నెట్‌వర్క్: అప్పుల బాధతో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలంలోని రాజంపేట గ్రామానికి చెందిన అంద్యాల లింగం (48) తనకు ఉన్న 1.36 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈసారి వానలు సరిగ్గా కురియకపోవడంతో పంట దెబ్బతింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లింగం బుధవారం ఉదయం విషపు గుళికలను మింగి ప్రాణాలు కోల్పోయాడు.
వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం పెగడపల్లికి చెందిన రైతు మ్యాకల తిరుపతి(28) గతేడాది పత్తి పంట వేసి తీవ్రంగా నష్టపోయూడు. ఈ ఏడాది రెండెకరాల్లో మొక్కజొన్న వేయగా, ఆశించిన దిగుబడి రాలేదు. సుమారు రూ. 2 లక్షల వరకు అప్పు కావడంతో ఎలా తీర్చాలనే మనోవేదనకు గురై పొలం వద్ద పురుగులు మందు తాగి బలవన్మరణం చెందాడు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బద్యాతండాకు చెందిన ఎన్.చందూ(35) కౌలుకు తీసుకున్న రెండున్నర ఎకరాలలో పత్తి, మిర్చి సాగుచేశాడు. వర్షాభావం కారణంగా దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయూడు. పంట పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కానరాక తీవ్ర మనోవేదనతో అస్వస్థుడైన అతను మంగళవారం ఆస్పత్రిలో మృతిచెందాడు.
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన మురళీధరయ్య(52) ఎకరా తరి పొలంలో వరిపంట సాగుచేశాడు. అలాగే ఈ ఏడాది కూతురు పెళ్లి కోసం రూ.లక్ష అప్పు చేశాడు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో పొలంలోనే పురుగుమందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు.
ఇదే జిల్లా తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి వెంకటయ్య(30) నాలుగెకరాల పొలంలో పత్తి పంట సాగుచేశాడు. దీనికి తోడు ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇందుకోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.3 లక్షలు అప్పుచేశాడు. ఆశించిన దిగుబడి రాకపోవడం.. అప్పులుతీర్చే మార్గం లేక తీవ్రంగా కలత చెందాడు. ఈ క్రమంలో బుధవారం పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మెదక్ జిల్లా ములుగు మండలం కొక్కొండకు చెందిన చిన్న మల్లయ్య తనకున్న ఎకరంన్నర పొలంలో వరి సాగు చేశాడు. నీరందక పంట మొత్తం ఎండిపోయింది. దీనికి తోడు ఇద్దరు కుమార్తెలు, కుమారుని పెళ్లిళ్లు చేయడంతో రూ.2లక్షల వరకు అప్పులయ్యాయి. అవి తీర్చలేని క్రమంలో మల్లయ్య మంగళవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కేపల్లికి చెందిన కావలి కిష్టయ్య(55) ఈ ఏడాది పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. వర్షాలు సరిగా కురవకపోవడం తో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. పెట్టుబడులు, కూతురి వివాహం కోసం కిష్టయ్య సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ విషయమై ఈ నెల 9న కుటుంబీకులతో ఘర్షణ పడిన కిష్టయ్య సమీపంలోని బావిలో పడి బలవన్మరణం చెందాడు.
అప్పుల బాధతో ఏడుగురు రైతుల ఆత్మహత్య
Published Thu, Nov 20 2014 1:59 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement