ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్‌కు హెచ్చరిక
లేకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని వేధింపులు
మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఆనంద్
పల్నాడు జిల్లా గోపాలంవారిపాలెంలో విషాదం
చిలకలూరిపేట: టీడీపీ నాయకుల బెదిరింపులు భరించలేక ఉపాధి హామీ పథకం ఉద్యోగి ఒకరు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గోపాలంవారిపాలెం గ్రామంలో గురువారం జరిగింది. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... గోపాలంవారిపాలెం గ్రామానికి చెందిన జడ ఆనంద్(38) గత 18 సంవత్సరాలుగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్)లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు వచ్చి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆనంద్‌ను ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని హెచ్చరించారు. ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ గురువారం మధ్యాహ్నం తన ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
వెంటనే గమనించిన కుటుంబసభ్యులు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకురాగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. ఆనంద్‌కు భార్య రత్నకుమారి, కుమార్తెలు దివ్య(10వ తరగతి), అర్షిత(8వ తరగతి), మహి(7వ తరగతి) ఉన్నారు. తన భర్త మృతికి గోపాళంవారిపాలెం గ్రామానికి చెందిన చిన్నం రవిబాబు, గోపాళం సాగర్‌బాబు, గోరంట్ల బుజ్జి, గోపాళం శ్రీధర్, మిన్నకంటి వీరబాబు, మానుకొండ బాలయ్య తదితరుల వేధింపులే కారణమని రత్నకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment