- గుండెపోటుతో మరొకరి మృతి
నెట్‌వర్క్: రైతు మరణాలు ఆగడం లేదు. నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో వేర్వేరుగా ముగ్గురు మరణించారు. ఇందులో ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా, మరొకరి గుండె ఆగింది. నల్లగొండ జిల్లా మిర్యాలగడూ మండ లం ఐలాపురం గ్రామానికి చెందిన రైతు బానావత్ వెంకటేశ్వర్లు(33) రెండకరాల్లో వరి వేశాడు. బోరు వేసేందుకు అప్ప చేశాడు. సాగు కోసం రూ. 2 లక్షలు అప్పులు చేశాడు. కరెంటు కోతలతో అర ఎకరం పొలం ఎండగా, మిగిలిన పొలానికి దోమపోటు సోకింది.
దీంతో అప్పు తీరే మార్గం కనిపించక బుధవారం పొలం వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. కామినేని ఆస్పత్రికి తరలించగా, గురువారం మృతి చెందాడు. ఇదే జిల్లా గుర్రంపోడు మండలం వట్టికోడుకు చెందిన రైతు బొమ్మకంటి రాములు(35) తనకున్న మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. పెట్టుబడులు, ఇతర కుటుంబ అవసరాల కోసం రూ. 4 లక్షలు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులకు చేను పూర్తిగా దెబ్బతింది. అప్పు తీరే మార్గం కనిపించక మంగళవారం పురుగుల మందు తాగాడు.
జిల్లా కేంద్రంలోని ప్రైవేలు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్‌కు చెందిన రైతు బోండ్ల కిష్టయ్య వర్షాలు లేక తన్నకున్న రెండు ఎకరాలను అలాగే వదిలేశాడు. అయితే, గతేడాది సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమం లో బుధవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.