
పల్నాడు, సాక్షి: పిడుగురాళ్లలో తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ ఓ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడన్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎపిసోడ్‌లో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కన్నడ నటి, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు(Ranya Rao) పేరు తెర మీదకు రాగా.. పరారీలో ఉన్నాడని చెబుతున్న సదరు వ్యాపారి ఈ అంశంపై స్పందించాడు.
ఏం జరిగిందంటే.. స్థానికంగా తాను మిర్చి ఎగుమతి, బంగారు దిగుమతి చేస్తున్నానని.. తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ సదరు వ్యాపారి ప్రచారం చేశాడు. అయితే అతని ఆర్భాటాలు, అప్పటికే అతను చేసిన దానధర్మాలు చూసిన కొందరు అది నిజమేనని నమ్మారు. దాచేపల్లి, కారంపూడి, సత్తెనపల్లి, నరసరావుపేటకు చెందిన కొందరు సదరు వ్యాపారికి డబ్బు ముట్టజెప్పారు.
మార్చి మొదటి వారం నుంచి ఆ వ్యాపారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో తాము మోసపోయామన్న ఆందోళనతో బాధితులు లబోదిబోమన్నారు. అయితే సదరు వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని భావిస్తుండగా.. అతని పేరిట ఓ వాట్సాప్ సందేశం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
తానేం దేశం విడిచి పారిపోలేదని.. ఇండియాలోనే ఉన్నానని.. తనకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయని, రెండు నెలల టైం ఇస్తే అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఆ ఆడియో మెసేజ్‌లో చెప్పాడు. వందల కోట్లు ఎగ్గొట్టాడని వార్తల్లో వస్తున్న కథనాలను ఆ వ్యాపారి తోసిపుచ్చాడు. అలాగే.. నటి రన్యా రావుతో లింకులు ఉన్నాయంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండించాడు. ఆమెతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని ఆ ఆడియో మెసేజ్‌తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment