
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావు కేసుకు సంబంధించి ఆమె భర్త జతిన్ హుక్కేరీని మరోసారి కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచారు. రన్యారావు చేస్తున్న స్మగ్లింగ్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో జతిన్ ను కస్టడీకి ఇవ్వాలంటూ డీఆర్ఐ కోరింది. ఈ క్రమంలోనే జతిన్ ను మరోసారి ఈరోజు(సోమవారం) కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే రన్యారావు స్మగ్మింగ్ తో తనకు ఏమీ సంబంధం లేదని చెబుతున్న జతిన్.. తాము పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నామని కోర్టుకు తెలిపాడు.
గతేడాది నవంబర్ లో తమ పెళ్లి జరగ్గా, డిసెంబర్ నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని జతిన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తన క్లయింట్ కు ఇందులో ఎటువంటి సంబంధం లేదని, జతిన్ ను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. దాంతో ఏకీభవించిన కోర్టు.. తదుపరి విచారణ వరకూ జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ఈనెల 11వ తేదీన కూడా హైకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేయగా, మరోసారి రన్యారావు భర్త జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని డీఆర్ఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడింది. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. శనివారం సెషన్స్ కోర్టులో బెయిల్ కోరుతూ పిటిషన్ వేయగా దాన్ని కోర్టు తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment