకు మా త్రమే ప్రభుత్వ సాయం అందింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో మరణించిన బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన వెంకన్న కుటుంబానికి రూ.1.50 లక్షలు, పాల్వంచ మండలం గుడిపాడుకు చెందిన సోడె రాములు కుటుంబానికి రూ.1.50 లక్షలు మం జూరయ్యాయి, మిగిలిన 12కుటుంబాలకు సంబంధిం చి డివిజన్‌స్థాయి అధికారుల నివేదిక రాలేదనే సాకుతో ఆర్ధికసాయం అందలేదు. ఈఏడాది జనవరిలో ముగ్గు రు మరణించినట్లు అధికారులు చెబుతుండగా,  రైతుసంఘాల ప్రతినిధుల సమాచారం ప్రకారం 8 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడవుతోంది.
 
కాలం కలిసిరాక..
పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, తుపాన్లు, వరదలకు తోడు వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా కావడం లేదు. దీంతో పంటలు చేతికందక నష్టాల పాలై దారీతెన్నూ కనిపించని రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా భూమినే నమ్ముకుని పంటలు సాగుచేసే రైతు బ్యాంకు రుణం సరిపోక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇలా అనేక కారణాలు రైతును చావుకేక పెట్టిస్తున్నాయి.
 
జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ, మండల గణాంకశాఖ అధికారుల నివేదికల ఆధారంగా కరువు మండలాలుగా గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేసినట్లు వవ్యసాయాధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నారు. దీనిలో పత్తి 4.30 లక్షల ఎకరాలు, వరి 3 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 35 వేల ఎకరాలు, ఇతర పంటలు 3 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు వివరించారు. అయితే వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో పత్తి, వరి , మొక్కజొన్న పంటలకు నష్టం ఎక్కువగా వాటిల్లినట్లు అధికారుల లెక్కలు చెపుతున్నాయి. రబీలోనూ పంటల దిగుబడిపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.  
 
దయనీయంగా మారిన కౌలు రైతు...
జిల్లాలో సుమారు 50 వేలకు పైగా కౌలు రైతులు ఉన్నారు. పత్తి, మిర్చి తదితర వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. అయితే గత మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు వీరిని అతలాకుతలం చేశాయి. దీంతో పంట సాగుకు తెచ్చిన అప్పులు  భారమయ్యాయి. ఉన్న అప్పులకు తోడు కౌలు చెల్లించలేకపోవడంతో భూయజమానులు నిలదీశారు. ఇక పెరిగిన ఎరువులు, పురుగు మందుల ధరలు వారిని మరింత కుంగదీశాయి. ఈ నేపథ్యంలో అటు అప్పుల బాధ.. ఇటు కుటుంబ బాధ్యతలు భారమై చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం కౌలుదారు సంఘాలను ఏర్పాటు చేశామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ వీరికి పంటసాగుకు అవసరమయ్యే రుణం అందించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారు. రుణం అడిగిన కౌలు రైతులను నిబంధనల పేరిట బ్యాంకర్లు ముప్పుతిప్పలు పెట్టి చివరికి మొండిచేయి చూపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు, దానికి గల కారణాలను అధికారులు ప్రభుత్వానికి పంపించే నివేదిక సక్రమంగా లేకపోవడం వల్లే ఆయా కుటుంబాలకు రూ.1.50 లక్షల సహాయం అందడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
 
50 వేలతో అప్పులు తీర్చాలి...
ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే రూ.1.50 లక్షలలో రూ.50వేలు అప్పు తీర్చెందుకు, మిగితా రూ.లక్ష మళ్లీ వ్యవసాయం చేసేందుకు ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఆ సహాయం అందకపోవడంతో వడ్డీ వ్యాపారులు రైతు కుటుంబ సభ్యులను నానా ఇబ్బందుల పాలుచేస్తున్నారని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఇకనైనా ప్రభుత్వం తమకు సాయం అందించకపోతుందానని బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement